Blog

01 Mar
0

మద్యంలేకుండా మత్తెక్కించేది ప్రేమ

మాటకు అందనిది, మౌనంలో ఒదిగిపోయినది
చిరునవ్వుల క్రీగంటచూపుల గాలులకు
తలలూపుతూ —
స్పందించిన
హృదయపుష్పపు పుప్పొడిలా
సృష్టిక్రమంలో భాగంగా –
అవ్యక్తంగా ఆప్యాయంగా –
మనసును హత్తుకునేది
మద్యంలేకుండా మత్తెక్కించేది ప్రేమ.  – మాధవ తురుమెళ్ల

Read More
18 Feb
0

పిచ్చిరాతలు

‘పిచ్చిరాతలు‘

రాత్రి చీకటి కళ్లు కప్పుకున్న ఉషస్సు సూర్యుడినింకా జనించనేలేదు..
తుఫానుల అల్లకల్లోలాలలో లోకాలన్నిటినీ హాహాకారాలకు గురి చేయగల
బడబానలాన్ని సముద్రం ఇంకా ప్రసవించనేలేదు
కానీ నీ వెందుకు ప్రపంచగర్భాన్ని మోస్తూ మూలుగుతూ
శాంతికి జన్మనిద్దామని ప్రయత్నంచేస్తున్నావు? – – మాధవ తురుమెళ్ల

Read More
31 Jan
0

Interview in Gemini TV యూరోప్ లోని తెలుగువారి గుండె గొంతుక‘ ను స్థాపించిన కారణం

ఈ ఇంటర్వ్యూలో నేను ఇంగ్లండు రాజకీయాలలోకి ఎందుకు ప్రవేశించాను,  బ్రిటీష్ రాజకీయాలలో పోటీచేసిన మొదటి తెలుగువానిగా ఎలా మిగిలాను,  గాంధీగారంటే నాకున్న అభిమానం వారి బాటలో నడవాలని అనుకునే నా ఆకాంక్ష, ‘తెలుగువాణి రేడియో – యూరోప్ లోని తెలుగువారి గుండె గొంతుక‘ ను స్థాపించిన కారణం మరియు అనేక విషయాలు ముచ్చటించడం జరిగింది.  విని మీ అభిప్రాయాలు తెలుపగలరు. నమస్కారం

Read More
16 Jan
0

దైవాసుర సంపత్తులనుగూర్చి భగవంతుడు

భగవద్గీత లో పదహారవ అధ్యాయం చాలా ముఖ్యమైనది.. దీన్ని నేను రోజూ రైల్లో నా ఆపీసుకు వెళ్లుతున్నప్పుడు స్మరణకు తెచ్చుకుంటాను. దీంట్లో దైవాసుర సంపత్తులనుగూర్చి భగవంతుడు చెప్పాడు.

శ్రీకృష్ణుడు దైవగుణాలు అంటే ఏంటో ఇలా చెప్పాడు:
భయం లేకుండడం,నిర్మలమైన మనసు,అధ్యాత్మిక జ్ఞాన నిష్ఠ, ఆత్మనిగ్రహం, యజ్ఞాచరణ, వేదాధ్యయనం, తపస్సు, సరళత, అహింస, సత్యం, కోపం లేకుండడం, త్యాగం, శాంతి, [ఇతరులలో] దోషాలు ఎంచకుండడం, [జీవులపట్ల] మృదుత్వం, భూతదయ, లోభం లేకుండడం, అసూయ లేకుండడం, కీర్తిపట్ల ఆశ లేకుండడం.

కానీ ఆ తర్వాత గీతలో భగవానుడు చెప్పిన ఆసుర లక్షణాలే నన్ను నిజంగా వణికింపజేస్తాయి..

ఇదమ్ అద్య మయా లబ్ధమ్ ఇమమ్ ప్రాప్స్యే మనొరథమ్
ఇదమ్ అస్తిదమ్ అపి మే భవిష్యతి పునర్ ధనమ్ ||
అసౌ మయా హతః శతృః హనిష్యేచా పరాన్ అపి
ఈశ్వరోహం అహం భోగీ సిద్ధోహం బలవాన్ సుఖీ ||
ఆఢ్యోభి జనవాన్ అస్మి కోన్యోస్తి సదృశో మయా
యక్షేదాస్యామి మోదిష్య ఇత్యజ్ఞాన విమోహితాః ||

