మానవులు జంతువులు స్వలింగ సంపర్కం — నా ఆలోచన [… ఇక్కడనేను రాయబోతున్న కొన్ని వాక్యాలు కొంచెం జగుప్సాకరంగా అనిపించచ్చు.  కానీ సంధర్బాన్ని బట్టి రాయకతప్పడంలేదు.  మీకు మనస్తాపంకలిగించిఉంటే ముందస్తుగా క్షమాపణ చెప్పుకుంటున్నాను. – మీ మాధవ తురుమెళ్ల]

ఆకలి, నిద్ర, భయపడటం, మైధునక్రియపట్ల ఆసక్తి ఇవి జంతువులకు మనుషులకు సహజలక్షణాలు. ఆకలి అందరికీ వేస్తుంది, నిద్ర అందరికీ వస్తుంది, ప్రతి జీవిలోనూ భయం ఉంటుంది, అలాగే ప్రతిజీవికీ కామపు కోరిక ఉంటుంది.  జీవి అనేవాడు (ఆత్మ స్వరూపి) ఈ నాలుగింటివల్ల సంసారం అనే సాలెగూటిలో చిక్కుకున్నాడు అని వేదాంతం అంటుంది.  ఎంత కాదనుకున్నా ఆకలికి దూరంగా, నిద్రకిదూరంగా ఉండలేముగదా! ఎందుకని? ఈ నాలిగింటియొక్క రహస్యాన్ని తెలుసుకుంటే జీవుడు ఎలా బంధింపబడ్డాడో అనేది తెలుస్తుంది అని మన ఋషుల ఆలోచన.  అందుకే ఆహారానికి వ్యతిరేకంగా ఉపవాసం ఉండటం,  నిద్రకి వ్యతిరేకంగా శివరాత్రి వంటి పర్వదినాలలో జాగారం చెయ్యడం, భయపడటానికి వ్యతిరేకంగా సాహసకార్యక్రమాలలో పాల్గొనడం, కామానికి వ్యతిరేకంగా బ్రహ్మచర్యం చెయ్యడం చేస్తారు.  ఉపవాసకు, జాగారము, సాహసము, బ్రహ్మచర్యము గొప్ప తపస్సులుగా అందుకే కీర్తించబడ్డాయి.

హైందవ ఋషుల ఆలోచన ఏంటంటే ఈ నాలుగింటినీ ఏ జీవి వ్యక్తీకరించినా అది తప్పుకాదు – అది శిక్షార్హమైన నేరమూగాదు.  అయితే జంతుప్రవృత్తిపట్ల వారికి ఉన్న జాలి సానుభూతి అక్కడితో ఆగిపోయాయి.

ఆకలి వేసిందిగదా అని పక్కవాడి చేతిలో ఉన్నది లాక్కుని తినెయ్యము ఎందుకని?!  ఎందుకంటే ఏది మనదో దేనిని మనం ధర్మంగా సంపాదించామో లేదా దేనిని అనుభవించడానికి మనకు తోటి సమాజం అనుమతిని అందజేసిందో దానినే మనం అనుభవిస్తాము.  దీనినే ‘సంస్కారం‘ అని పిలుస్తాము.  అంటే మనం ఆహారనిద్రాభయమైధునాదులలో జంతువులతో సమానమైనా మనలోని ‘సంస్కారం‘ మనని వాటినుండి వేరుచేస్తుంది.  ఈ సంస్కారం అనేది వాసనాగతంగా వస్తే బుద్ధి వాటిని అమలులో పెడుతుంది కాబట్టి మనలను బుద్ధిజీవులు అన్నారు.  అన్నంతినాలన్న కోరిక పుట్టినప్పుడు ఏది తినదగినదో దానినే తింటాము అంతేగానీ పెంటను తినంగదా?!  కుక్కలు పందులు ఇత్యాది జంతువులు స్వంత తల్లితోటి చెల్లితోటి రమిస్తాయి. అవి జంతువులు వాటిని గమనించిన మనం వాటిపట్ల అసహ్యాన్ని పెంచుకోము.  కానీ అదే తోటి మానవుడు అటువంటి వావివరసలులేని కోరిక వ్యక్తపరిస్తే అట్లాంటికోరిక తీర్చుకోవడానికి ప్రయత్నిస్తే మనం తీవ్రంగా ఖండిస్తాము, తిరస్కరిస్తాము.  అంటే కామపుకోరిక కలిగిందిగదా అని ఏది సంస్కారవంతమో దానివల్లే కోరిక తీర్చుకుంటాము అంతేగానీ సంస్కారహీనంగా జంతువుల్లా ప్రవర్తించముగదా?!  బ్రహ్మదేవునికి తన కూతురిపై కామపు కోరిక కలిగిందట దాంతో శివునికి ఆగ్రహాన్ని కలిగించినవాడయాడు. శివునితో శిక్షించబడ్డాడు.  అదే మృగశిరారాశికి చెందిన కధగా మనకు పరిచయం.

