18 Jan
0

రైలుబండి కోసం – కవిత

రైలుబండి కోసం



వెన్నెల్లాంటి అందమైన పసితనపు జ్ఞాపకం…

తాతకు ఆడుకుంటానికని అబద్ధం చెప్పి
రైలుస్టేషను అరుగుల మీద కూర్చుని
వచ్చి వెళ్లే రైలుబండ్లను చూసే 
పసితనపు జ్ఞాపకం….


కదిలిపోయే రైలుబండిని చూసినా
ఎర్రజెండా చూపించి సర్కస్ లో పులిని ఆపేవాడిమల్లే
అంతపెద్ద దయ్యంలాంటి రైలుబండినీ
అమాంతంగా ఆపుచేసే స్టేషనుమాష్టరుని చూసి
ఆరాధనతో మనసు పొంగి పరవళ్లు తొక్కేది…


స్టేషన్ మాష్టరుగారు ముద్దుగా తలనిమిరి చాక్లెట్టిస్తే
విచ్చుకున్న పత్తికాయల్లాంటి కళ్లతో
ప్రపంచాన్నే జయించిన సంబరం మనసంతా ఊపేసేది…


కీచుకీచుమంటూ చప్పుళ్లుచేస్తూ –
అచ్చూ ముసలితనం మీదబడ్డ మా తాతకి మల్లే
ఉసూరుమంటూ ఆగేదా రైలుబండి.


రైలు ఆగిందంటే ఆ తర్వాత జరిగే తిరనాళలాంటి సంబరం
నన్నింకా ఆశ్చర్య పరుస్తూనే వుంటుంది….
బిలబిలమంటూ పుట్టలోంచి బైటికొచ్చే చీమల్లాగా
మనుషులు మనుషులు కుప్పలు తెప్పలుగా మనుషులు
రైలు ఆగిందంటే ఈనిందన్నట్లు లెక్కట !


“నువ్వు నాకే పుట్టావురా కన్నా…” 
అని ముద్దుగా గోరుముద్దలు తినిపిస్తూ
మా అమ్మ నమ్మకంగా చెప్పిందాకా –
మనుషులు రైళ్లలోంచి పుడతారనీ
ఈనడంకోసమే రైలు ఆగుతుందనీ
మా భద్రిగాడు చెబితే నమ్మేసిన రోజులవి !!


రైలుబండిని చూస్తే పసితనపు సంబరం
వెన్నెల్లా అల్లుకుని
రారా చిన్నాడా ఆడుకుందాం రా రమ్మని
పిలుస్తున్న అందమైన జ్ఞాపకం…
-మాధవ్ (1986)

Read More