పడకకి రాని నిద్ర
===========

పడకకి రాని నిద్ర
అలిగిన ప్రియురాలికంటే
ఎక్కువగా బాధిస్తుంది..!
విసుగుని కళ్లలో
చిరాకును నొసట్లో నింపేసి – 
అహ్లాదమనే బిడ్డని కనే
అవకాశం లేకుండా చేస్తుంది…
నిద్రరాని ప్రతిరాత్రి
బలవంతంగా విడాకులకు గురైన
భర్తలాగా అంతరంగంలో బాధ..!
నిద్ర పడకకి రాని పతిరాత్రీ
వెలయాలిని ఆశ్రయించిన విటుడిలాగా
పుస్తకమో –
సంగీతమో –
టీవినో,
మరింత ముదిరిన వేశ్యా వ్యసనంలో –
నిద్రమాత్రలో బ్రాందీసీసానో
ఏదో ఒకదాన్ని ఆశ్రయించి
బలవంతంగా నిద్రతో రమించి,
మర్సటిరోజు మామూలుగానే
రాత్రి ఏమీ జరగనట్లు మొహం..|
మనిషికి రాని నిద్ర
మరణంతో సమానం,
కానీ విచిత్రం –
మరణం మాత్రం
అదేంటో శాశ్వతమైన
నిద్రలాగానే భ్రమింప జేస్తుంది…
-మాధవ తురుమెళ్ల