పొలిటికల్ కరపత్రిక


ఎక్కడో
మస్తిష్కంలో మూలలో దాగిన
ఒక మాటకి అందని మౌనానికి-
తిరస్కృత పరిష్వంగానికి
తిమిరనిరంకుశ నిశీధికి
తితీక్షకు, తీతువుపిట్టకు,
హాలాహలానికి హాహాకారానికి
అవినాభావ సంబంధం ఉన్నదని –
ఒక మునికి జ్ఞానోదయమైంది.

వెలిగించండి మెదడుల్లో కాగడాలను
తొలగించండి జ్ఞానేంద్రియ కవాక్షాల కెరటాలను
చల్లండి బతుకువీధుల్లో పాపప్రక్షాళితంగావించే పావనగంగను….

రేపొక మహోదయం కాబోతోంది
అకించనితయై 
అనారోగ్య 
రక్కసి కాటేస్తున్న కన్నపేగును
పసిపాపను పొత్తిళ్లలో ఎత్తుకున్న తల్లి
ముసిముసి నవ్వులు నవ్వబోతోంది….
పూటతిండికి నోచుకోని దౌర్భాగ్యపు ముసలి ఒకతె
రేపు భారతదేశం నాది అని గర్వపుగీతిక పాడబోతోంది.

రోపొక మహోదయం కాబోతోంది.

[రేపు రిపబ్లిక్‍ డే కదా…..!!!!! ]
-మాధవ తురుమెళ్ల 25/1/2013