Blog

10 Jun
0

కొన్ని ఆవకాయ పద్యాలు (అంతర్జాల సేకరణ)

కొన్ని ఆవకాయ పద్యాలు (అంతర్జాల సేకరణ)
కం//
శ్రేష్టంబిది పచ్చళ్ళన,
టేష్టున ఇది మొదటనుండు డెఫినెట్ గానూ,
ఇష్టముగ ఆవకాయను
సుష్టుగ తిని దొర్లినంత సుఖమది కలదే!
కం//
ఊరిన ముక్కను కొరకగ,
ఔరా! అది ఎంత రుచిని అందించునయా,
కూరిమితొ నాల్గు ముక్కలు
నోరారా తినని నోరు నోరవ్వదుపో!
కం//
బెల్లము వేసిన మధురము,
పల్లీనూనెను కలపగ పచ్చడి మధురం,
వెల్లుల్లి వేయ మధురము,
పుల్లని మామిడితొ చేయ ముక్కది మధురం!!
ఈ ఆవకాయలోని ముక్కకి చాలా పేర్లు ఉన్నాయి:
కం//
చెక్కందురు, డిప్పందురు,
ముక్కందురు కొంతమంది మురిపెము తోడన్.
డొక్కందురు, మామిడి దిది
పిక్కందురు దీనికన్ని పేర్లున్నవయా!
ఆవకాయ ఉపయోగాలు:
కం//
ఉదయమె బ్రెడ్డున జాముకు
బదులుగ ఇదివాడిచూడు, బ్రహ్మాండములే,
అదియేమి మహిమొ తెలియదు,
పదునుగ నీ బుర్ర అపుడు పనిచేయునయా!
కం//
ఇందువల దందు బాగని
సందేహము వలదు; ఊట సర్వ రుచిహరం
బెందెందు కలపి చూసిన,
అందందే రుచిగనుండు, అద్భుత రీతిన్!
ఆవకాయ అవతరణ:
కం//
“చప్పటి దుంపలు తినుచును,
తిప్పలు పడుచుంటిమయ్య, దేవా, దయతో
గొప్పగు మార్గం బొక్కటి
చెప్పుము మా నాల్కలొక్క చింతలు తీర్పన్”
అంటూ,
కం//
ముక్కోటి దేవులందరు
మ్రొక్కగ తా జిహ్వలేప సృష్టించెనయా
చక్కనిది ఆవకాయన
ముక్క తినని వాడు కొండముచ్చై పుట్టున్!!
కం//
చారెరుగనివాడును, గో
దారిన తా నొక్కమారు తడవని వాడున్,
కూరిమిన ఆవకాయను
ఆరారగ తిననివాడు, ఆంధ్రుడు కాడోయ్!
courtesy Durga Cheruvu ·

Read More
06 Jun
0

Lovely! I am humbled. Thank you :-)

Read More
17 May
0

I think IPL is not good for India

I never bothered to watch IPL. It is not that I don’t like cricket. Basically watching it takes away too much of quality time. More over, I am convinced IPL is not good for India. We know that 40% of India’s population is poor. They struggle to live their life. We also know that IPL gets hefty sponsorship money from various FMCG companies. There is no such thing called ‘Free Lunch’. In fact, these IPL sponsoring companies are not doing any charity! They pass on this IPL sponsorship cost to their buyers. So in the end, a toilet soap which should cost 1 rupee will cost 2 rupees because of the sponsorship. Thus, it is the poor person of India who suffers from this unwanted, unexplained corporate imposed indirect taxes!! The reality is that the poor person of India is paying for the Middle class people to watch Cricket. Poor person of India thinks he is buying a toilet soap, but he is paying for middle class people to watch cricket. Now we came to know it is a total scandal. IPL is a total fixed up match. Sub ke sub chor hai…

http://zeenews.india.com/sports/cricket/live-spot-fixing-in-ipl_761485.html

Read More
21 Apr
0

రామావతారం – ఎందుకు శ్రీరామనవమినాడు మనం సీతారామకల్యాణం జరుపుకుంటాము

శ్రీరామచంద్రుడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో, అభిజిత్ ముహూర్తంలో (మధ్యాహ్మం 12 గంటల వేళలో) త్రేతాయుగంలో జన్మించాడు. ఆ అవతారదినాన్నే ప్రజలు శ్రీరామనవమి పండుగగా జరుపుకుంటారు. ఇకపోతే  పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము, రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగింది అని చెబుతారు.   
రామాయణం ఒక మహాకావ్యం.  సంస్కృత కావ్యలక్షణాలన్నీ ఉన్న ఇతిహాసమే రామాయణం.  నిజంగా జరిగిన కధను మనం ఇతిహాసం అనీనూ, జరిగిందోలేదో ఇదమిత్థంగా తెలియని కధలను పురాణం అనీనూ అంటాము.  మనకు ఉన్నవి పద్దెనిమిది పురాణాలు అలాగే రామాయణము భారతమూ అనే రెండు ఇతిహాసాసాలు.   శ్రీమద్రామాయణం అని మనం పిలుచుకునే ఐతిహాసిక మహాకావ్యానికి వాల్మీకి మహర్షి పెట్టినపేరు ’పౌలస్త్యవధ’ రావణుడు పౌలస్త్యుడు అతడి వధకు చెందిన కధ కాబట్టి శ్రీమద్రామాయణానికి పౌలస్త్యవధ అని పేరు.  వాల్మీకి మహర్షి రాసిన రామాయణం పౌలస్త్యవధతో శ్రీరామ పట్టాభిషేకంతో పూర్తవుతుంది.  ఆ తర్వాత రాయబడ్డ ఉత్తరరామాయణం వాల్మీకి మహర్షి రాసినదికాదని పండితుల అభిప్రాయం.  వాల్మీకి శ్రీమద్రామాయణంలో రాసిన శ్లోకాలకు విరుద్ధమైన ’రాముడు మాంసభక్షణ’ చెయ్యడం, సీతమ్మను అడవులకు పంపడం వంటి వాల్మీకిమహర్షి ’కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కస్య వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ…’ అంటూ తార్కికంగా ప్రతిపాదించిన  శ్రీరామ గుణలక్షణ విరుద్ధమైన సంఘటనలు ఉత్తరరామాయణంలో ఉంటాయి.  అంతేకాకుండా ఉత్తరరామాయణం లేకుండానే కావ్యలక్షణాలు పౌలస్త్యవధకు చక్కగా సరిపోతాయి.  అంటే రామాయణంలో ఉత్తరరామాయణంలేకపోయినా రామాయణమహాకావ్య లక్షణాలకు భంగం కలుగదు. కాబట్టి వాల్మీకి రామాయణం రామపట్టాభిషేకంతో సంపూర్తిఅవుతుందని పండితాభిప్రాయం. సరే అదంతా వేరొక చర్చ…
 
రామనవమినాడు సీతారామకల్యాణం ఎందుకుచేస్తారు? అని ప్రశ్న.  శ్రీరాముడు అవతారపురుషుడు.  శ్రీరాముని అవతారలక్ష్యమే పౌలస్త్యవధ.  ఆయన జన్మించినది రావణుడనే రాక్షసుడిని చంపడానికి.  రావణుడు సీతమ్మను ఎత్తుకుపోతాడు.  రాముడు రావణుడిని చంపి తన భార్యను కాపాడుకుంటాడు.  అంటే ఆయన జన్మకు, సీతారామకల్యాణానికి అవిభాజ్యమైన బ్రహ్మముడి ఉన్నది. అందుకే ఆయన జన్మదినంనాడే మనం శ్రీసీతారామకల్యాణం జరుపుకుని ఆయన అవతార వైభవాన్ని ఆయన అవతార ప్రాసస్త్యాన్ని గుర్తుచేసుకుంటాము. ఆయన జన్మించినది రావణుడిని చంపడానికైతే, రావణుడు ఆయన భార్యను ఎత్తుకెళ్లేంతవరకు రావణవధకు తగిన సమయం ఆసన్నంకాదు.  అందుకే ఆయన కల్యాణం జరిపి సీతమ్మను ఆయనపక్కన కూర్చుండబెట్టి వారిద్దరి అవతార మాహాత్మ్యాన్ని మనం శ్రీరామ నవమినాడు గుర్తుతెచ్చుకుంటాము.
ఆయన పెళ్లి చూసిన ప్రతిఒక్కడూ పరస్త్రీ పై పరుని భార్యపై రావణునిలా కన్ను పడితే రామబాణం వచ్చి తగులుతుందని ఒక గుణపాఠంగా గుర్తుతెచ్చుకుంటారు.  ఇదీ మనం శ్రీరామనవమినాడు శ్రీసీతారామకల్యాణం జరుపుకోవడంలో గల ఒక అంతర్యం.  స్వస్తి…. -మాధవ తురుమెళ్ల, లండన్, 21 ఏప్రిల్ 2013

Read More
31 Mar
0

కన్సర్వేటిజం – భారతదేశంలోని సోషలిజంలోని లొసుగులు – దేవాలయంలో దేవునిపైపోసిన పాలు..

