హిందూమతంలో కులములు వర్ణములు అని నేను ఇంతకు పూర్వం రాసిన నా ఆలోచనకు ఒక సమర్థనీయమైన ఆసరా ఉన్నది.   మామూలుగా ‘హైందవమతమే‘ కులము పుట్టుకకు కారణమని చెబుతూంటారు.  కానీ నేను పరిశోధించి కనుక్కున్న విషయం కులము హిందూమతంలోనుండి పుట్టలేదనీ నిజానికి అనేకకులములకు ఇతఃపూర్వమే చెందిన వ్యక్తులు హిందువులుగా సంఘటితమయారనీ వారిమధ్య వివక్ష హైందవమతవివక్షకాదనీ వారిమధ్యవివక్ష ఇంతకు పూర్వంనుండే ఉండేదనీ కాబట్టి హైందవమతానికి కులవివక్షకు సంబంధంలేదనీ చెప్పాను.  ఇప్పుడు ఇది చదవండి.


http://madhavauk.blogspot.co.uk/2011/04/blog-post.html

http://www.nature.com/nature/journal/v461/n7263/abs/nature08365.html


“నా దేశం చంద్రుడి మీద మనిషిని నిలపక పోయినా ఫర్వాలేదు,భూమ్మీద మనిషి ని మనిషి గా చూస్తే చాలు”

రెండు వంశాల నుంచే సమస్త కులాలు!

కులం పుట్టుక… ఎక్కడిది? ఏనాటిది? ఈ కుల భావనకు బీజాలు ఎప్పుడు.. ఎలా పడి ఉంటాయి..? సామాజికంగానే కాదు.. ఆర్థికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా కూడా నేటి ఆధునిక జీవనంతో ఎన్నో రకాలుగా ముడిపడిన ఈ ప్రశ్నలకు… జన్యుశాస్త్రవేత్తలు ఓ శాస్త్రీయమైన సమాధానాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేశా

రు. భారతీయ సమాజంలో కులాలు ఇప్పటివి కావనీ.. వేల ఏళ్ల క్రితం భారతీయ సమాజం ఏర్పడే దశలోనే.. నేరుగా ఆదిమ సంఘాల(ట్రైబల్‌ ఆర్గనైజేషన్స్‌) నుంచే ఈ కుల వ్యవస్థ రూపుదిద్దుకుని ఉండొచ్చని చెప్పేందుకు జన్యు పరిశోధనలు దోహదం చేస్తున్నాయి. హైదరాబాద్‌లోని సీసీఎంబీ, అంతర్జాతీయ ఖ్యాతి గడించిన హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌, హార్వర్డ్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌, మాంఛెస్టర్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ పరిశోధకులు సంయుక్తంగా నిర్వహించిన జన్యు అధ్యయనంలో ఈ విషయం వెల్లడవటం విశేషం. ఈ పరిశోధనా వివరాలను ప్రతిష్ఠాత్మక ‘నేచర్‌’ పత్రిక తాజా సంచికలో వెలువరించింది. సామాజికంగానే కాదు.. వైద్యపరంగా కూడా ఈ పరిశోధనకు ఎంతో ప్రాముఖ్యం ఉంది.

ఎక్కడి నుంచి ఎక్కడికి?

దేశంలోని 13 రాష్ట్రాలకు చెందిన, ఆరు భాషలు మాట్లాడే, 25 విభిన్న కుల వర్గాలకు చెందిన, 132 మంది వ్యక్తులను, 5 లక్షల జన్యువులను వీరు విశ్లేషించారు. దీనిలో- భిన్నమైన భారతీయ జాతులు, వర్గాలకు వారివారి వంశపారంపర్య లక్షణాలు 40-80% వరకూ రెండే మూల జాతుల నుంచి సంక్రమించాయని వెల్లడైంది. దీంతో భారతదేశంలో ప్రధానంగా ఉత్తర భారతీయ వంశజులు(యాన్‌సిస్ట్రల్‌ నార్త్‌ ఇండియన్‌-ఎఎన్‌ఐ), దక్షిణ భారత వంశజులు(ఎఎస్‌ఐ).. జన్యుపరంగా కేవలం ఈ రెండు జాతుల జన్యు ఛాయలే కనబడుతున్నాయని పరిశోధకుల్లో ఒకరైన సీసీఎంబీ శాస్త్రవేత్త కుమారస్వామి తంగరాజ్‌ వెల్లడించారు. సాధారణంగా ఉత్తర భారతీయులంతా ఆర్య సంతతి, దక్షిణాది అంతా ద్రవిడ సంతతివారంటూ ఏళ్లుగా ప్రచారంలో ఉన్న భావనలను ఈ పరిశోధన తోసిపుచ్చుతుండటం చెప్పుకోదగిన అంశం. జన్యుపరంగా చూస్తే- ఉత్తర భారత వంశజులంతా ప్రస్తుత ఐరోపా జాతులకు దగ్గరగానూ, దక్షిణభారత వంశజులు ప్రస్తుతం అండమాన్‌ దీవుల్లో అంతరించిపోతున్న ఓంగె గిరిజన తెగకు దగ్గరగా ఉంటోందని వీరు గుర్తించారు. (ఈ ఓంగె తెగ 65000 సంవత్సరాల క్రితం ఆఫ్రికా నుంచి వలస వచ్చిన ఆదిమ జాతులకు బాగా దగ్గరగా ఉందని గతంలో సీసీఎంబీ నిర్వహించిన అధ్యయనాల్లోనే వెల్లడైంది.) మొత్తమ్మీద ఈ పరిశోధన ఆధారంగా చూస్తే- భారతదేశంలోని చాలా ఆధునిక జాతులు.. కులాలు, వర్గాలన్నింటిలోనూ కూడా ఈ ఎఎన్‌ఐ, ఎఎస్‌ఐ జాతులకు చెందిన జన్యు లక్షణాలే కనబడుతున్నాయి. కాబట్టి ఈ కులాలన్నీ కూడా కొద్దిమంది మూలవంశీయుల నుంచే పుట్టుకొచ్చి ఉంటాయని అర్థమవుతోంది.