కానీ ఇవాల్టి సమాజం మానవులని జంతువుల్లా ప్రవర్తించమనే ప్రోత్సహిస్తున్నట్లుగా అనిపిస్తోంది.  ఆకలివేసింది కాబట్టి దేన్నిబడితే దాన్ని ఎలాబడితే అలా తినెయ్యమని అనుమతించితే నరమాంసభక్షణని ఎందుకు అనుమతించగూడదు?!  అలాగే కామం కోరిక తీర్చుకోవాలిగాబట్టి ఆడామగా తేడాలేకుండా ఎవరుబడితేవారు ఎక్కడబడితే అక్కడ కామపుకోరిక వ్యక్తపరుచుకోవడం తీర్చుకోవడం చెయ్యండి అని అనుమతిస్తే మరి బలాత్కారానికి వ్యతిరేకంగా చట్టాలు చెయ్యడం దేనికి?!  మనం ఎంత జంతువులమయినా మన సంస్కారాన్ని మనం మరిచిపోవడం లేదా అసలు సంస్కారం అనేదేలేదనే వాదన చెయ్యడం మంచిదిగాదు.  దీనివల్ల సమాజం విలువలుకోల్పోయి అధోగతి పాలవుతుంది.  ధర్మచక్రం గాడితప్పుతుంది …

వ్యక్తిగతంగా స్వలింగసంపర్కం నేరం అనే విషయాన్ని నేను ఒప్పుకోను.  ఎందుకంటే జంతువులలో వావివరసలు లేకుండా రమించడం, అలాగే స్వలింగసంపర్కానికి పాల్పడడం సహజం. మనం జంతువులను శిక్షించము.   కానీ మానవులు జంతువులుగాదు – జంతువులుగా అనిపించేవాటిలోనే అధికులు!  ‘జంతూనాం నరజన్మదుర్లభం‘ జంతువుల్లో మనిషిగా పుట్టడం చాలా దుర్లభం అని అందుకే అన్నారు.   అందువల్ల సంస్కారం అనేదాన్ని తుంగలో తొక్కి స్వలింగ సంపర్కం చేస్తాము అంటే చేసుకోండి… ఎవరుకాదంటారు?!  కానీ మీ జంతుత్వాన్ని ఒప్పుకొమ్మనీ దానిని సమర్ధించమని మీరు నినాదాలుచేసి తోటివారిపై వత్తిడితేవడం భావ్యంగాదని మనవిచేస్తున్నాను.

అసలు సంస్కారాన్ని వదిలేస్తే జంతువులలాగా ఎక్కడబడితే అక్కడ పెంటకు వెళ్లచ్చు, అలాగే ఎక్కడబడితే అక్కడ ఉచ్చపొయ్యచ్చు.  అలాగే ఎక్కడబడితే అక్కడ దేనినిబడితే దాన్ని తినచ్చు. అలాగే ఎవరితోబడితే వారితో రమించచ్చు…. మనం వెసుకోవాల్సిన ప్రశ్నల్లా ఈ జంతుప్రవర్తన ఎక్కడితో ఆగుతుంది అని?!  దీనికి హద్దేంటి అని?…. మనముందున్న ప్రశ్న నేను మనిషిలా బ్రతకాలనుకుంటున్నానా జంతువులా బ్రతకాలనుకుంటున్నానా అని….

ఇకపోతే కొందరు హిందుధర్మగురువులు హరిహరుల సంగమాన్ని అయ్యప్ప జననాన్ని ఉదాహరణచెప్పి స్వలింగసంపర్కాన్ని హైందవమతం వ్యతిరేకించలేదు అని అపప్రచారం చేస్తున్నారు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను.  హైందవమతం పునర్జన్మను నమ్ముతుంది. ఒక జన్మలోని స్త్రీ మరొక జన్మలో పూర్తిగా పురుషునిగా మారచ్చు, ఒక జన్మలోని పురుషుడు మరొక జన్మలో పూర్తిగా స్త్రీగానూ మారచ్చు….శ్రీహరి మోహిని అవతారం ఎత్తి పూర్తిగా అతిలోకమోహన స్త్రీగా మారినట్లుగా  మనకు తెలుస్తోంది.  కాబట్టి అది స్వలింగసంపర్కం కాదు.