కన్సర్వేటిజం – భారతదేశంలోని సోషలిజంలోని లొసుగులు – దేవాలయంలో దేవునిపైపోసిన పాలు..

ప్రజలందరూ కలిసి తమ రాజ్యాన్ని నడుపుకోవడానికి కొంతమంది మనుషులని పనివారుగా జీతభత్యాలు ఇచ్చి పనిలో పెట్టుకుంటారు. వీళ్లనే మీరు గవర్నమెంటు ఆఫీసుల్లో చూస్తుంటారు. అంతేకాకుండా తమకు అవసరమైన విషయాలపై చట్టాలుచేసేటందుకు, తము నియమించిన పనివారు గవర్నమెంటు ఆఫీసుల్లో వారి పనులు సక్రమంగా నిర్వహిస్తున్నారో లేదో చూసుకోవడానికి చట్టసభలకు కొంతమంది ప్రతినిధులను ఎన్నుకుంటారు. ఈ ప్రతినిధులే ఎమ్మెల్లేలుగా ఎంపీలుగా మనకు కనబడుతుంటారు. వీళ్లే అధికారిక కమిటీ చైర్మన్లుగా ప్రజల తరఫున వ్యవహారాలు నిర్వహిస్తుంటారు.

అయితే దీనికంతటికీ ఖర్చు అవుతుంది…. ఈ ఖర్చులే మనం పన్నులరూపంలో చెల్లిస్తుంటాము. అలాగే ఖనిజాల ఎగుమతిగూడా చేసి డబ్బులు సంపాదించి ప్రజలు తమబాగోగులు తాము చూసుకుంటుంటారు.

ఉదాహరణకు ఒక వ్యక్తి వందరూపాయలు సంపాదిస్తుంటే, అతడు కట్టే వందరూపాయల్లో నలభైరూపాయలు గవర్నమెంటుని పోషించడానికి అంటే అతనికింద ’భారతదేశం అంతటా’ పనిచేస్తున్న పనివారికి, అలాగే అతను నియమించిన ఎమ్మెల్లేలకు ఎంపిలకు ఖర్చు అవుతుంది. ఇక మిగిలిన అరవై రూపాయల్లో అతను తన బిడ్డలకు పాలు పోషకాహారము చదువు అందించి తాను తిని, తనను సుఖంగా చూసుకుంటుంన్నందుకు తన దేవుడిపై కొంత ఖర్చుపెడతాడు… అయితే దేవాలయాల్లో పాలుపోస్తున్నంతమాత్రాన అది బాధ్యతా రాహిత్యం గాదు.

ఇకపోతే ఆ నలబైరూపాయలు సంపాదిందిన గవర్నమెంటు ఏంచేస్తోందో చూద్దాము. ఆ డబ్బుని ఏ పిల్లలకైతే అవసరమో ఆ పిల్లలందరికీ సమానంగా పంచాలి. కానీ అలా పంపిణీ జరగదు. అంటే కులప్రాతిపదికమీదమాత్రమే పంపకం జరుగుతుంది. నిరుపేద బ్రాహ్మణుడి పిల్లలకు పాలు లేకపోయినా ప్రభుత్వం పట్టించుకోదు… కానీ పన్నులుమాత్రం అందరినుండీ సమానంగా సంపాదిస్తుంది…. ఇది సోషలిజంలోని లొసుగు. అంటే ప్రజలు మేమందరమూ సమానంగా పన్నులు కడుతున్నపుడు మా పిల్లలందరికీ సమానంగా ఎందుకు న్యాయం జరగడంలేదు అని అడగలేని నిస్సహాయస్థితిని సోషలిజం కలిగిస్తుంది.

మనం కట్టిన ఆ నలభైరూపాయల పన్నులో ఒక వెయ్యిమంది గవర్నమెంటు ఆఫీసుల్లో పనిచేస్తున్నారనుకోండి వాళ్లకు జీతాలు ఇవ్వాలి. వాళ్లు పనిచేసినా చెయ్యకపోయినా వాళ్లకు సదుపాయాలు అందించాలి. పైగా అక్కడగూడా కులాలప్రాతిపదికమీదే ఉద్యోగనియామకాలు జరుగుతాయి. ఎంతమంది పనివారు ఉంటే అంత ఖర్చు అవుతుంది. సోషలిజంలోని ప్రభుత్వాలలో ఇది రెండవ లొసుగు. అంటే అతి ఎక్కువమందిని పనిలో పెట్టుకుని వాళ్లకు జీతభత్యాలు అందిస్తుంటారు, పని ఉన్నాలేకపోయినా సరే! దానివల్ల ప్రజలు కట్టాల్సిన పన్నుల బాధ్యత పెరుగుతుంది. ఇది ఎంతదూరం వెళుతుందంటే సంవత్సరానికి ఒకసారి బడ్జెట్ రూపంలో ప్రభుత్వం చెప్పే లెక్కలు చూడడమేతప్ప ఇంత డబ్బు నేను ఎందుకు కట్టాలి? అని అడగలేని నిస్సహాయస్థితిని సోషలిజం కల్గిస్తుంది.

ఇప్పుడు భారతదేశంలో జరుగుతున్నదేంటంటే గవర్నమెంటువారు మీవద్ద నడ్డి విరగ్గొట్టి పన్ను వసూలు చేస్తారు, పైగా పిల్లలకు సదుపాయాలు అందించరు. ఎక్కువమంది ప్రజలు ప్రభుత్వంలో పనిచేస్తూ అధికారాన్ని తమకింద ఉంచుకుంటారు, వీళ్లని నడిపిస్తూ కొంతమంది అత్యంత ఎక్కువ అధికారం కలిగిన నియంతలు పనిచేస్తుంటారు. ఆ పనిచేసేవారు లంచగొండులుగా మారినపుడు, ఆ నియంతలకు ప్రజల బాగోగులు పట్టనప్పుడు దేశంలో పిల్లలు ఆకలితోను సౌకర్యాలు లేక మరణిస్తారు. పేదలు మరింత పేదలుగా మారతారు. రష్యాలో సోషలిజం పతనం దీనివల్లే జరిగింది…. ఎక్కువమంది ప్రభుత్వాలలో పనిచేస్తూ ప్రజలనుండి పన్నులను వసూలుచేస్తూ ప్రజల బాగోగులను మర్చిపోయారు.

ప్రజలు కట్టిన పన్నులు సక్రమంగా పంపిణీచెయ్యడమే ప్రభుత్వంయొక్క బాధ్యత…. కానీ ఆ బాధ్యత ప్రభుత్వం చెయ్యలేనపుడు సోషలిజాన్ని తగ్గించి వ్యక్తి స్వాతంత్య్రాన్ని పెంచడం మంచిది. అంటే ఒక వ్యక్తిగా నాకు నచ్చిన పద్ధతిలో నేను దానధర్మాలు చెయ్యడానికి నా చుట్టుపక్కలవారి బాగోగులు చూసుకోవడానికి నాకు స్వతంత్య్రం ఉండాలి…. అంటే నాపైన పన్నులభారం అతి తక్కువగా ఉండాలి….. బలవంతంగా నానుండి పన్నులు వసూలు చేసి నాకు నచ్చని వ్యవహారాలపై ఖర్చుపెడితే నేను ప్రతిఘటించే అవకాశం నాకు ఉండాలి. దీన్నే ఇతరదేశాలలో కన్సర్వేటిజం అంటారు. వ్యక్తికి ఆలోచించే స్వేచ్చమాత్రమేగాదు, తన ఆలోచనలను ఆచరణలో పెట్టగల విత్తంగూడా అతనివద్ద ఉండాలి.