హిందీ వంటి ఇండో-యూరోపియన్‌ భాషలు మాట్లాడుతున్న అగ్రవర్ణాల వారిలో, ఆశ్చర్యకరంగా ఉత్తరభారత వంశజుల(ఎఎన్‌ఐ) జన్యువులు ఎక్కువగా కనబడుతున్నాయని పరిశోధనలో తేలింది. అయితే చాలామందిలో రెండుజాతులకు చెందిన జన్యువులు కనబడుతుండటం.. ఈ దేశంలోని ‘భిన్నత్వంలోని ఏకత్వానికి ప్రతీక’ కావచ్చని, భారత జాతీయతలో పైకి కనబడని అంతస్సూత్రం అదే కావచ్చని.. ఈ పరిశోధనపై నేచర్‌ పత్రికలో వ్యాఖ్యానం రాసిన జాన్స్‌ హాప్కిన్స్‌ పరిశోధకులు అరవింద చక్రవర్తి వ్యాఖ్యానించారు.

వైద్యపరంగా ప్రాముఖ్యం

భారతీయులు ఎవరిలోనూ కూడా ఎఎన్‌ఐ, ఎఎస్‌ఐలలో ఏదో ఒకరకం జన్యువులే లేవని, అందరిలోనూ ఎంతోకొంత ఈ రెండు జన్యుఛాయలూ కనబడుతుండటం చూస్తుంటే తరాలు పెరిగిన కొద్దీ వీరిలో జన్యుపరమైన ఉత్పర్తివర్తనాలు పెరిగిపోయి వ్యాధుల బారినపడే అవకాశాలు ఎక్కువని హార్వర్డ్‌ పరిశోధకులు డేవిడ్‌ రిచి వెల్లడించారు. కొద్దిమంది మూల జాతీయుల్లో.. వారివారి మధ్య వివాహాల కారణంగా పెరిగిన సంతతి కావటం వల్ల ఆరోగ్యపరమైన సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది. దీన్నే వైద్యపరంగా ‘ఫౌండర్‌ ఎఫెక్ట్‌’ అంటారు. దీనివల్ల తరతరాలుగా నిద్రాణంగా ఉంటున్న జన్యు సమస్యలు.. ఈ ఉత్పరివర్తనాలు పెరిగేకొద్దీ బయటపడే అవకాశాలు పెరుగుతాయి. ఫలితంగా సిస్టిక్‌ ఫైబ్రోసిస్‌, సికిల్‌ సెల్‌ ఎనీమియా వంటి జన్యు వ్యాధులు పెరిగే అవకాశం ఉంటుందని పరిశోధకులు భావిస్తున్నారు.

భారతదేశంలోని జాతులు, కులాలన్నీ పద్ధతిప్రకారం, కచ్చితంగా భిన్నమైనవేం కాదని జన్యు పరిశోధనలు చెబుతున్నాయి. భారతీయ సమాజం ఏర్పడుతున్న దశలోనే.. అదొక రూపానికి వచ్చే క్రమంలోనే.. కులాలన్నవి నేరుగా ఆదిమ గిరిజన తెగల నుంచే ఏర్పడ్డాయన్న భావనను సమర్థించేదిగా ఉన్నాయి.

– కుమారస్వామి తంగరాజ్‌
సీసీఎంబీ పరిశోధకులు