ఆదౌ స్వరాజం గురుం అద్వితీయ మఖండ చిద్రూప ఘనం మహేశం నారాయణం పద్మభవం వశిష్ఠం శక్తించ తత్పుత్ర పరాశరం చ వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవింద వాగీంద్ర మధాస్య శిష్యం శ్రీశ్రంకరాచార్యమహం ప్రపద్యే

పూర్వపక్షం: పునర్జన్మ ***ఖచ్చితంగా*** ఉన్నది. పాపము పుణ్యముల ఫలితంగానే జీవులు జన్మిస్తున్నారు. ఇదీ పూర్వపక్షం… ఈ వాదాన్ని నేను ఖండిస్తున్నాను.

ఖండన:

న కశ్చిజ్జాయతే జీవః సంభవోస్య న విద్యతే |
ఏతత్తదుత్తమం సత్యం యత్ర కించిన్న జాయతే || గౌడపాదకారిక

“ఏ జీవుడూ ఏనాడూ పుట్టడు. అసలు జీవుడు పుట్టడానికి ఏ కారణమూ లేదు. ఉత్తమమైన సత్యం ఏంటి అంటే ఎప్పుడూ ఏదీ పుట్టలేదు (అజాతము).” – మాండూక్యోపనిషత్తు గౌడపాదకారిక 3వ అధ్యాయం 48వ శ్లోకం.

కాబట్టి జీవుడు ఇంతకుముందర పుట్టి ఉన్నాడు అనేది అసత్యము. మరయితే “జన్మించిన వానికి మృత్యువు తప్పదు, అలాగే మరణించినవానికి జన్మ తప్పదు ’జాతస్యహి దృవో మృత్యుః దృవంజన్మ మృతస్యచ” అన్న గీతావాక్యం అసత్యమా? అని మీలో సందేహం కలగచ్చు. గీతావాక్యమూ అసత్యంగాదు. ఎందుకంటే “ఎవరు జన్మించారో వారికే మృత్యువు ఎవరు మరణించారో వారికే జన్మ!” అంతేగానీ మృత్యుంజయులకు అజాతులకు గాదు. మీరు పుట్టారో లేదో మీరే ఊహించుకోండి.

గౌడపాదులవారు ’అస్తిసిద్ధము భాతిసిద్ధము’ అని పదములు ఉపదేశించారు.. ఉదాహరణకు తాడు అనేది అస్తిసిద్ధం (ఉంది). మనం పట్టపగలు వెలుతురులో తాడును తాడుగా చూస్తాం – అలా చూడడం భాతిసిద్ధం. ఏది అస్తిసిద్ధమో దానినే భాతిసిద్ధంగా చూస్తున్నాము. ఏది ఉన్నదో దానిని చూస్తున్నాము. కానీ చీకట్లో తాడును చూసి పాముగా భ్రమిస్తాము. పాము భాతిసిద్ధం (భ్రాంతి మీలో ఉన్నది) కానీ అది నిజమా? కాదు అది తాడు కాబట్టి అది అస్తిసిద్ధం కాదు. అంటే ఏది కనబడిందో అది నిజంగా లేదు. ఏది సత్యమో అది అస్తిసిద్ధము భాతిసిద్ధమూ రెండూ కావాలి అంటారు.

పాపము అన్న భావన అలాగే పుణ్యము అన్న భావనగూడా భాతిసిద్ధములే! కానీ అస్తిసిద్ధములుగావు. అలాగే జన్మ మరియు మృత్యువు అన్నవిగూడా భాతిసిద్ధములే! అవి అస్తిసిద్ధములయేందుకు ఆస్కారమే లేదు.

ఉదాహరణకు మీరు కలగంటారు. కల చూసినంతసేపు మీకు అది భాతిసిద్ధమే! కానీ మేలుకొన్న తర్వాత కలేగదా అని నవ్వుకుంటారు. అంటే అది అస్తిసిద్ధం గాదు. ఏది కనబడుతోందో అదే అసత్యం! దీన్నే సైన్సుగూడా ఒప్పుకుంటుంది. మీరు కుండ ఎర్రరంగులో ఉన్నది అంటారు. కానీ సైన్సు ఏం చెబుతుందంటే ’ఆ కుండపై ఒక్క ఎర్రరంగు తప్పనిచ్చి మిగిలిన ప్రతిరంగు ఉన్నది’ అని… అంటే ఏది లేదో అది ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. దీనినే గౌడపాదాచార్యులవారు ’దృశ్యత్వాత్ అసత్యం’ అన్నారు అంటే ’కనబడుతోంది గాబట్టే అసత్యం’ అని. ఆలోచించండి…