కన్సర్వేటిజం ఆలోచన ప్రకారం ఎంత తక్కువమంది పనివారు ప్రభుత్వంలో ఉంటే అంత మంచిది. దానివల్ల ప్రజలు కట్టాల్సిన పన్నులు తగ్గుతాయి. అంటే నలభైరూపాయల పన్ను బదులుగా ఇరవైరూపాయల పన్నుమాత్రమే అవసరం అవుతుంది. ఆ మిగిలిన ఇరవై రూపాయలను వ్యక్తి తనకు తోచిన రీతిలో తాను దానధర్మాలు చేయచ్చు. అంటే నాకు నా పిల్లల చదువుకు మంచి స్కూలు కావాలని ఉంది అనుకోండి. గవర్నమెంటుకు నేను అప్పటికే ఎంతో ఎక్కువ డబ్బు ఇచ్చేసి ఉంటాను ’స్కూలు కట్టించండి’ అని. కానీ వారు కట్టరు ఎందుకంటే టెండర్లు, రిజర్వేషన్లు, మన్ను, మశానం అని వాళ్లు కట్టించేసరికి పుణ్యకాలం పూర్తవుతుంది… అప్పటిక్ నా పిల్లలు పెరిగి పెద్దవారయిపోయి ఉంటారు. అలాకాకుండా నేను గవర్నమెంటుమీద ఆధారపడకుండా స్కూలు కట్టుకున్నాననుకోండి దానివల్ల నాకు వెంఠనే సదుపాయం అవుతుంది.

వ్యక్తులు ఆనందంగా ఉంటేనే సక్రమంగా పనిచేయగలుగుతారు. వ్యక్తులు స్వేఛ్ఛగా ఉన్నప్పుడే స్వేఛ్ఛాపూరితమైన ఆలోచనలు చెయ్యగలుగుతారు. స్వేచ్చగా నివసించే మానవుడు మాత్రమే తోటి మానవుని స్వేచ్చగురించి వ్యక్తిగత బాధ్యత స్వీకరించగలుగుతాడు. అటువంటి వ్యక్తి స్వేచ్చని సోషలిజం పేరుతో హరించేస్తే ఆ మానవుడు తాను నివసించే సమాజంపై తనకుగల వ్యక్తిగత బాధ్యతను పక్కనబెట్టి ప్రతిదానికీ ప్రభుత్వంపై ఆధారపడతాడు. అంటే స్కూలు కట్టించాలన్నా బావితవ్వించాలన్నా గవర్నమెంటు సహాయం, వాళ్ల అనుమతి, వాళ్ల లెక్కలు అడుగుతుంటాడు. ఈవిధంగా సోషలిజంలో తన స్వేచ్చని కోల్పోయి ప్రభుత్వానికి కట్టుబానిసగా మారతాడు. అంటే సాలెపురుగు తాను కట్టుకున్న గూటిలో తానే చిక్కుకున్నట్లుగా, సోషలిజంలో నివసించే వ్యక్తి తనకోసం తనబాగోగులకోసం తను నియమించుకున్న వ్యక్తులచేతుల్లో (ప్రభుత్వాధికారుల చేతుల్లో) తానే బందీగా మారతాడు…. దీనికి ఒక్కటే మార్గం. ప్రభుత్వాన్ని తగ్గించడం ఎంత తక్కువ ప్రభుత్వం ఉంటే అంత మంచిది…. దీన్నే కన్సర్వేటిజం అంటారు. ఒకప్పుడు భారతదేశంలో ఎక్కువమంది కన్సర్వేటివ్ లు ఉండేవారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లోని అధికారకమిటీలో ఒక్క జవహర్ లాల్ నెహ్రూ తప్పనించి మిగిలినవారందరూ కన్సర్వేటివ్ లుగా ఉండేవారని వారి ఆలోచనా ధోరణివల్ల మనకు తెలుస్తుంది. సర్దార్ వల్లభభాయ్ పటేల్ అలాగే దాదాభాయ్ నౌరోజి ఆ కాలంలో చాలా పేరుమోసిన కన్సర్వేటివ్ లు. కానీ నెహ్రూ మాత్రం దేశాన్ని సోషలిజంవైపు ప్రభుత్వనియంతృత్వంవైపు నడిపించాడు. ఇది భారతదేశపు దురదృష్టం.

ఉదాహరణకు అజ్మల్ కసబ్ ను పోషించడానికి ప్రభుత్వం ఇరవైకోట్లు ఖర్చుపెట్టిందట! ఆ ఇరవైకోట్లు ఎక్కడనుండి వచ్చాయి? ప్రజలు కట్టిన పన్నులనుండే ఖర్చుపెట్టాలిగదా? మరి ఆ పన్నులలోనుండి ఇరవైకోట్లు అజ్మల్ కసబ్ పై ఖర్చుపెట్టమని ఏ ప్రజలు చెప్పారు?! అంటే ప్రజల తరఫున ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. ఖర్చుపెడుతుంది. కానీ చిక్కల్లా ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లుగా నిర్ణాయాలు తీసుకోవడంలోనే వస్తుంది. అంటే ఎక్కడ నిజంగా ఖర్చుపెట్టాలో అక్కడ ఖర్చుపెట్టాలి. పసిపిల్లలకు పాలు పొయ్యడానికి వాళ్లపై ఆ ఇరవైకోట్లు ఖర్చుపెట్టిఉంటే బాగుండేది…. కానీ అజ్మల్ కసబ్ పై ఖర్చుపెట్టడానికి ప్రభుత్వం పూనుకుంది. ఇది సోషలిజంలోని అంతర్లీనమైన ఇంకొక లొసుగు.

అమ్మ పెట్టదు అడుక్కు తినానివ్వదు అన్నట్లుగా సోషలిజం పేరుతో నడ్డి విరగ్గొట్టే పన్నులు వేసి, పైగా ప్రజలకింద పనిచేసే పనివారు తమ అధికారాన్ని అడ్డంపెట్టుకుని లంచగొండులుగా మారుతుంటే అరికట్టే కార్యక్రమాలు చేపట్టకుండా “నేను సోషలిష్టుని కాదు” అని చెప్పే ఏ వ్యక్తిని ఏ రాజకీయపార్టీని ప్రభుత్వానికి పోటీపడకుండా చట్టాలలో మార్పులు తెచ్చింది. అందువల్ల ఇప్పుడు భారతదేశపు ఎన్నికల్లో పోటీచేసే ప్రతి రాజకీయపార్టీ ’సోషలిష్టు’ పార్టీ మాత్రమే. ’నేను సోషలిజాన్ని సమర్ధిస్తాను’ అని చెప్పి సంతకం పెట్టందే ఏ వ్యక్తీ చట్టసభకు ఎన్నికకావడానికి వీలులేదు. ఎన్నికలదరఖాస్తుపత్రంలో ’నేను సోషలిష్టుని’ అని ఒక టిక్ బాక్స్ ఉంటుంది గమనించండి….

కాబట్టి దేవుడిని నమ్మడం ఆయనపై పాలుపొయ్యడం భక్తి…. కానీ ఆ భక్తుడిని అనేకవేలమంది పసిపిల్లలు చనిపోతుంటే నీకు భక్తి ఎక్కువైందా అని ప్రశ్నించడం ఆ ప్రశ్నించే వ్యక్తి బాధ్యతా రాహిత్యమే…. ’ఏం నేను కట్టే పన్నులను ఏంచేస్తున్నావు? నావద్ద ఏవిధమైన విత్తంలేకుండా నావద్ద ఉన్నదంతా పన్నురూపంలో సోషలిష్టు రూపంలో దోచుకుంటూ పైగా నా విశ్వాసాన్నిగూడా నాకు లేకుండా చేస్తావా?!’ అని అడగలేని నిస్సహాయస్థితిలో ఈనాడు దేశం ఉంది… -మాధవ తురుమెళ్ల, లండన్, 31-మార్చి-2013

