పైన నడినెత్తిన ప్రపంచాన్ని దగ్ధం చేసేటట్లు
ఆగ్రహోదగ్రంగా సూర్యగోళం భగబగా మండుతోంది.

రోడ్ఛుపక్క ఏ చీడపురుగు చేతపడిందో కాలంకాని కాలంలో
ఆకులు పూర్తిగా రాల్చేసుకున్న చెట్టు సిగ్గుతో నగ్నంగా నిల్చోనుంది…

నీరు దొరక్క గొంతు ఆర్చుకుపోయిన కాకి
దిక్కుతెలియక పోయినట్లు అటూ ఇటూ అదేపనిగా తలతిప్పుతూ
ఏవో విపరీతపు అరుపులు అరుస్తోంది….

తోక కాళ్ల మధ్యకు ముడుచుకుని జీవితంలో ఓడిపోయి
అన్నీ పోగట్టుకున్న దానికి మల్లే ఒక పిచ్చికుక్క
బ్రతకటానికి ఆరాటపడుతూ తోటికుక్కల
దంష్ట్రాకరాళాలనుండి రక్కసి రక్కులనుండి దూరంగా పారిపోతోంది….

డొక్కలు వెన్నెముకకానుకొని,
వెన్నెముకేమో –
మానవుడైన రామునిచేతిలో –
విరచబడ్డ భగవంతుడైన శివునివిల్లులాగా –
అప్రాకృతికంగా మెలికలు తిరిగిపోయి,
నోటిలో పండ్లూడిపోయి,
ఎండిన చనుగవల కప్పేందుకు –
బూడిద దుమ్ముతో దుప్పటిలాగా అలముకొని
ఒక ముసలి బిచ్చగత్తె – కొరడాతో కర్కశంగా కొట్టబడ్డ బానిసవలె మూలుగుతోంది…

లోకమంతా ఈ సమ్మెవేళ –
ఒక రోగగ్రస్థవలె, ఒక తూర్ణీకృత వికృతిగా
ఇక యుగాంతమే తరువాయన్నట్లు
ఉరికంబాన్నెక్కబోయే ఖైదీలా,
బలిస్థంబాన్నలంకరించబోయే మూగజీవంలా
ఇలా దీనంగా… దరిద్రంగా….
కాళ్లీడుస్తూ నడుస్తోంది….

— మాధవ తురుమెళ్ల