భోజ్యానాయక్ మరణ చిత్రాన్ని నిన్న నాకెవరో పంపించారు… చూసి నా మనసు చలించిపోయింది… ఎందుకీ యుద్ధాలు బలవన్మరణాలు వాళ్లడిగిన రాజ్యం వాళ్లకు ఇచ్చెయ్యగూడదా అని నా మనసు నాలుగు పద్యాలు పలికింది వాటిని ఇక్కడ ఇస్తున్నాను…

భోజ్యానాయక్ మరణం
============
పద్యరచన: తురుమెళ్ల మాధవ ’26 మార్చి 2012′

మ.
మరపో మారిన రాజ్యమో ఎవరి లాభంబీ తెలంగాణమో
కరవై పోయెన రాజమా ర్గముల యోకారు ణ్యమేలేదహో
మరణా న్నావహ మేలజే యవలె? యామంటల్బడెన్గాలె! యే
షరతుల్బెట్టక యేల నేగవలె భోజ్యానాయకుండ క్కటా!

చేతికందిరావాల్సిన ఆ బిడ్డని పోగొట్టుకున్న ఆ తల్లి మనసుగూర్చి ఆలోచిస్తే….

కం.
కాడా బిడ్డడు యమ్మకు?
లేడాయని బాధపడద రేతిరి పగలున్?
చూడాలనుకొని బిడ్డను
వేడాలనుకొను తనకిక వేదనె మిగిలెన్!

కం.
బాధిత వర్గపు కోరిక
శోధిత మున్జేయ దలువర సోదరు లెవరూ?
వేధిత పామర జనములు
వీధిన పడియున్నతీరు విశదము గాదా!

ఉ.
చిందరవందరై నటుల చించిన విస్తరి తీరుతెన్నుగా
ఎందుల కీయుద్ధ మసలు? ఎవ్వని రాజ్యము లేవిబోవునో!
వందల వేలసంఖ్యలుగ వీధినబోవుచు వాదులా డగా
తొందరలేదు లేదనుచు తోచిన రీతిన జాగులేలనో!

కం.
సోదరులేగద చూడగ
వాదనపడు వారు తెలుగు వారలు గారా!
రోదన కూడదు వారిని
వేదన బాల్జే యవద్దు వేరు పడెదమో… 

కం.
చాలిక ఈ మరణంబులు
పోలికలేనిది జగడము పోనీరాదా!
వాళ్లిక అడిగిన రాజ్యము
వాళ్లకు ఇచ్చెయ్యమనుచు వినతుల జేతున్!

——xxx—–