Read More
12 Mar
0

నా ఆలోచన: ప్రవక్ష్యామి అనసూయవే

అసూయ అనేదానికి దగ్గరదూరాలు లేవు.  అది ప్రతిమానవునిలోనూ పుట్టుకతోటే సహజంగా వస్తుంది.  అసూయ అంటే తను చేరుకోవాల్సిన స్థితిని ఆనందాన్ని అందుకొవాల్సిన స్థితిని ఇంకొకరు అందుకున్నారు అనే ఊహ మాత్రమే! కానీ ఆ ఊహ నిజం కాకపోవచ్చు ‘దూరపుకొండలు నునుపు‘ అనే సామెత అందుకే పుట్టింది.  ఉదాహరణకు ఒకడు ఇల్లు కట్టుకోవాలనుకున్నాడు, వాడికి రాజభవనంలో నివసించే వాడొకడు కనబడ్డాడనుకోండి…  ఆ రాజభవనంలో ఉన్నవాడిని చూసి ఇల్లు కట్టుకోవాలనుకున్నవాడికి తన కోరికకితోడు అసూయగూడా వస్తుంది.  ఎందుకు?!  ఎందుకంటే ఇల్లుకట్టిన తర్వాత వస్తుంది అనే ఊహాజనితమైన  ‘ఆనందం‘ ఏదైతే ఉందో పరిపూర్ణత ఏదైతే ఉందో దానిని ఆ రాజభవనంలో నివసించేవాడు ఇప్పటికే ఆస్వాదించేస్తున్నాడు అని ‘ఇల్లుకట్టుకోవాలనుకునేవాడి‘లో ‘రాజభవనంలో ఉంటున్నవాడిని‘ చూసి కలిగే గ్లానే అసూయ!  అయితే ఆ రాజభవనంలో ఉన్నవాడికి తను ఉన్న రాజభవనమే తన ఉనికికి ప్రతిబంధకంగా మారచ్చు.  వాడు ఏ ఇల్లూలేనివాడిని చూసి ‘అసూయ‘ పడచ్చు అది సహజం… అన్నీ ఉండి దర్జాగా ఉండాల్సిన ’మార్లిన్ మన్రో’ వంటి ప్రముఖ వ్యక్తులు కొంతమంది అకారణంగా ఆత్మహత్యలు చేసుకోవడానికి ఈ ఆనందగ్లాని కారణం. కాబట్టి దీనివల్ల మనకు అర్థమయేదేంటంటే అసూయ అనేది ‘ఆనందమీమాంసకు‘ చెందిన ఒక మానసికమైన స్థితియేగానీ దానికి భౌతికమైన వస్తువులతో సంబంధంలేదు. కానీ దురదృష్టవశాత్తూ మనకు మనలోదాగిఉన్న అసూయ మనం భౌతికమైన వస్తువులను పొందడంద్వారానో పోగొట్టుకోవడం ద్వారానో మాత్రమే తెలిసివస్తుంది!  మహాభారతగ్రంధం దుర్యోధనునిలోని అసూయకు రాయబడ్డ చిట్టాపద్దు.  నిజానికి అసూయ అనేది తప్పుగాదు. అసూయలేకపోతే నీవు దేన్ని పొందాలనుకున్నావో దానిగురించి నీకు ఆలోచనగూడా రాదు.  అసూయ ఉండటం మృగాలకు సహజం.  కానీ యోగులు కావాలనుకున్న మానవులలో అసూయ అనేది ఆత్మసాక్షాత్కారానికి ప్రతిబంధకం!  మీరు మానవునిగా బ్రతికేటప్పుడు అసూయ మీకు ఉపయోగపడుతుంది కానీ మహనీయునిగా మారాలనుకున్నప్పుడు మీలోని అసూయే మీకు ప్రతిబంధకమవుతుంది.  మానవులు   ‘మత్వా కర్మాణి కుర్వంతే‘ — ఆలోచించి పనిచేస్తుంటారు.  నిజంగా ఆలోచించగలిగినవానికి ఆత్మానుసంధానం కలిగినవానికి ‘అసూయ‘ ఉండగూడదు.  అందుకే భగవద్గీతలో ‘ప్రవక్ష్యామి అనసూయవే‘ – ‘నీవు ఏవిధమైన అసూయ లేనివాడివిగాబట్టే నీకు అతి రహస్యమైన ఈ జ్ఞానాన్ని ఉపదేశిస్తున్నాను అర్జునా‘ అంటూ శ్రీకృష్ణపరమాత్మ జ్ఞానాన్ని పొందడానికి అర్జునునిగల అర్హతను సూచించారు.

అయితే ఇక్కడ  ‘అసూయ ఆత్మప్రబోధానికి ఎలా వ్యతిరేకం ?‘ అనే ప్రశ్నరావచ్చు.  ఒక ఉదాహరణ చూద్దాము.  ఒక వ్యక్తి వద్ద ఒక ఖరీదైన వజ్రం ఉండేది. అదంటే అతనికి ప్రాణం.  ఆ వజ్రాన్ని మెరుగుపెట్టి తుడిచి కడిగి దాని విలువని తెలుసుకుంటూ అతడు ఆనందాన్ని పొందేవాడు. కానీ ఒకనాడు అతడు ఆ వజ్రాన్ని  పోగొట్టుకున్నాడు.  భోరుమని ఏడుస్తున్నాడు. తన ఇల్లంతా ఆ వజ్రంకోసం వెదుకుతూ అతలాకుతలం చేస్తున్నాడు.   ‘అతడు ఎందుకు ఏడుస్తున్నాడు?‘ అని మనం ప్రశ్నించుకుంటే ‘వజ్రం పోగొట్టుకుని‘ అని సమాధానం.  అంటే ఒకప్పుడు అతనివద్ద ఉన్న వజ్రం అతనికి ‘ఆనందాన్ని‘ ఇచ్చింది.  ఆ ‘ఆనందం‘ పోయినందువల్ల ఇప్పుడతడు దుఃఖపడుతున్నాడు… ఇంకొంచెం లోతుకు వెళ్లి చూద్దాము.  అసలు అతనివద్ద వజ్రం అనేదే లేదు అనుకుందాము.  అతడు పొందిందీ లేదు పోగొట్టుకున్నదీ లేదు కాబట్టి అతడికి దుఃఖం ఉండేదికాదు.  కానీ నిజానికి అతనివద్ద ఒక వజ్రం ఉండేది…. అందుకే దానిని పోగొట్టుకుని అతడు ఏడుస్తున్నాడు.  ఆ పోగొట్టుకున్న వజ్రాన్ని తిరిగి పొందుదామని ఇల్లంతా వెదుకుతున్నాడు.  ఇప్పుడు అతడి వద్ద వజ్రం ఉందా?!  ‘లేదు‘ కానీ ‘ఒకప్పుడు ఉండేది‘  ఆ ఒకప్పుడు ఉన్న ఆనందపు ‘ఎరుక‘ జ్ఞాపకం అతడిని ఆ వజ్రాన్ని వెదకడానికి ప్రేరేపిస్తున్నాయి….

ఈ వజ్రం పోగొట్టుకున్నవాని ఉదాహరణ మన దైనందిన జీవనానికి అనువయిస్తే… మనం అందరమూ ఎందుకు అసూయపడుతున్నాము అంటే ‘వస్తువుని పొందినందువల్ల వచ్చే ఊహాజనితమైన ఆనందం‘ ఎదుటివానికి అప్పటికే లభించింది అనే భావనవల్ల.

“పొందాలనుకున్నది ఆనందాన్ని కానీ అనుభవిస్తున్నదిమాత్రం అసూయను!”  చూసారామాయ!

కాబట్టి ఉపాయంతో ఆ ఆనందాన్ని అనుభవిస్తే దాన్ని గురించిన కిటుకు అర్ధమైతే అసూయ అనేమాటకు తావే లేదు.   ఇది ఒక్క మానవులకే సాధ్యం (మత్వాకర్మాణి కుర్వంతే).  వజ్రాన్ని పోగొట్టుకున్నవాడే వజ్రాన్ని గుర్తుపెట్టుకోగలడు, దానిగురించి ఏడ్వగలడు.  అలాగే ఒకప్పుడు వజ్రంలాంటి ‘ఆనందాన్ని‘ కలిగి ఉన్నవాడే దానిని పోగొట్టుకోగలడు ‘ఏడ్వగలడు‘ – దానిగురించి వెదకగలడు.  అసలు తనజీవనంలో ఏనాడూ వజ్రం అనేది తెలియనివాడు దాన్ని ఎలా పోగొట్టుకోలేడో, పోగొట్టుకుని ఏడవలేడో, అలాగే ఆనందాన్ని గురించి తెలియనివాడు దాన్ని పోగొట్టుకోలేడు దాన్నిగూర్చి వెదకలేడు…. దీనిని బట్టి మనకు అర్ధమయేదేంటంటే ‘మనవద్ద ఒకప్పుడు పూర్ణమైన ఆనందం ఉండేది‘ కాబట్టి దాన్ని పోగొట్టుకుని ఇప్పుడు మనం దుఃఖపడుతున్నాము అసూయపడుతున్నాము.   అందుకే మనం ‘ఒకానొకప్పుడు మనహక్కు అయిన వజ్రంలాంటి ఆనందాన్ని పొంది పోగొట్టుకుని ఈ ప్రపంచంలో ఆ ఆనందంకోసం వెదుకుతున్నాము ఏడుస్తున్నాము.‘  మూలంగా చూస్తే ఒకప్పుడు మనం ఆనందస్వరూపాలం అయి ఉండాలి.  లేకపోతే మనం ప్రపంచంలో ఆనందంకోసం ఎందుకు ఎప్పుడూ ‘వజ్రాన్ని పోగొట్టుకున్నవాడిలాగా‘ వెదుకుతున్నాము?!

