శ్రీరామచంద్రుడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో, అభిజిత్ ముహూర్తంలో (మధ్యాహ్మం 12 గంటల వేళలో) త్రేతాయుగంలో జన్మించాడు. ఆ అవతారదినాన్నే ప్రజలు శ్రీరామనవమి పండుగగా జరుపుకుంటారు. ఇకపోతే  పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము, రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగింది అని చెబుతారు.   
రామాయణం ఒక మహాకావ్యం.  సంస్కృత కావ్యలక్షణాలన్నీ ఉన్న ఇతిహాసమే రామాయణం.  నిజంగా జరిగిన కధను మనం ఇతిహాసం అనీనూ, జరిగిందోలేదో ఇదమిత్థంగా తెలియని కధలను పురాణం అనీనూ అంటాము.  మనకు ఉన్నవి పద్దెనిమిది పురాణాలు అలాగే రామాయణము భారతమూ అనే రెండు ఇతిహాసాసాలు.   శ్రీమద్రామాయణం అని మనం పిలుచుకునే ఐతిహాసిక మహాకావ్యానికి వాల్మీకి మహర్షి పెట్టినపేరు ’పౌలస్త్యవధ’ రావణుడు పౌలస్త్యుడు అతడి వధకు చెందిన కధ కాబట్టి శ్రీమద్రామాయణానికి పౌలస్త్యవధ అని పేరు.  వాల్మీకి మహర్షి రాసిన రామాయణం పౌలస్త్యవధతో శ్రీరామ పట్టాభిషేకంతో పూర్తవుతుంది.  ఆ తర్వాత రాయబడ్డ ఉత్తరరామాయణం వాల్మీకి మహర్షి రాసినదికాదని పండితుల అభిప్రాయం.  వాల్మీకి శ్రీమద్రామాయణంలో రాసిన శ్లోకాలకు విరుద్ధమైన ’రాముడు మాంసభక్షణ’ చెయ్యడం, సీతమ్మను అడవులకు పంపడం వంటి వాల్మీకిమహర్షి ’కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కస్య వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ…’ అంటూ తార్కికంగా ప్రతిపాదించిన  శ్రీరామ గుణలక్షణ విరుద్ధమైన సంఘటనలు ఉత్తరరామాయణంలో ఉంటాయి.  అంతేకాకుండా ఉత్తరరామాయణం లేకుండానే కావ్యలక్షణాలు పౌలస్త్యవధకు చక్కగా సరిపోతాయి.  అంటే రామాయణంలో ఉత్తరరామాయణంలేకపోయినా రామాయణమహాకావ్య లక్షణాలకు భంగం కలుగదు. కాబట్టి వాల్మీకి రామాయణం రామపట్టాభిషేకంతో సంపూర్తిఅవుతుందని పండితాభిప్రాయం. సరే అదంతా వేరొక చర్చ…
 
రామనవమినాడు సీతారామకల్యాణం ఎందుకుచేస్తారు? అని ప్రశ్న.  శ్రీరాముడు అవతారపురుషుడు.  శ్రీరాముని అవతారలక్ష్యమే పౌలస్త్యవధ.  ఆయన జన్మించినది రావణుడనే రాక్షసుడిని చంపడానికి.  రావణుడు సీతమ్మను ఎత్తుకుపోతాడు.  రాముడు రావణుడిని చంపి తన భార్యను కాపాడుకుంటాడు.  అంటే ఆయన జన్మకు, సీతారామకల్యాణానికి అవిభాజ్యమైన బ్రహ్మముడి ఉన్నది. అందుకే ఆయన జన్మదినంనాడే మనం శ్రీసీతారామకల్యాణం జరుపుకుని ఆయన అవతార వైభవాన్ని ఆయన అవతార ప్రాసస్త్యాన్ని గుర్తుచేసుకుంటాము. ఆయన జన్మించినది రావణుడిని చంపడానికైతే, రావణుడు ఆయన భార్యను ఎత్తుకెళ్లేంతవరకు రావణవధకు తగిన సమయం ఆసన్నంకాదు.  అందుకే ఆయన కల్యాణం జరిపి సీతమ్మను ఆయనపక్కన కూర్చుండబెట్టి వారిద్దరి అవతార మాహాత్మ్యాన్ని మనం శ్రీరామ నవమినాడు గుర్తుతెచ్చుకుంటాము.
ఆయన పెళ్లి చూసిన ప్రతిఒక్కడూ పరస్త్రీ పై పరుని భార్యపై రావణునిలా కన్ను పడితే రామబాణం వచ్చి తగులుతుందని ఒక గుణపాఠంగా గుర్తుతెచ్చుకుంటారు.  ఇదీ మనం శ్రీరామనవమినాడు శ్రీసీతారామకల్యాణం జరుపుకోవడంలో గల ఒక అంతర్యం.  స్వస్తి…. -మాధవ తురుమెళ్ల, లండన్, 21 ఏప్రిల్ 2013