నా కోరిక – కవిత

Thursday, August 1st, 2013 @ 4:09PM

చీమలు పెట్టిన పుట్టలో
పాములు చేరుతున్నాయి.
సాకలేని కోకిల
కాకిగూటిలో తనబిడ్డని వదుల్తోంది.
కురవని మేఘం
తన నల్లదనంతో నేలను –
నమ్మిన రైతును మభ్యపెడుతోంది.
ముద్దొచ్చే గులాబీ ముళ్లకంపలో దాక్కుంది.
పతితపావనమైన గంగలో బండరాళ్లే మునిగున్నాయి.

కొందరు అనూచానంగా –
వంచన, కర్కశత్వం, నిర్దయత్వం
ఇవేనా  ప్రకృతిధర్మాలు అని ప్రశ్నిస్తున్నారు.

ఎందుకో తెలియని మాయ!
ఆత్మలో లయమై త్వమేవాహం అనాల్సిన మనిషి
తనలోపల లోలోపల
ఎక్కడోదాగిన
అరిషడ్వర్గాల ఆరాటాల్లో మునిగి
తన ప్రకృతిని తానే బలాత్కరిన్నాడు…

కొందరు
శూన్యత ముసుగు కప్పుకుని
విషాదపు చెలమలవద్ద
ఆశ్రువులతో స్నానం చేస్తున్నారు…

మరికొందరు
పోరాటపు జెండాకింద నిలబడి
తమ రుధిరంతో తామే వీరతిలకం దిద్దుకుంటున్నారు,
తమ సమాధుల్లో తామే స్వచ్చందంగా ఆడుగుపెడుతున్నారు…

కానీ నాకు
గతిస్తున్న కాలాన్ని
స్తుతిస్తున్న తాత్వికులనీ,
నిర్భయత్వంతో నడిచే నిజాయితీపరుల్నీ,
అలసిపోని గొంతుకతో
ఆత్మవిశ్వాసపు గీతిక పాడెవారినీ
ఇంకా
మహర్షులను, మమతనందించేవారినీ,
నిజమైన మానవులనీ
చూడాలని నిజంగా కోరికగాఉంది…
వీరు ఎప్పుడో ఒకప్పుడు
ప్రపంచగమనాన్ని
మారుస్తారని ఏదో
అంతు తెలియని ఆశ – నాలో దాగుంది…

-మాధవ తురుమెళ్ల
—ఽఽఽ—-

Posted by
Categories: కవితలు

No comments yet. Be the first!
Leave a Reply