సరే!  ఇప్పుడు ఇంకొక ప్రశ్న:  వజ్రం పోగొట్టుకున్నది ఎప్పుడో తెలుసు…. ఆనందం పోగొట్టుకున్నదెప్పుడో మనకు తెలుసా?!  వేదాంతం ఏం చెబుతుందంటే నీవు ఏనాడూ ఆనందాన్ని పోగొట్టుకోలేదు కానీ అవిద్యవల్ల మాయవల్ల ‘పోగొట్టుకున్నాను‘ అనే భ్రమ కలుగుతూంటుంది ‘స్వకంఠాభరణం యధా‘ మెడలో హారం తగిలించుకుని ఆ విషయం మర్చిపోయి ఇల్లంతా హారంకోసం వెదికే ఇంటావిడ ఉదాహరణ ఇచ్చారు.  ఆవిడ ఎంతవెదికినా హారం కనబడదు ఎందుకంటే ఆవిడ దాన్ని పోగొట్టుకున్నదేలేదు… తనమెడలో ఉన్నహారం తాను మర్చిపోవడమే అవిద్య…. అంటే (మెడలో హారం ఉండడం వల్ల) కలిగిఉన్న ఆనందాన్ని ఆవిడ పోగొట్టుకున్నదే లేదు…. కానీ తాత్కాలికంగా పోగొట్టుకున్నానని ఊహించి తాత్కాలికంగా దుఃఖపడింది.   మనం ఆనందాన్ని పోగొట్టుకున్నదే లేదు.  కాబట్టి దుఃఖం ప్రసక్తి ఉండగూడదు… ఇక ఫోగొట్టుకొనని దానినిగురించి అసూయ పడే ప్రశ్న ఎక్కడిది?!   మనం ఆనందం ఎప్పుడు పోగొట్టుకున్నాము అంటే ప్రతి ఆలోచనా చీమలాంటిది.. నీలోని ఆనందం అనే తియ్యని పంచదారకుప్పనుండి ఒక్కొక్కరేణువుని మెల్లగా తీసుకుని వెళ్లిపోతుంటుంది.  కాబట్టి నీ ఆలోచనలను గమనించు నీవు ఎందుకు ఆనందాన్ని పోగొట్టుకుంటున్నావో అర్దమవుతుంది….

ఇకపోతే ఎవరో అడిగారు కామక్రోధలోభమోహమదమాత్సర్యములు అనేవి ఒకదానితర్వాత ఇంకొకటి హెచ్చుగా చివరకు మాత్సర్యం అన్నింటికంటే గొప్ప ప్రమాదకారిగా అంటూంటారు నిజమేనా అని…..

నాకు నా మహనీయులైన బ్రహ్మవిదులైన మా గురువుల బోధవల్ల అర్ధమైనంతవరకు కామక్రోధమోహమదమాత్సర్యాలు ఒకదానికంటే ఇంకొకటి హెచ్చు ప్రమాదకారులు కావు. అన్నీ సమానంగా ప్రమాదకారులే. అయితే వీటిలో మూడు చాలా ఎక్కువ ప్రమాదకారులు ఈ మూడిటితో మిగిలిన మూడు కూడినప్పుడు జరిగేది ఉపద్రవమే! అగ్నికి ఆజ్యం జోడిస్తే ఎంత ప్రమాదమో అలాగ కామానికి క్రోధం జోడయితే ప్రమాదం!

మోహము మదము మాత్సర్యము ఈ మూడూ అనుసంధానాలు. అంటే కామానికి మోహం అనుసంధానం, క్రోధానికి మదం అనుసంధానం అలాగే లోభానికి మాత్సర్యం అనుసంధానం.

త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామం క్రోధం తధా లోభం తస్మాదేతత్రయం త్యజేత్| (గీత 21/16) అర్జునా ఇక్కడ మూడు నరకములున్నాయి అవి ఆత్మసాక్షాత్కారానికి ఉన్న ద్వారాన్ని నాశనం చేస్తాయి అవి కామము, క్రోధము, లోభము కాబట్టి ఈ మూడిటినీ వదిలిపెట్టెయ్యాలి.

కామమును క్రోధమును లోభమును వదిలిపెట్టగలము ఎందుకంటే అవి మనను జన్మతరువాత మాయలో పుట్టి పట్టుకునేవి కానీ మోహము మదము మాత్సర్యము అనేవి సహజ జంతు లక్షణాలు ఇవి శాంతింపబడాలేతప్ప మనం వాటిని వదిలిపెట్టలేము. అగ్నికి ఆజ్యం జోడించకపోతే ఎలా అది దానంతట అదే నశించిపోతుందో అలా అన్నమాట.

క్రోధం అనేది ఉపయోగపడుతుంది అంటే తనే గొప్ప అనుకోవడం ’మదం’ ఇక ఈ మదానికి అంటే తన గొప్పదనానికి ఆటంకం ఏదైనా కలిగితే పుట్టే క్రోధం అత్యంత ప్రమాదకారి. కానీ మదంలేని క్రోధం ఉపయోగపడుతుంది. మహాత్ములు సత్యక్రోధులు శ్రీరామచంద్రుడిని సత్యక్రోధుడు అంటారు. అంటే తమలోని సహజ ప్రకృతులను ఆత్మోద్ధరణకు లోకోద్ధరణకు వాడేవారు.

నిజానికి ఆలోచించి చూస్తే అసూయలేనినాడు విశ్వామిత్రుడు వశిష్ఠునితో పోటీపడేవాడా?! కానీ విశ్వామిత్రునిది లోభంతో కూడిన అసూయ. అంటే లోభిగా లుభ్దత్వానికి లోనయి బ్రహ్మర్షి అని పిలిపించుకోవాలని తాపత్రయపడ్డాడే గానీ తనలోని లోభం మాయమైననాడు తను సహజంగానే బ్రహ్మర్షిగా అవుతాడు అని గ్రహించలేకపోయాడు. ఆ తర్వాత ’తపసా బ్రహ్మవిజిజ్ఞాసస్వ’ తపస్సుద్వారా బ్రహ్మవిజిజ్ఞాసకలిగి లోభంపోగొట్టుకున్నాడు, లోభం పోయిననాడు అసూయ అనుకుండానే సమసిపోయింది. అందువల్ల బ్రహ్మర్షి అయాడు.

అలాగే మోహం అనేదిగూడా ఉపయోగపడుతుంది. తల్లితండ్రులకు కలిగే మోహమే పిల్లలను పుట్టించేటట్లు చేస్తుంది. మోహంలేనినాడు సృష్టికార్యం జరగదు. భర్త తన భార్యపట్ల ప్రేమికుడు తన ప్రియురాలిపట్ల మోహం పెట్టుకోవడం సహజం. కానీ భర్త పరాయివాని భార్యపట్ల కామవాంఛ పెట్టుకుంటే దానివల్ల అనుసంధానించబడ్డ మోహం అత్యంత ప్రమాదకారి. అటువంటి కామపూరితమైన మోహమే పౌలస్త్యవధ (రామాయణం) కు కారణమయింది.

అందువల్ల మనకు తెలిసేదేంటంటే మోహము, మదము మాత్సర్యము వాటంతట అవిగా ప్రమాదకారులుకావు. వాటివల్ల కొంచెం ఉపయోగం ఉంది. కానీ కామం, క్రోధం, లోభం వల్ల ఏవిధమైన ప్రయోజనమూ లేదు. అలాగని అవి పొమ్మంటే పోవు అభ్యాసం వల్ల కామక్రోధలోభాలు పోతాయి, వైరాగ్యంవల్ల మోహమదమాత్సర్యాలు సద్దుమణుగుతాయి. ఇలా అని నేను సాధన గ్రంధములలో చదివాను.

ఓం స్వస్తి….

-మాధవ తురుమెళ్ల, మాడ్రిడ్, స్పెయిన్ 12-మార్చి-2013

Read More
04 Mar
0

ఒకోసారి మేఘాలు కన్నీళ్లని వర్షిస్తాయి.