మూర్ఖులు అజ్ఞాన విమోహితులు — “ఇది నాకు దొరికింది. దీనితో ఈ కోరిక తీర్చుకుంటాను.నాకు ఇంత ఆస్తి ఉంది,ఇంకా ఆస్తి పోగేసుకుంటాను. ఈవేళ (చూడు నేను) ఈ విధంగా నా శత్రువును చంపాను! ఇక మిగిలిన శత్రువులందరినీ చంపుతాను (వ్యాపారంలో శతృత్వమే కావచ్చు). నాదగ్గర సర్వమైన అధికారాలున్నాయి. నేను చాలా బలవంతుడిని, నేను చాలా సుఖపడేవాడిని, నా దగ్గర బోల్డంత డబ్బుంది (ధనికుడిని), నేను తలచుకుంటే నాకిక ఎదురే లేదు, నాకు ఎవరూ సమానం కాదు, నేనే యాగలూ,దానాలూ చేస్తాను. నేనెప్పుడూ సంతోషినే” — అని అజ్ఞానంచేత అనుకుంటూ కామం, భోగాలలో మునిగి చివరకు నరకంలో పడతారు.

ఆత్మస్తుతి,డబ్బు మదం తో శాస్త్రాన్ని విడిచిపెట్టి ఈ మూర్ఖులు పేరుకు మాత్రం డాంబికంగా యాగాలు చేస్తారు.అన్ని దుర్గుణాలు కలిగి తోటివారిపట్ల అసూయతో పడి కొట్టుకుపోతూ అంతర్యామి నైన [అంతరాత్మను] నన్ను తిరస్కరిస్తారు. వీరు తిరిగి తిరిగి ఇలాంటి పాపపు జన్మలే పొందుతారు. వీరు ఎన్నటికీ నన్ను చేరలేక [అమూల్యమైన మనుష్యజన్మని వ్యర్ధం చేసుకుని] అంతకంతకూ హీనజన్మలనే [పురుగు పుట్ర, సంక్రాంతి కోళ్లలాగా కొట్టుకునే జన్మలని] పొందుతుంటారు.

Read More
15 Dec
0

కలలు పోగొట్టే మంత్రం


జీవితంలో తనకు జరిగిన అన్యాయాన్ని గూర్చిగానీ –
తనని నమ్మించి మోసగించిన తను అతిగా నమ్మిన తనవారిని గూర్చిగానీ –
తనకు జరిగిన అవమానాలను గూర్చిగానీ,
ఎవరికీ ఫిర్యాదు చెయ్యకుండా –
చనిపోయిన ప్రియబంధువు శవం చుట్టూ
కుండనీరు తీసుకుని తలదించుకు  ప్రదక్షిణలు చేసిన వాడికి మల్లే.,
తనను కికురించిన ప్రేమకు –
ఏనాడో మానసిక దహనసంస్కారం చేసి,
జ్ఞాపకాల నీటికుండలనుండి కావాలని పెట్టిన
కళ్ల చిల్లులద్వారా కన్నీళ్లన్నీ కార్చేసి,
పెదవులు రెంటినీ సంస్కారం అనే దబ్బనపు పురికొసతో కుట్టి
మౌనంగా తలదించుకుని –
తన దురదృష్టం అంతే అని అనుకుంటూ
అక్రమంగా జీవితం తనపై విధించిన కర్కశపు శిక్షని భరిస్తూ,
చిరునవ్వు తొడుగుని ముఖంపై తొడుక్కుని
తనదారిన తానుపోయే వాడు
ఎవ్వరినీ ఏమీ అనేవాడు కాడు…

అయినాసరే –
ఆ అమాయకుడికి శిక్ష ఇంకా చాలదన్నట్లు…
ఎప్పట్లానే
చీకట్లో
ఒక్కసారి నిశ్శబ్దం చుట్టుముట్టినవేళ,
కావాలని బలవంతంగా ఆమూలాగ్రమూ తగలెట్టి మోడువార్చిన
అతడు ప్రేమించిన
ఒకప్పటి పచ్చటి ప్రేమల జ్ఞాపకాల మహావృక్షం వెనుక,
తగలబడక అసహ్యంగా దెయ్యంలాగా
భయపెట్టే భూతంలాగా
ఏజన్మపాపమో పగతీర్చుకోవాలన్నట్లు
కనుమరుగవకుండా
బలవంతంగా మిగిలిపోయిన
ఆ మొండిమాను వెనుక,
నిస్సహాయంగా నిక్కి దాక్కుని నిద్రిస్తున్న వాడిని …
 ఆ అమాయకుడిని —-
కర్కశంగా మెడపట్టి బయటకు ఈడుస్తున్నాయి
నరకపు చెరసాలలో నమ్మినబంట్లవంటివైన కలలు!