ఇకపోతే స్వలింగసంపర్కులు ఈ క్రింద ఇస్తున్న శ్లోకాన్ని ఎడాపెడా అన్నిచోట్లా ఉటంకిస్తూ హైందవధర్మంలో మిత్ర వరుణ అనేవారు స్వలింగ సంపర్కులనీ వారికి పుట్టినవారే వశిష్టుడు అగస్త్యుడు అని చెబుతారు.  భాగవతంలోని ఈ శ్లోకానికి స్వలింగసంపర్కులుచేసేది ఖచ్చితంగా అనుచితమైన వ్యాఖ్య!

రేతః సిశిచతుః కుంభే ఊర్వశ్యాః సన్నిధౌ దృతం
రేవత్యాం మిత్ర ఉత్సర్గం అరిష్టం పిప్పలం వ్యధాత్! భాగవతం 6.18.6

ఊర్వశిని చూడగానే [మిత్రావరుణులలో] కామపూరితమైన కోరిక కలిగింది వారిద్దరూ రేతాన్ని స్ఖలించారు. ఆ రేతస్సును కుండలో పెట్టారు. మిత్రునికి తన భార్య రేవతిద్వారా ఉత్సర్గ, అరిష్ట మరియు పిప్పల అనే బిడ్డలు పుట్టారు.

వివరంగా చూస్తే మిత్రుడు వరుణుడు ఇద్దరూ స్నేహితులు మగవారు.  ఇద్దరికీ ఊర్వశి కనబడింది. ఊర్వశి చాలా అందంగా అవయవ సౌష్టవంతో చనుబిగువులతో ఆకర్షణీయంగా ఉన్నది.  ఇద్దరూ మగవారే కానీ ఆ దేవవేశ్యను చూసి మనసుపడ్డారు.  ఇద్దరికీ ఊర్వశిని చూడగానే ఆ కామంలో రేతఃస్కలనం అయింది. —- ఇక్కడ ఒక్కక్షణం ఆగి పరిశీలనగా ఈ శ్లోకం చదవండి…. స్వలింగ సంపర్కులంటే మగవారిపట్ల మగవారు అలాగే ఆడవారిపట్ల ఆడవారు ఆకర్షితులవడం.  మరి ఈ సందర్భంలో మిత్రుడు వరుణుడు ఇద్దరూ మగవారే కాబట్టి వారు ఒకరిపట్ల ఒకరు ఆకర్షితులైతే దాన్ని మనం స్వలింగ సంపర్కంగా పరిగణించవచ్చు.  కానీ ఇద్దరూ ఒకే ఆడదానిపట్ల ఆకర్షితులయారు.  అది సహజమేగదా! వారి రేతస్సును ’కుంభం’లో నిక్షిప్తం చేసారు అని ఉంది.  ’కుంభం’ అంటే మట్టికుండ అని సామాన్యార్ధం కానీ మానవదేహంగూడా మట్టితోచెయ్యబడ్డదే!  ఆవిధంగా చూస్తే స్త్రీ యోనిని [రేతస్సును భద్రపరచగల / నిక్షిప్తం చెయ్యగల మట్టితోచెయ్యబడ్డ] కుంభం అనచ్చు.  యోని అనకుండా కుంభం అని ఉండచ్చు.   ఆవిధంగా చూస్తే బహుశా మిత్రుడు వరుణుడు కలిసి ఊర్వశితో ఒకేసారి రమించి ఉండచ్చు.  అగస్త్యుడు వశిష్టుడు ఇద్దరూ ఊర్వశికి పుట్టిన బిడ్డలుగా మనకు తెలుస్తోంది.  కానీ వారి తండ్రి మిత్రావరుణులు – ఇద్దరూ అయుండచ్చు.  బహుశా డిఎన్‍ఎ పరీక్షల్లో ఎవరికి  ఎవరు నిజంగా పుట్టారో తెలిసి ఉండేది.  కానీ మిత్రుడికి వరుణుడికీ వారు మనసుపడి రమించిన ఊర్వశికి ఆ సంశయం రాలేదు.  అందువల్ల పుట్టిన బిడ్డలకు తండ్రి ఎవరు అంటే – ఇద్దరు తండ్రులు అని చెప్పడం జరిగింది.