ఒకోసారి మేఘాలు కన్నీళ్లని వర్షిస్తాయి.
ఒకోసారి గుండెలు కాలువల్లో రక్తాన్ని నింపుతాయి.
నిరంతరం పొలాలలో ఆశలను జల్లే రైతులు –
ఒకోసారి తమ కాలేయాలను జల్లుతారు;
ఒకోసారి రాత్రికి పగలు తెలియదు
నిర్వేదంకప్పిన భూమిచాలులో ఒక
దిక్కులేని సీత దాక్కుని ఉందన్న జాడ తెలియదు;

ఒకోసారి మృగానికి తాను మనిషినని తెలియదు
పెట్టిన అన్నం తిన్న కుక్క ప్రకృతివశాత్తూ విశ్వాసం చూపిస్తుంది;
రైతు పెట్టిన అన్నంతిని బతుకుతున్నకుక్కగూడా
ఒకోసారి మనిషిగా మారతాడు, విశ్వాసాన్ని మర్చిపోతాడు.
రైతు మంటల్లోదూకుతుంటే
కాలేయాలను అమ్ముకుంటుంటే
ఉరితాటికి విశ్వాసాన్ని వేలాడేసి ఊగుతుంటే
విషంతాగుతుంటే
ఒకోసారి మనిషి తనకేం పట్టనట్లుగా నడిచిపోతాడు…
జీవితాన్ని అబద్ధంగా మార్చి జీవిస్తూ పోతాడు.

ఒకోసారి ఈ మానవులకు
భూమిని దేవుడెందుకిచ్చాడా అని సందేహం వస్తుంది.

-మాధవ తురుమెళ్ల

Read More
03 Mar
0

ఒక మేనక అన్నది

ఒక మేనక అన్నది

రాత్రికి రహస్యం పోదు
పగటికి పచ్చిదనం రాదు…
ప్రాక్పశ్చిమ దిశల సమావర్తనం కొలవడం దేనికి
చుట్టూచూస్తే అనుభూతికి తెలియడంలేదా ఈ భూమి గుండ్రమని!
కళ్లువిచ్చిచూస్తే తెలిసే
సృష్టిరహస్యాన్ని కన్నులుమూసి కనుక్కోవాలనుకునే
ఓ పిచ్చిబాపడా!
నీకు తెలుస్తోందా నీవేం పోగొట్టుకున్నావో!

రా…
నీకొక కౌగిలింతల స్వర్గం చూపించి
నీకు తపోభంగం చేస్తాను
నిన్ను నాలోకి చేర్చుకుని –
అద్వైతం అంటే ఏంటో నిజంగా బోధిస్తాను.
నా కళ్లలోకి చూడు
నీలినీడలవెనుక తేలుతున్న కాంక్షా విహంగాలను చూడు…

ఈ చలిలో ఈ ఉషస్సులో
ఏ స్వర్గాన్ని కోరి నీకీ తపస్సు
నీ ఉనికిని పూర్తిగా మాయంచెసే
ఏ మోక్ష పరిష్వంగంకోసం నీకీ తమస్సు
రా…
నా విరహపు నిట్టూర్పుల
వెచ్చని మేఘాలను నిన్నావరింపజేసి
నీకు నా శరీరాన్ని చలిమంట చేసి
నా యోగాగ్నిలో నీకు ఆహుతులిస్తాను
నీకిక ఏ స్వర్గమూ వద్దనుకునేటట్లుగా చేస్తాను.

******
 –మాధవ తురుమెళ్ల

Read More
24 Feb
0

ఫేస్‍బుక్ స్నేహాలపట్ల మన పూర్వీకుల సలహా: -) వసుధైవ కుటుంబకం

ఫేస్‍బుక్ స్నేహాలపట్ల మన పూర్వీకుల సలహా: -)

వసుధైవ కుటుంబకం అనేది మొట్టమొదటగా అధర్వణవేదాంతర్గతమైన మహోపనిషత్తు లో కనబడుతుంది. కానీ ఈ ఉపనిషత్తుని ముఖ్యమైన 108 ఉపనిషత్తులలో ఒకటిగా పరిగణించరు. దీన్నే మహానారాయణోపనిషత్తు గా గూడ పిలుస్తారని విన్నాను. ఆ శ్లోకం కింద ఇస్తున్నాను.

ఉదారః పేశలాచారః సర్వాచారానువృత్తిమాన

అన్తఃసఙ్గ-పరిత్యాగీ బహిః సంభారవానివ

అన్తర్వైరాగ్యమాదాయ బహిరాశోన్ముఖేహితః

***అయం బన్ధురయం నేతి గణనా లఘుచేతసాం

ఉదారచరితానాం తు వసుధైవ కుటుంబకం***

భావాభావ వినిర్ముక్తం జరామరణవర్జితం

ప్రశాన్త కలనారభ్యం నీరాగం పదమాశ్రయ

ఏషా బ్రామ్హీ స్థితిః స్వచ్ఛా నిష్కామా విగతామయా

ఆదాయ విహరన్నేవం సంకటేషు న ముహ్యతి

(మహోపనిషత్తు 6.70-73)

అయితే దీనినే ’హితోపదేశం’, ’విక్రమచరితం’ (3.1), ’పంచతంత్రం’, ’చాణక్యనీతి’ అనే ప్రముఖగ్రంధాలలో మరల ఉటంకించబడింది.

హితోపదేశంలోని కధ చాలా బావుంటుంది. దాంట్లోని నీతి ఈ ఫేస్‍బుక్ స్నేహంరోజుల్లో చాలా అవసరం. అందుకని ఆ కధ ఈ కింద ఇస్తున్నాను. ఫేస్‍బుక్ స్నేహాలు చేసేవారందరూ ఈ కధను తెలుసుకుని మన పూర్వీకుల విజ్ఞానం నుండి ఏదైనా హితవు తెలుసుకోగలరని నా ఆకాంక్ష.

[ఈ కింది కధలను నేను ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నాను. సంస్కృతశ్లోకాలు నాకు గుర్తున్నాయి. తెలుగులో కొంచెం అటుఇటుగా రాసాను. తెలుగులో తప్పులు ఉంటే మన్నించగలరు -మాధవ తురుమెళ్ల ]

హితోపదేశం కధ

==========

కధలో కధల పిట్టకధలు గలిగిన హితోపదేశంలో (పంచతంత్రంలో) మనకు వసుధైవ కుటుంబకం అనేది కనబడుతుంది.

చిత్రాంగుడనే లేడి, సుబుద్ధి అనే కాకి స్నేహంగా ఉండేవి. క్షుద్రబుద్ధి అనే నక్క ఆ చిత్రాంగుడనే లేడిని వంచించి అది చనిపోతే తిందామని దానితో స్నేహం చేయాలని చూస్తుంది. చిత్రాంగుడు అమాయకుడైన లేడి అతడు అందరూ మంచివాళ్లే అనుకుంటాడు. అందువల్ల క్షుద్రబుద్ధి మాటలను నమ్మి అతనితో స్నేహానికి ఒప్పుకుంటాడు. అలా ఆ కొత్తగా స్నేహితులైన లేడి నక్క కలిసి నడుచుకుంటూ వెళుతున్నప్పుడు సుబుద్ధి చెట్టుకొమ్మమీదనుండి వాళ్లని చూస్తుంది. ’ఓ చిత్రాంగా! ఈ నీ కొత్తస్నేహితుడెవరు?’ అని అడుగుతుంది. దానికి చిత్రాంగుడు ’ఇతడిపేరు క్షుద్రబుద్ధి ఇతడికి పాపం స్నేహితులు ఎవరూ లేరట! అందుకే నాతో స్నేహంకావాలి అని అడిగితే ఒప్పుకున్నాను’ అంటాడు. దానికి సుబుద్ది ’నీకు ఇతనిగురించి పూర్తిగా తెలుసా? ఈ నక్క క్షుద్రబుద్ధి ఎక్కడినుండి వచ్చిందో? ఏ కారణంగా వచ్చిందో? అసలు ఎందుకు వచ్చిందో? నీతో స్నేహాన్ని ఎందుకు ఆశిస్తోందో నీకు ఏమైనా తెలుస్తోందా? ఎవరితోపడితే వారితో స్నేహం చెయ్యగూడదు ముఖ్యంగా నీవు శాఖాహారివి నీవు చనిపోతే తినాలని నీ వినాశనాన్ని మనసులో కోరుకుంటూ తిరిగే మాంసాహారి, పైగా జిత్తులమారితనానికి పేరున్న జాతికి చెందినది. జాతి నీతులు తెలియకుండా నైజం తెలియకుండా ఎవరి స్నేహాన్ని పడితే వారి స్నేహాన్ని ఒప్పుకుంటే అది ఎప్పుడో నీకు ముప్పు తెప్పిస్తుంది. ” అంటుంది.