తనకు దక్కి దూరమైన అందమైన ఒకప్పటి అందాన్ని
దురదృష్టవశాత్తూ పొందలేక జారవిడుచుకున్న ప్రేమజీవితాన్ని
బలవంతంగా సినిమాలా చూపించేస్తూ —
అవశుడిని అతడిని  ఏడిపిస్తాయి…

కలల కర్కశపు పట్టునుండి ఉలిక్కిపడి
విదిలించుకు మేలుకున్న అతడు
చెమర్చిన కళ్లని తుడుచుకుంటాడు
కలేకదా – అని గొణుక్కుంటాడు
గడిచిపోయిన క్షణాలను, నిమిషాలను, గంటలను, సంవత్సరాలను, దశాబ్దాలను
ఉరిస్థంభానికి వేలాడుతూ ఊగిసలాడుతున్న తాడుని చూస్తున్నట్లు
భయం భయం గానే కానీ ఊరికే లెక్కేసుకుంటాడు…
హఠాత్తుగా పిచ్చిగా నవ్వుకుంటాడు –
ఇవాళో రేపో మరణమనే ప్రియురాలు రాకపోతుందా –
నన్ను కౌగిలించుకోకపోతుందా అని ఆశగా అనుకుంటాడు…
కళ్లపై తిరిగి రెప్పలదుప్పటి కప్పుకుని
కలలని పోగొట్టే మంత్రాలను వెదుక్కుంటూ పడుకుంటాడు.

— మాధవ తురుమెళ్ల (15 December 2011)

Read More
10 Dec
0

British Library Beowulf book reading in Telugu

లండన్ బ్రిటీష్ లైబ్రరీ లో భద్రపరుచబడిన ఒక 1870 వ కాలంలో తెలుగులో ముద్రితమైన ఒక అపూర్వమైన గ్రంధం బియోవుల్ఫ్ … దీన్ని నేను చదువుతూ ఉండగా రికార్డు చేసి భద్రపరిచారు.. అదేవిధంగా ఇక్కడ పోతన భాగవతం తాళపత్రాలు గూడ ఉన్నాయి… వాటిని చేతిలో పట్టుకుని చదివి ఉప్పొంగి పోయాను. ఇలాగే తెలుగులో అనేక అపురూప గ్రంధాలు ఇక్కడ ఉన్నాయి..

Some of you may know I am a friend of British Library. I try volunteering for their projects. Recently I participated in “Beowulf” project. This book is translated in 1870s and in the treasures of British Library. They recorded the book reading using my voice to keep it in their permanent archives. Please listen to my reading clicking the link “TELUGU”…

http://britishlibrary.typepad.co.uk/digitisedmanuscripts/2011/09/beowulf-in-hungarian-and-french-and-telugu-.html

Beowulf in Hungarian … and French … and Telugu …

Ever wondered what Beowulf sounds like in Dutch, Greek or Russian, or in Telugu, a Dravidian language spoken in parts of southern India? Here at the British Library we’ve had some fun creating the recordings found here, representing nine different modern languages.
BEOWULF 3
Photo of Mr Madhava Turumella, reading the Telugu translation of Beowulf (courtesy of Nigel Bewley, The British Library).
We are extremely grateful to all our readers (Marja Kingma, Karen Eeckman, Juan Garces, Dimitrios Skrekas, Ildiko Wollner, Laura Nuvoloni, Yasuyo Ohtsuka, Irina Lester and Madhava Turumella), and to Nigel Bewley of the British Library’s Sound and Vision for making the recordings.

Read More
28 Nov
0

పెంటఁదినెడు కాకి పితరుఁ డెట్లాయెనో

పిండములను జేసి పితరులఁదలపోసి
కాకులకును బెట్టు గాడ్దెలార
పెంటఁదినెడు కాకి పితరుఁ డెట్లాయెనో
విశ్వదాభిరామ వినర వేమ!