మరి ఈ కధనంలో స్వలింగసంపర్కానికి తావెక్కడ?!  ఇలా ఈ శ్లోకాన్ని స్వలింగ సంపర్కులు తమ కక్కుర్తికోసం వాడుకోవడం ఇంతకంటే అన్యాయం ఇంకొకటి ఉందా?! ఇకపోతే అదేశ్లోకంలో మిత్రుడి భార్య రేవతి అతడి బిడ్డల ప్రసక్తి ఉంది.  కాబట్టి స్పష్టంగా ఈ ఇద్దరు మగవారు మిత్రావరుణులు ఆడవారిపట్ల ఆకర్షితులయారేగానీ వారు స్వలింగ సంపర్కులు కాదు.

ఈ నా నలభైఆరేండ్ల జీవితంలో నేను నాలుగువేదాలు చదివాను, రామాయణ భారతేతిహాసాలు చదివాను. అష్టాదశపురాణాలు ఉపనిషత్తులు అలాగే చిన్నా చితాకా ధర్మగ్రంధాలుగా చెప్పబడ్డ అనేక పుస్తకాలను చదివాను. ఎక్కడా ఏ గ్రంధంలోనూ స్వలింగసంపర్కాన్ని గూర్చిన చర్చలేదు అని నేను ఘంటాపధంగా చెప్పగలను.

కామాన్ని గురించి చర్చించిన శాస్త్రాలలో హైందవ వివాహమే ఒక గొప్ప దిశానిర్దేశాన్ని చేస్తోంది. రజస్వల అయిన ఆడపిల్లను కన్య అనిపిలుస్తారు. అటువంటి కన్యను మగవాడు కోరుకుంటాడు. ఆడమగ అనేది ఇక్కడ స్పష్టం. హైందవధర్మంలో వివాహం చాలా స్పష్టమైన నిర్దేశాన్నికలిగి ఉంది. శుక్రశోణితాల కలయికకోసం ధర్మపరమైన బిడ్డలకు సహజసిద్ధంగా జన్మనివ్వడంకోసం (ధర్మప్రజాసిద్యర్ధం) తల్లి పూర్వరూపంగా తండ్రి ఉత్తరరూపంగా బిడ్డలే సంధిగా వారుపాల్గొనే సృష్టికార్యమే సంధానంగా (మాతా పూర్వరూపం పితోత్తరరూపం ప్రజా సంధిః ప్రజనగ్‍ం సంధానం -యజుర్వేదం) హైందవ వివాహవ్యవస్థ ఏర్పడినట్లుగా మనకు తెలుస్తోంది.

నిజానికి ఆధునిక కాలంలోని తల్లితండ్రులు పాశ్చాత్యసంస్కృతిని పాటించి తమలోని కామపుకోరికను తీర్చుకోవడంకోసం తమకు పుట్టిన పిల్లలను దూరంగా ఎక్కడో గదుల్లో పడుకోబెట్టేస్తున్నారు.  ఆ పసిమనసుల్లోని భయాలకు అంతులేదు.  తల్లి తండ్రి ఆడమగ అనే భేదాన్ని సృష్టికార్యాన్నిగురించిన అపోహను పెంచుకున్న పసిమనసుల్లో తమలోని భయాన్ని పోగొట్టుకోవడానికి తల్లికి తండ్రి తోడుగా ఉన్నట్లే తమకుతోడుగా రాత్రి ఎవరూ లేక తమకుతామే తోడనుకుని స్వలింగసంపర్కంపట్ల ఊహలు పెంచుకుంటున్నట్లుగా తాము పెద్దవారయిన తర్వాత స్వలింగసంపర్కులుగా మారుతున్నట్లుగా పరిశోధనల్లో తెలుస్తోంది.  దీనిపట్ల మరింత పరిశోధన అవసరం.

స్వలింగ సంపర్కం అనేది ఈ పైన చెయ్యబడ్డ నిర్దేశానికి పూర్తిగా వ్యతిరేకం.  కాబట్టి అటువంటిదానిని ఏ హిందూ ధర్మగురువూ సమర్ధించగూడదు.  జంతువులు నేరం చెయ్యలేవు. అలాగే కొంతమంది మనుషులుగూడా నేరం చెయ్యలేరు.  కాబట్టి అది నేరంగాదు కానీ దానికి పూర్తి అనుమతి అడగడం పైగా ధర్మగురువులు దాన్ని సమర్ధించడం సమాజంలో నశించిపోతున్న విలువలకు సూచనగా భావిస్తాను.   ఓం స్వస్తి – మాధవ తురుమెళ్ల