తన ప్రాణ స్నేహితుడైన ఆ సుబుద్ధి చెప్పిన మాటలు విన్న చిత్రాంగుడు ’మిత్రమా సుబుద్ధీ! నీవు చెప్పిన మాటలు ఎవరితో స్నేహం చెయ్యాలో చెప్పిన మాటలు నాకు నచ్చాయి. కానీ ఈ క్షుద్రబుద్ధి గూడా మంచివాడే… నేను ఇతడిని నమ్ముతాను’

దానికి సుబుద్ధి తన స్నేహితుడి అతిమంచితనానికి చింతిస్తూ “మిత్రమా! అపరిచితులతో స్నేహాన్ని ఒప్పుకునేటప్పుడు వారిగురించి పూర్తిగా తెలుసుకోవడం వారికి కొంచెం పరీక్షపెట్టడం చాలా అవసరం. నీవు మాట్లాడిన మాటలకు వారు ఎలా స్పందిస్తారో గమనించు, వాళ్ల నైజంనీకు అర్ధమౌతుంది.” అంటుంది.

అదంతా అప్పటిదాకా మౌనంగా వింటున్న క్షుద్రబుద్ధి నక్క ఆ కాకితో అంటుంది ’మిత్రమా! నాది వేరొక నీతి జాతి అని తలచకు. మన పూర్వీకులు చెప్పలేదా ’వసుధైవకుటుంబకం’ అని మనమంతా వేరుగా కనబడ్డా మనదంతా ఒకే కుటుంబం’.

“హా హా ’వసుదైవ కుటుంబం’ అని నీవు అనగానే నీ మాటలని గుడ్డిగా నమ్మెయ్యడానికి నేనేమీ ఆ అమాయకుడైన జరద్గవుడిని కాను. నిన్ను గుడ్డిగా నమ్మి నా స్నేహితుని ప్రాణాలకు ముప్పు తెచ్చుకోనివ్వలేను” అంటుంది.

చిత్రాంగునికి కధలంటే చాలా ఇష్టం అందుకని “ఎవరా జరద్గవుడు ఏమాకధ?” అని కుతూహలంగా అడుగుతాడు.

జరద్గవుని ’గుడ్డిగా నమ్మేసిన’ కధ:

ఒకప్పుడు ఒక పర్వతశిఖరం మీద అనేకమైన గద్దలు నివసిస్తుండేవి. వాటిలో జరద్గవుడు అనే గద్ద చాలా ముసలివాడైపోయి గుడ్డితనం వచ్చేసి కళ్లుకనబడక రెక్కలు ఉడిగిపోయి ఎగరలేని స్థితిలో ఉన్నాడు. అతడి దీనస్థితిని చూసి జాలిపడిన మిగిలిన గద్దలు “నీవు మా పిల్లలను జాగ్రత్తగా చూసుకో మేము వేటకు వెళ్లి వచ్చి నీకుగూడా మా వేటలో భాగం ఇస్తాము” అని అతడితో చెప్పాయి. అప్పట్నించీ జరద్గవుడు మిగిలిన గద్దపిల్లలని జాగ్రత్తగా కాపాడుతూ వస్తున్నాడు.

అలా ఉండగా దీర్ఘకర్ణుడనే పిల్లి ఆ గద్దపిల్లలని తిందామని వస్తుంది. గూటికి కాపలాగా ఎవరూ లేరుగదా అని అనుకున్నపిల్లి అక్కడ కాపలాగా ఉన్న జరద్గవుడిని చూసి ఉలిక్కిపడుతుంది. పారిపోదామని ప్రయత్నించేలోపలే ’ఎవరక్కడ?’ అని జరద్గవుడు అరుస్తాడు. తను ఎదురుగాఉన్నాగూడా ’ఎవరక్కడ’ అంటాడేంటా అని చూసిన పిల్లికి అర్ధమౌతుంది ఈ ముసలిగద్ద జరద్గవుడికి కళ్లు కనబడవు అని!

దాంతో ’ఆహా ఏమి నా అదృష్టం. నేను ఈ ముసలిగుడ్డి గద్దని నమ్మించితే చాలు. ఈ గద్దపిల్లలనన్నింటినీ శుభ్రంగా తినెయ్యచ్చు’ అనుకుని.

’అయ్యా నమస్కారం! నా పేరు దీర్ఘకర్ణుడు. నేనొక శాఖాహారం మాత్రమే భుజించే పిల్లిని’

’పిల్లివా! వెళ్లు వెళ్లు ఇక్కడ నీకేం పని…. నాకు కళ్లు కనబడవనుకుంటున్నావేమోకానీ నా కాళ్లలో ఇంకా బలం ఉంది. నా కాళ్లతో నిన్ను పట్టి నా ముక్కుతో నిన్ను చీల్చి చెండాడగలను”

“అయ్యా! అంత కోపం వద్దు… నేను జాతికి పిల్లినే అయినా చాలా మారిపోయినవాడిని… పైగా మన పూర్వీకులు చెప్పలేదా ’వసుదైవ కుటుంబకం’ మనమంతా ఒకే కుటుంబం అని. నేను ఒక సాధువు చెప్పిన మంచిమాటలు విని ఎంతో మారిపోయాను. ’ఫలమూలాసినౌ దాంతౌ తాపసౌ బ్రహ్మచారిణౌ’ నా ఆరాధ్యదైవమైన శ్రీరామునివలె నేనూ ఫలమూలాలను అసినం (భోజనం) చేసే శుద్ధశాఖాహారిని నన్ను నమ్మండి.”

“సరే మా కులదేవత జటాయువుకు అతి ప్రాణస్నేహితుడైన శ్రీరామచంద్రుని భక్తుడిని అంటున్నావుగాబట్టి నిన్ను నమ్ముతున్నాను. కానీ నీకు ఇక్కడ ఏంపని ఎందుకు వచ్చావు?”

“అయ్యా! మీరు వృద్ధులు అని తెలుసుకుని మీరు చాలా మంచి మాటలు చెబుతారని మీవద్ద ఎంతో ఎక్కువజ్ఞానం ఉన్నదని విని మీ శిష్యునిగా మారి మీవద్ద జ్ఞానబోధపొందుదామని వచ్చాను”

ఆ మాటలకు తృప్తిచెంది, ’అతివినయం ధూర్తలక్షణం’ అని చెప్పిన పూర్వీకుల హితోపదేశం పెడచెవినపెట్టి తనని అతి వినయంగా పొగిడిన దీర్ఘకర్ణుడి మాటలను గుడ్డిగా నమ్మిన జరద్గవుడు తన గొంతు సవరించుకుని, గుడ్డివాడవడం వల్ల ఆ పిల్లి ఏంచేస్తోందో గమనించలేక, జ్ఞానోపదేశం మొదలుపెడతాడు… గుడ్డిగానమ్మి ఆ పిల్లి తనమాటలు వింటోంది అనుకున్నాడు…. కానీ ఆ పిల్లిమాత్రం శుభ్రంగా ఒకదానితర్వాత మరొకటిచొప్పున ఆ అసహాయులైన గద్దపిల్లలనన్నింటినీ పూర్తిగా చంపితినేసి మెల్లగా జారుకుంది. సాయంత్రం అయిన తర్వాత మిగిలిన గద్దలన్నీ తిరిగి వచ్చాయి. బొమికలు మాత్రమే నేలనపడి ఉన్న తమ పిల్లలన్నీ ఆ జరద్గవుడే తినేసాడనుకుని అతడు ’నేను ఏ పాపమూ ఎరుగను’ అని చెప్పినా నమ్మకుండా అతడిని పొడిచి చంపేసాయి.

“అందుకే మిత్రమా ఎవరు చెప్పినా గుడ్డిగా నమ్మి జరద్గవునిలా ప్రాణాలమీదకి తెచ్చుకోకు. జిత్తులమారితనానికి ప్రతీకలైన ఆ నక్కజాతితో నీవు స్నేహంచెయ్యకు నిదానించు… ” అని చెప్పింది సుబుద్ధి.

