దృశ్యం

ఒక్కోసారి ప్రకృతిలో  దృశ్యాన్ని చూసి
అంతరంగం
అద్భుత అచేతనత్వాన్ని పొందుతుంది.
మేనంతా పులకించి
మనసును లయంచేసి
మనిషిని మహర్షిలా మారుస్తుంది….

కవిర్మనీషీ పరిభూస్వయంభూః….

దృశ్యలీనిత నిశ్శబ్దానికి
ఇంక వేరే అర్ధాలేవీ ఉండవు.
అద్వైతభావనలో మునిగిన పెదవులు అరవిందాల్లా విచ్చుకున్నా –
మాటల సీతాకోకల్ని తమపై వాలనివ్వవు
దృశ్యాన్ని కొలవనివ్వవు,

తెలిమబ్బు కిరణం,
పురివిప్పిన నెమలి,
సముద్రంలోంచి ఉదయిస్తున్న సూర్యుడు,
తనని తానర్పించుకుని ప్రియుడి గుండెలపై నమ్మకంగ  –
ఒదిగి గువ్వపిట్టలా నిద్రిస్తున్న అలిసిన ప్రియురాలి మోము,
నిద్రించే పసిపాపన ముసిముసి నవ్వులు,
వసంతంలో చిగురించిన అడవి
అన్నీ దృశ్యాలే!

దృశ్యాన్ని చూసిన –
మహర్షి హృదయంలో
అవ్యక్తభావమేదో
మౌనరాగాలు పలుకుతుంది,
విచ్చుకున్న కన్నుల్లోని కాంతి దృశ్యాన్ని  స్పష్టంగా సృజిస్తూ
నిశ్శబ్దంగా నీరాజనం పడుతుంది.

-మాధవ తురుమెళ్ల