కాకి గురించి వేమనకు తెలియని సత్యాలు:

1) మనిషి చనిపోతే అనాధ శవాలను రాబందులు పీక్కుతింటాయి. ఆ రాబందుల బారిన శవం పడకుండా కాపలాకాస్తాయి కాకులు. రాబందులతో పోట్లాడగల పక్షులు కాకులు మాత్రమే

2) కాకులు పక్షిజాతికంతటిలోకి తెలివిగలిగిన పక్షులు. అవి రామచిలుకలకంటే తెలివిగలవి.
3) కాకుల మెదడు చాలా పెద్దది.
4) కాకులు మరణ శౌచాన్ని పాటిస్తాయి. అంటే తమ తోటి కాకి చనిపోతే అవి శోకాన్ని మూకుమ్మడిగా వ్యక్తపరచడమే కాకుండా ఒక గంట తర్వాత కలిసి నదికిపోయి స్నానం చేస్తాయి. (అచ్చం మనుషులు అవబృతం పాటించినట్లుగా)
5) కాకుల మాంసం చాలా ప్రసిద్ధి పొందింది. వాటి మాంసం పందిమాంసంకంటే రుచిగా ఉంటుందని మాంసాహారులు చెబుతారు. ఇప్పటికీ పాశ్చాత్యదేశాలలో కాకిమాంసం తింటారు. ఒకప్పుడు పధ్నాలుగవశతాబ్దానికి ముందర దక్షిణ భారతదేశంలో కాకులను తినేవారు. దేశంలో క్షామం వచ్చినప్పుడు కాకులమాసం వారు తినడానికి పనికొచ్చేది.
6) కాకులు మనుషుల తర్వాత అతి త్వరగా నేర్చుకునే జీవులు. వీటికి విషయం కోతులకంటే తొందరగా అర్ధమవుతుంది.
7) కాకులు భయంకరమైన విషసర్పాలను, క్రూరమృగాలను అతి త్వరగా పసిగడతాయి. పెద్దగా కా కా అని గోలచేస్తాయి. కాబట్టి కాకుల అరుపులు విని ప్రమాదాన్ని పసిగట్టవచ్చు.
8) మనకి మామూలుగా ’కా కా’ అన్నట్లు వినిపించినా కాకి భాష చాలా అభివృద్ధి చెందిన భాష అని చెబుతారు. ఆ భాషతో కాకులు ఒకదానితో వేరొకటి సందెశాలిచ్చుకుంటాయని, కలిసి పనిచేస్తాయని తెలిసింది.

ఏ రకంగా చూసినా కాకులు అతి తెలివిగలిగిన పక్షులు, పైగా మానవాళికి ఉపయోగపడేవి, ప్రమాదాలనుండి హెచ్చరికలు అందజేయగలిగేవి అనేది నిస్సందేహంగా ఋజువైన సత్యం. అటువంటి కాకులకు తమ పితృదేవతల పేరిట ఇంత అన్నం పెట్టడంలో నాకయితే తప్పేమీ కనబడలేదు. కాబట్టి వేమన విమర్శకు అర్ధంలేదని నేననుకుంటాను. పాతంతా రోతకాదు, కొత్తంతా వింతాకాదు… మనపాతలో తరతరాలనుండీ తెలుసుకుని అర్ధంచేసుకున్న ఒక సత్యం ఉంది. ఇవాళ మనకది అర్ధంకాకపోవచ్చు కానీ సరిగా విశ్లేషిస్తే మన పాత తరాలవారి పద్ధతుల్లో వారునమ్మిన కొన్ని విషయాల్లో మనకు అర్ధం ద్యోతకమవుతుంది… అందుకే శ్రద్ధ పెట్టి వినండి అని చెబుతారు.

Read More
07 Oct
0

ఈ రోజు సమ్మెవేళ

పైన నడినెత్తిన ప్రపంచాన్ని దగ్ధం చేసేటట్లు
ఆగ్రహోదగ్రంగా సూర్యగోళం భగబగా మండుతోంది.

రోడ్ఛుపక్క ఏ చీడపురుగు చేతపడిందో కాలంకాని కాలంలో
ఆకులు పూర్తిగా రాల్చేసుకున్న చెట్టు సిగ్గుతో నగ్నంగా నిల్చోనుంది…

నీరు దొరక్క గొంతు ఆర్చుకుపోయిన కాకి
దిక్కుతెలియక పోయినట్లు అటూ ఇటూ అదేపనిగా తలతిప్పుతూ
ఏవో విపరీతపు అరుపులు అరుస్తోంది….

తోక కాళ్ల మధ్యకు ముడుచుకుని జీవితంలో ఓడిపోయి
అన్నీ పోగట్టుకున్న దానికి మల్లే ఒక పిచ్చికుక్క
బ్రతకటానికి ఆరాటపడుతూ తోటికుక్కల
దంష్ట్రాకరాళాలనుండి రక్కసి రక్కులనుండి దూరంగా పారిపోతోంది….