ఇంకాకొంచెం లోతుగా చూద్దాము. కుండ మట్టితోటి చెయ్యబడింది. ఇది మనందరికీ తెలుసు కానీ నేను మీకు కుండను చూపించి ’ఇదేంటి?’ అని అడిగితే కుండ అనే అంటారుగానీ ’మట్టి’ అని అనరు! ఎందుకని ?! ఎందుకంటే మన మనసు ’సంస్కారస్తు ప్రవర్తతే’ సంస్కారాన్ననుసరించి కుండ అని చెబుతోంది. అంటే తనలో ఏది ఉందో దానిని దృశ్యంమీద ఆరోపించి చూస్తోంది. కనబడేది మట్టే అయినా ’కుండ’ అని ప్రత్యేకించి చెబుతోంది.

రామకృష్ణ పరమహంస ప్రయాణం చేస్తున్న పల్లకీని బోయూలు హడావుడిలో గమ్యం తొందరగా చేర్చే ఉద్దేశ్యంలో వేశ్యావాటికలోనుండి తీసుకు వెళ్తున్నారు. ఒకవేశ్య ఆయననుచూసి తన పైట తొలిగించి అసభ్యమైన చేష్టచేసింది. ఆయన చిన్నపిల్లవానివలే ’అమ్మా కాళీమాతా నీవు ఇక్కడ ఉన్నావా?’ అన్నారట! దాంతో బిత్తరపోయిన ఆ వేశ్య లోనికి వెళ్లిపోయింది. అదే కామాతురుడైన ఏ విటుడో చూసిఉంటే అతడికి ఆ వేశ్య ఒక వేశ్యగానే కనబడేదేతప్ప కాళికామాతగా మాత్రం గాదు! అదే సంస్కారస్తుప్రవర్తతే! జీవులు ప్రపంచాన్ని అలాగే చూస్తారు. ప్రపంచం ఒకటే అయినా జీవన్ముక్తుడికి కనబడే ప్రపంచంవేరు జీవుడికి కనబడే ప్రపంచం వేరు.

మనమందరమూ మనుషులము. మనందరిలోనూ ప్రవహించేది చీమూ, నెత్తురూ అలాగే మనందరి శరీరములూ బొమికలతో నిండి చర్మంతో కప్పబడి ఉంటాయి. కానీ మనం ఒక్కోవ్యక్తినీ ఒక్కోపేరుతో పిలుస్తాము… ఎందుకని? బస్సులో ఏభైసీట్లు ఉన్నాయి. ఎవరైనా కూర్చోవచ్చు. కానీ రిజర్వుచేసుకుని ’నాసీటు’ అంటాము? సత్యమా! ఎంతవరకూ ప్రయాణం చేస్తానో అంతవరకే నా సీటు. నేను నా గమ్యస్థానం చేరిన తర్వాత అది ఇంకొకరి సీటుగా మారుతుంది. అలాగే మనం తాగి విడిచిన నీరు శుభ్రపరచబడి ఇంకొకరికి తాగేనీరుగా మారుతుంది.. అందుకే జగత్తు ప్రపంచం అంతా ’భాతిసిద్ధమే’ గానీ అస్తిసిద్ధంగాదు. ఏది నీది అనుకుంటున్నావో నిజంగా అది నీది గాదు… అంటే అస్తిసిద్ధంగాదు. కాబట్టి అసత్యం. ప్రపంచం అసత్యం…

ఇక ప్రపంచమే అసత్యం అయినప్పుడు ఎవరో ఒక జీవుడిని ప్రత్యేకించి పట్టుకుని ’పాపి’ అనో లేదా గతజన్మలో పాపం చేసాడుగాబట్టే ఈ జన్మలో అనుభవిస్తున్నాడు అనో అనుభవిస్తోంది’ అనో అన్నారనుకోండి అది మీలోని కుసంస్కారాన్నే సూచిస్తుందిగానీ సత్యాన్నిగాదు… ’దృశ్యద్వాదసత్యం’. అతిక్రూరంగా బలాత్కారానికి గురై ఢిల్లీలొ చనిపోయిన ఆడపిల్ల నిర్భయ గురించి ’గత జన్మలో పాపం చేసింది కాబట్టే అనుభవించింది’ అని కొందరు హిందూమతగురువులమని చెప్పుకునే వారు వ్యాఖ్యానం చేసారు. నా దృష్టిలో వారు పరమ అజ్ఞానులు. హైందవధర్మంపై ఏ మాత్రం అవగాహన లేని వారు… ఎందుకంటే జన్మయే అసత్యం…’దృశ్యద్వాదసత్యం’ అన్నారు గౌడపాదాచార్యులవారు.

