పిండములను జేసి పితరులఁదలపోసి
కాకులకును బెట్టు గాడ్దెలార
పెంటఁదినెడు కాకి పితరుఁ డెట్లాయెనో
విశ్వదాభిరామ వినర వేమ!

కాకి గురించి వేమనకు తెలియని సత్యాలు:

1) మనిషి చనిపోతే అనాధ శవాలను రాబందులు పీక్కుతింటాయి. ఆ రాబందుల బారిన శవం పడకుండా కాపలాకాస్తాయి కాకులు. రాబందులతో పోట్లాడగల పక్షులు కాకులు మాత్రమే

2) కాకులు పక్షిజాతికంతటిలోకి తెలివిగలిగిన పక్షులు. అవి రామచిలుకలకంటే తెలివిగలవి.
3) కాకుల మెదడు చాలా పెద్దది.
4) కాకులు మరణ శౌచాన్ని పాటిస్తాయి. అంటే తమ తోటి కాకి చనిపోతే అవి శోకాన్ని మూకుమ్మడిగా వ్యక్తపరచడమే కాకుండా ఒక గంట తర్వాత కలిసి నదికిపోయి స్నానం చేస్తాయి. (అచ్చం మనుషులు అవబృతం పాటించినట్లుగా)
5) కాకుల మాంసం చాలా ప్రసిద్ధి పొందింది. వాటి మాంసం పందిమాంసంకంటే రుచిగా ఉంటుందని మాంసాహారులు చెబుతారు. ఇప్పటికీ పాశ్చాత్యదేశాలలో కాకిమాంసం తింటారు. ఒకప్పుడు పధ్నాలుగవశతాబ్దానికి ముందర దక్షిణ భారతదేశంలో కాకులను తినేవారు. దేశంలో క్షామం వచ్చినప్పుడు కాకులమాసం వారు తినడానికి పనికొచ్చేది.
6) కాకులు మనుషుల తర్వాత అతి త్వరగా నేర్చుకునే జీవులు. వీటికి విషయం కోతులకంటే తొందరగా అర్ధమవుతుంది.
7) కాకులు భయంకరమైన విషసర్పాలను, క్రూరమృగాలను అతి త్వరగా పసిగడతాయి. పెద్దగా కా కా అని గోలచేస్తాయి. కాబట్టి కాకుల అరుపులు విని ప్రమాదాన్ని పసిగట్టవచ్చు.
8) మనకి మామూలుగా ’కా కా’ అన్నట్లు వినిపించినా కాకి భాష చాలా అభివృద్ధి చెందిన భాష అని చెబుతారు. ఆ భాషతో కాకులు ఒకదానితో వేరొకటి సందెశాలిచ్చుకుంటాయని, కలిసి పనిచేస్తాయని తెలిసింది.

ఏ రకంగా చూసినా కాకులు అతి తెలివిగలిగిన పక్షులు, పైగా మానవాళికి ఉపయోగపడేవి, ప్రమాదాలనుండి హెచ్చరికలు అందజేయగలిగేవి అనేది నిస్సందేహంగా ఋజువైన సత్యం. అటువంటి కాకులకు తమ పితృదేవతల పేరిట ఇంత అన్నం పెట్టడంలో నాకయితే తప్పేమీ కనబడలేదు. కాబట్టి వేమన విమర్శకు అర్ధంలేదని నేననుకుంటాను. పాతంతా రోతకాదు, కొత్తంతా వింతాకాదు… మనపాతలో తరతరాలనుండీ తెలుసుకుని అర్ధంచేసుకున్న ఒక సత్యం ఉంది. ఇవాళ మనకది అర్ధంకాకపోవచ్చు కానీ సరిగా విశ్లేషిస్తే మన పాత తరాలవారి పద్ధతుల్లో వారునమ్మిన కొన్ని విషయాల్లో మనకు అర్ధం ద్యోతకమవుతుంది… అందుకే శ్రద్ధ పెట్టి వినండి అని చెబుతారు.