డొక్కలు వెన్నెముకకానుకొని,
వెన్నెముకేమో –
మానవుడైన రామునిచేతిలో –
విరచబడ్డ భగవంతుడైన శివునివిల్లులాగా –
అప్రాకృతికంగా మెలికలు తిరిగిపోయి,
నోటిలో పండ్లూడిపోయి,
ఎండిన చనుగవల కప్పేందుకు –
బూడిద దుమ్ముతో దుప్పటిలాగా అలముకొని
ఒక ముసలి బిచ్చగత్తె – కొరడాతో కర్కశంగా కొట్టబడ్డ బానిసవలె మూలుగుతోంది…

లోకమంతా ఈ సమ్మెవేళ –
ఒక రోగగ్రస్థవలె, ఒక తూర్ణీకృత వికృతిగా
ఇక యుగాంతమే తరువాయన్నట్లు
ఉరికంబాన్నెక్కబోయే ఖైదీలా,
బలిస్థంబాన్నలంకరించబోయే మూగజీవంలా
ఇలా దీనంగా… దరిద్రంగా….
కాళ్లీడుస్తూ నడుస్తోంది….

— మాధవ తురుమెళ్ల

Read More
26 Sep
0

ఆత్మ క్షోభ

ఆత్మ క్షోభ
——–

[చూసావా!]
ఈ సంధ్యని గూడా మనం జారవిడుచుకున్నాము….
ఈ  సాయంత్రపు సమయంలో
నీలపు రాత్రి  – ఆత్రంగా ప్రపంచంపై పడిపోబోతున్నవేళ
 చేయి చేయి కలుపుకు నిలుచోవాల్సిన
 మనం ఎవరికీ కనిపించనేలేదు…

దూరదూరపు కొండలపై అంచులపై ముగిసిపోతున్న
ఈ సూర్యాస్తమయపు సంబరాన్ని
నేను ఒక్కడినే నా కిటికీలోంచి పరికిస్తున్నాను.

కొన్నిసార్లు సూర్యుని లోని ఒక భాగం
నా [బీదరికపు] అరచేతిలో నాణెంలాగా మండిపోతుంది…

నీకు తెలుసా –
నా  ఆత్మ క్షోభిస్తూన్న
ఆ అంతులేని విషాదంలో
నిన్ను నేను గుర్తుచేసుకున్నానని….

అసలు ఎక్కడున్నావు అప్పుడు నీవు?
ఇంకెవరున్నారు అప్పుడు నీతో?
ఏం చెబుతూ ఉండి ఉంటారు?
నువ్వెక్కడో అందనంత దూరంలో ఉన్నావన్న –
పుట్టెడు దుఃఖాన్ని నేను అనుభవిస్తున్నవేళ
ఎందుకంత అమాతంగా మొత్తంగా ప్రేమ  విరహంగా మారి నాపై పడిపోతుంది?

మూసిన పుస్తకం సంధ్యవేళ ఎప్పుడూ కిందేపడిపోతుంది
గాయపడినా విశ్వాసపు కుక్కలాగా
నా నీలపుస్వెట్టర్ నా కాళ్లదగ్గరే పడి నలిగిపోతుంది.

ఇంతే నీవు… ఎప్పుడూ…. ఎప్పుడూ
సంధ్యరంగులలో కరిగిపోతున్న విగ్రాహాలలాగా
సాయంత్రాలలోపాటే కనుమరుగైపోతావు.

— పాబ్లో నెరుడా [అనువాదం: మాధవ తురుమెళ్ల ]

ఇది నాకు అతిబాగా నచ్చే పాబ్లో కవిత.  ఆయన తన బీదరికాన్ని, తనకూ ప్రేయసికి ఉన్న అంతులేని దూరాన్ని తలచుకుంటూ సాయంత్రాన్ని తన అసహాయతను తిట్టుకుంటూన్న ప్రియుడిగురించి రాసిన కవిత….

ఇది 25 September 2011, చిలీదేశంలోని నెరుడా యొక్క ఇంటి పెరటిభాగంలో కూర్చుని ఆలోచిస్తూ ’Clenched Soul’ అనే నెరుడా విరహపు కవితకు చేసుకున్న అనువాదం – ఒప్పులుంటే అవన్నీ పాబ్లోవి తప్పులుంటే తెలియక అనువాదానికి సాహసించిన నావని తలచి నన్ను మన్నించండి..

Read More
09 Sep
0

No Title

కొండలతో బండల ఉనికిని అడగకు
సముద్రాన్ని అలలంటే ఏంటని అడగకు
నిరంతర జీవన ప్రయాణంలో అహరహమూ శ్రమిస్తున్న
నా హృదయంలో విషాదం ఎక్కడుందని అడగకు…
— మాధవ తురుమెళ్ల

Read More