నిజానికి ’మీరు జన్మించారు’ అని మీరు భావిస్తే (భాతిసిద్ధం) అనుకుంటే మీకు జన్మ ఉన్నది. మీరు ’అనుభవిస్తున్నాము’ అనుకుంటే మీకు పూర్వజన్మ పాపం ఉంది. అంతేగానీ పూర్వజన్మ ’ఖచ్చితంగా ఉన్నది’ అని మీరు అంటే దాన్ని అజాతవాదం ఒప్పుకోదు. శుద్ధ అద్వైతమూ ఒప్పుకోదు. పూర్వజన్మ ఉన్నది ఎవరికి? అది పారమార్ధిక సత్యమా, వ్యావహారిక సత్యమా లెక ప్రాతిభాసిక సత్యమా’ అన్న ప్రశ్న వేసుకోని సమాధానపడాలి.

మరి మనకు కనబడే సత్యం ఏంటి? మనం అనుభవించే సుఖదుఃఖాలు ఏంటి? మనం చెప్పుకునే జ్యోతిషం ఏంటి? అని మీరు ప్రశ్నిస్తే ఎవరు బంధించబడ్డామనుకుంటారో వారే విముక్తికోసం ప్రయత్నిస్తారు. ఎవరు ఇప్పుడు సుఖంగా లేను అనుకుంటారో వాళ్లే రాబోయే సుఖంకోసం ఇప్పుడు కష్టపడతారు. జ్యోతిషంపై గుడ్డినమ్మకం పెట్టుకోవడం బౌధ్ధ ఆలయవిజ్ఞానవాదమేగానీ శుద్ధహైందవంగాదు.

స్థాణౌ పురుషవద్ భ్రాంత్యా కృతా బ్రహ్మణి జీవతా
జీవస్య తాత్త్వికే రూపే తస్మిన్ దృష్టే నివర్తతే || ఆత్మబోధ 45 – ఆదిశంకరాచార్య.

చెట్టుమోడుని దూరంనుండి చూసినపుడు అది పురుషునివలె కనిపించినట్లుగానే బ్రహ్మమే అయిన ఆత్మలో మాయచేత జీవుడు అనేది కల్పించబడింది. జీవుని యొక్క నిజస్వరూపం ఆత్మలో తెలుసుకున్నప్పుడు మానవుడు జీవుడుగాదు అనేది అర్ధమై జీవత్వబ్రాంతి తొలగింపబడుతుంది. అలా జీవత్వభ్రాంతి తొలగినవానికి జ్యోతిషం లేదు…

కాబట్టి నేను చెప్పినదేంటంటే: పునర్జన్మ అనేది ’పుట్టినవానికే’ ఉన్నది గానీ నీవు ఇంతకుముందర ఏ పాపము లేదా ఏ పుణ్యమూ చేసుకుని ఉండకపోవచ్చు. ‘ఇదే‘ నీయొక్క మొదటి జన్మ అయి ఉండచ్చు. ఈ విధంగా ఆలోచిస్తే ఎ.సి గదిలో పుట్టిన పాప ఏ పుణ్యమూ చేసుకుని ఉండకపోవచ్చు, అలాగే సామాన్యంగా పుట్టిన పాప ఏ ‘పాపమూ‘ చేసుకుని ఉండకపోవచ్చు. ఈ లోపం అంతా ద్రష్టయొక్క దృష్టిలోపమేగానీ ఈశ్వరసృష్టిలోపం గాదు. అందువల్ల ‘నీవు పాపము చేసావు గాబట్టే ఇలా అనుభవిస్తున్నావు‘ అన్న విషయం శుద్ధహైందవానికి వర్తించదు.

కాబట్టి హిందువులు పాపక్షమాపణ చెప్పగూడదు అలాగే అడగగూడదు. సరే! అడుగుతాను అంటారా? అది మీ ఇష్టం. మీకు జన్మ ఉండి ఉండచ్చు ఉండకపోనూవచ్చు. కానీ ఎప్పుడో ఏ జన్మలోనో చేసిన పాపానికి ఇప్పుడు ఫలితాన్ని అనుభవిస్తున్నాము అని కుమిలిపోయేవారికి జ్యోతిషాన్ని నమ్మి అనుసరించి తమ జీవితానికి ప్రాతిభాసిక సత్యాన్ని ఆపాదించి చూసేవారిపట్ల నాకు ఉన్నది జాలిభావం మాత్రమే!

స్వస్తి….

మీ మాధవ తురుమెళ్ల