కానీ చిత్రాంగుడు తన స్నేహితుడు సుబుద్ది మాటలు పెడచెవినబెడతాడు. చివరకు క్శుద్రబుద్ధి పన్నిన వలలో పడి తన ప్రాణాలమీదకి తెచ్చుకుంటాడు. అప్పుడు సుబుద్ధి ఒక ఉపాయంతో చిత్రాంగుడిని విడిపిస్తాడు… అందుకే గుడ్డిగా స్నేహాన్ని చెయ్యగూడదు, ఎవరినీ ’గుడ్డిగా నమ్మగూడదు’ అని తెలుగులో హితవు చెబుతారు. స్వస్తి!….. 🙂

Read More
23 Feb
0

హైందవమతము ’పాపము’ ఒక విశ్లేషణ

నిజానికి ’పాపము’ అన్న పదాన్ని చాలా జాగ్రత్తగా అర్ధం చేసుకోవాలి. హిందువులు ’పాపం’ గా దేన్ని భావిస్తారో దానికి ’క్రైస్తవులు, ముస్లింలు, యూదులు’ భావించే ’పాపానికి’ హస్తిమసకాంతరం తేడా ఉంది. హిందువులకు ’పాపం’ అంటే ’పతనాత్’ అంటే సచ్చిదానంద ఘనుడైన పరబ్రహ్మని ఆశ్రయించుకున్న మాయావరణలో పడి సాక్షాత్తూ ’దేవుడే’ తనని ’జీవుడు’గా భావించుకోవడమే పాపం. అయితే ఈ అర్ధాన్ని ఇప్పుడు హిందువులుగూడా వాడటంలేదు. ’Sin’ అని ఇంగ్లీషులో అనేసుకుని ఇతరమతాల అర్ధం తీసేసుకుని తృప్తి పడిపోతుంటారు. 
వేదములలో సూర్యుని బ్రహ్మ అన్నారు. దానికి ప్రశ్నగూడావేశారు… సూర్యమండలావర్తియైన పురుషుడు సూర్యుడా లేక బ్రహ్మయా? దానికి చాందోగ్యంలో సమాధానం ఇస్తూ ’సర్వేభ్యః పాపేభ్యః ఉదితః’ అని చెప్పారు. అంటే సర్వపాపములపైనున్నవాడు అతీతుడు అని విశేషణగా చెప్పారు. 
ఇక మానవజన్మ విషయానికి వస్తే ’సర్వేభ్యః పాపేభ్యః ఉదితః’ అయిన ఆ పరబ్రహ్మ మాయావర్తి అయినపుడు సృష్టి మొదలైంది. చాందోగ్య ఉపనిషత్తులో బహుశ్యాం ప్రజాయేయే (ఛాం 6/2/3) అంటే ఆ పరమాత్మ ’నేను చాలా రూపాలుగా మారాలి అనుకున్నాడు. ఒకడుగా ఉన్న ఆయన నేను అనేకమవ్వాలి అనుకున్నాడు.’ అలా సృష్టిమొదలైంది. 
అలా ఒకడిగాఉన్నవాడు అనేకంగా మారాలి అనుకోవడమే ’పాపం’. అయితే అది ఇంగ్లీషులోని ’Sin’ కాదు. అంటే స్వస్వరూపానుసంధానాన్ని మర్చిపోయి మాయలోపడి కొట్టుకుపోవడం. ఇకపోతే ఆయన నేను అనేకంగా అవాలి అనుకున్నపుడు ఎప్పుడు ఏ జన్మ మొదలైంది? సముద్రాన్ని ఊహించుకోండి సముద్రంలో అలలు లేస్తాయిగదా? మరి అలకి సముద్రానికి తేడా ఏంటి? అలయే సముద్రము…. అంటే సముద్రంలోని కొంతనీరు అలగా లేచి కిందపడుతోంది. మరి అలని అలగాను సముద్రాన్ని సముద్రంగాను రెండుగా విడదీసి ఎందుకుచూస్తామో ఆలోచించండి? అదే భిన్నభావము దోషభావము అదే ’పాపము’… మనకు సృష్టిలో కనబడాల్సింది ఆ సముద్రంలాంటి ’పరమాత్మ’ కానీ మనం అలలలాంటి ’మనుషుల్ని’ చూస్తాము. ’అయం నిజః పరోవేత్తి గణనాం’ – వీడు నావాడు వారు పరాయివాడు అని యోచన చేస్తాం… అందుకే నారాయణోపనిషత్తులో ’అయం నిజః పరోవేత్తి గణనాం లఘుచేతసాం ఉదార చరితానాంతు వసుధైవ కుటుంబకం’ అని చెప్పారు… అంటే ’మందబుద్ధులు మాత్రమే వీడు నావాడు వాడు పరాయివాడు అని లెక్కలుగడతారు… ఉదారచరితులు [హిందువులు] ఎప్పుడూ ఈ జగత్తంతా నా కుటుంబమే అనుకుంటారు. అలా అనుకోకపోవడమే పాపం… [Sin కాదు].
అయితే అనేకంగా మారాలనుకున్న పరమాత్మకు ’సత్ + చిత్ + జ్ఞానం’ అనేవి మూడు ఉన్నాయిగదా! మరి మనం ఏ పూర్వజన్మ ’పాపం’ చేసి ఈ జన్మకు వచ్చాము? అంటె బహుశా నీకు ఏ పూర్వజన్మో ఉండి ఉండకపోవచ్చు. 
ఒక పెద్ద వృత్తాన్ని (Circle) ని ఊహించుకోండి… ఆ వృత్తం రేఖలో మొదలెక్కడ చివరెక్కడ? కాబట్టి మీరు ఎక్కడ వృత్తంలో మొదలుగాభావిస్తారో తార్కికంగా చూస్తే అదే చివరగూడానూ… అదేవిధంగా మానవజన్మ…. మీ మానవజన్మ మీ మొదటి జన్మ… అదే నిజంగా చూస్తే — మీరు స్వరూపాను సంధానం చేస్తే — చివరజన్మగూడానూ… అంటే మాయావృత్తంలో మీరు జీవనం ఎక్కడ మొదలుపెట్టారో అక్కడే మోక్షం (అంతం) మీకోసం సదా ఎదురుచూస్తోంది… తెలుసుకోండి…
పరమాత్మ నేను అనేకులుగా ’ప్రజ’ అన్న పదాన్ని వాడాడు ’పశు’ అనే పదాన్ని వాడలేదుగదా?! ప్రజ అంటే మనుష్యులేగదా! ’ప్రకర్షేణ’ + ’జ’ అంటే విశేషంగా పుట్టినవారు ఎవరు? మనుషులే… ఆలోచించండి!…… కాబట్టి పరమాత్మ తనను పుట్టించుకున్నప్పుడు ’మనిషిగానే’ పుడతాడు… అది ’పాపం’ కానీ Sin కాదు. కాబట్టి నీవు ఈ జన్మలో ఏదైతే అనుభవిస్తున్నావో దేనిని దుర్భరంగా బాధాకరంగా భావిస్తున్నావో అనుభవిస్తూ ’భగవంతుడా ఏ జన్మలో ఏ పాపం చేసానో’ అనుకుంటున్నావో అది నిజానికి ఏ జన్మదో అయిఉండకపోవచ్చు. నీవు శుద్ధుడివి, బుద్ధుడివి నిరంజనుడివి, అవ్యయుడవి కానీ మాయలో పడి నేను ’ఏ జన్మలో ఏ పాపం చేసానో’ అని ఏడుస్తున్నావు అని ఆ తల్లి మదాలస ’శుద్ధోసి బుద్ధోసి నిరంజనోసి’ తన బిడ్డకు జోలపాట పాడింది…. ఆలోచించండి! కాబట్టి దివ్యాత్మ స్వరూపులారా…. లేవండి మీరు ఏ పాపమూ (Sin) చెయ్యలేదు… మీరు సాక్షాత్తూ పరమాత్మ స్వరూపులు…. కాబట్టి మీరు పొందుతున్న అనుభవాలు మీ పూర్వజన్మపాపాలు కావు…. మీరు నిరంజనులు. ఆ విషయాన్ని తెలుసుకోండి… హాయిగా ఆనందంగా నిర్భీతిగా ఏ విధమైన ఆత్మగ్లాని లేకుండా తిరిగి మీ ’స్వరూపానుసంధానం’ చేసుకోండి. మిమ్మల్ని మీరు మాయనుండి ముక్తులు గావించుకోండి… ’నీవు పాపం చేసావు అందుకే ఇలా పుట్టావు, నీవు పాపం చేసావు అందుకే అనుభవిస్తున్నావు’ అన్న మాటలు నమ్మకండి. అదంతా వట్టిది…. కలలో హత్యచేసినవాడు నిజజీవితంలో శిక్ష అనుభవిస్తాడా?! నిరంజనుడైన పరమాత్మ మాయలొ పడి కంటున్న కలకు నిజత్వాన్ని ఆపాదించకండి…. హైందవులుగా పుట్టిన మీరు దివ్యాత్మస్వరూపులు అలాగే నడవండి నిలవండి… ఇతరమతములలోని ’పాపము’ అన్న అర్ధాన్ని మీ మతానికి ఆపాదించుకుని కుంగిపోకండి… -మాధవ తురుమెళ్ల

Read More