అద్దంలో
నన్ను నేను చూసుకోవడానికి
పుట్టుకతోటే అలవాటుపడిపోయాను..
చిన్నప్పట్నించీ,
అద్దం నన్ను ప్రతిబింబిస్తూ
నన్ను నాకు చూపిస్తూ ప్రపంచాన్ని కప్పేస్తూ వచ్చింది.
అద్దం మెల్లగా –
కర్ణుడి కవచంలాగా –
నా కళ్లకు డాలుగా మారిపోయింది.
నిరంతరం నన్ను నేను ప్రతిబింబచేసుకుంటూ
నన్ను నేను ప్రేమించుకుంటూ –
నువ్వనే దానివి ఉన్నావనిగానీ,
మూసిన పెదవుల వెనుక శబ్దంచెయ్యని
ఆర్తనాదాలు చేస్తున్నావనిగానీ,
వంటింటికోరల్లో నలిగి మగ్గిపోతున్నావనిగానీ,
ప్రేమకు నోచుకోక దీనంగా అవనతవదనంతో దారిపక్క నిలుచున్నావనిగానీ,
ఏదోఒక రోజు మారకపోతాడా అని –
మోడువారిన సంసారపు మొక్కకు –
సహనం నీరుపోస్తూ నిరీక్షిస్తున్నావనిగానీ,
గమనించలేకపోయాను…
నీవులేని నాడు
నీ సహాయంపొందని నాడు
నా ప్రతిబింబానికి అర్ధంలేదని
నా అద్దం నాకెప్పుడూ చెప్పలేదు
నా కళ్లముందు పరుచుకున్న అద్దం నన్నేచూపిస్తూ
ఆకలితీరిన నా బొజ్జని చూపిస్తూ,
నిన్ని చూపించకుండా నీచే
అందంగా తీరైన నా ఇల్లుని చూపిస్తూ,
అధ్బుతమైన జీతంగా మారిన నా కొలువుని చూపిస్తూ,
అద్దం –
నా జీవితాన్ని చుట్టలా చుట్టుకుని అందమైన అబద్ధంగా మార్చింది.
పసిపిల్లలకి అద్దంచూపించకు ఎత్తుపళ్లువస్తాయంటూ అంటే
మూఢనమ్మకమేమో అని భావించిన నేను
పెరుగుతూ పెరుగుతూ
నా చుట్టూ ఎత్తుగా కట్టుకున్న అద్దపుగోడను చూడలేకపోయాను,
నీవనేదాన్ని
అద్దానికి ఆవల ఉంచానని
గమనించలేకపోయాను.
క్రమక్రమంగా
నీవు నాపై చూపించిన ప్రేమతోనో
నీ చక్కటి మాలిమితోనొ
నీవు కురిపించిన దయార్ద్ర వర్షంతోటొ
నీవు పెట్టిన అన్నంతోటో
నీవు పంచిఇచ్చిన ప్రణయంతోటో
చలించిననేను
నీకు బహుమతి ఇవ్వాలనుకుంటూ,
నా మనసనే పూలసజ్జను అందమైన
ప్రేమపూలతో నింపాలనుకుంటూ
అనుకోకుండా –
అప్పటిదాకా
నా గుండెలో నిండిన బండరాళ్లను
రివ్వున విసిరేసాను
అప్పుడే –
నిన్ను నాకు నిజంగా బహుమతిగా ఇచ్చిన
భగవంతుని దయతో
నా అద్దం, నా జీవితపు అబద్ధం —
భళ్లుమని బద్దలైంది…
ఆరోజు —
అనేకానేకాలుగా చిద్రమైన నా రూపం
పోల్చుకోలేనంత పగిలిపోయింది
నీవే నేనుగా మారిపోయింది
అందాన్నే ప్రతిబింబింపచేయ ప్రారంభించింది.
ఈవేళ –
నా కళ్లముందు నన్ను చూపించే అద్దం లేదు,
నీకూ నాకూ ఎలాంటి అడ్డూ లేదు,
నిన్ను పలకరించాలన్న నా తహతహలో వ్యాపారంలేదు,
నీ చేతిని పట్టుకున్న నా చేతలో స్వార్ధంలేదు,
నిన్నుచూసి ప్రేమగా నవ్విన నా కళ్లలో వ్యభిచారంలేదు.
ప్రియతమా –
నా అద్దం బద్దలై నేను
సిద్ధుడిలా మారాను
సిద్దార్దుడిలా నవ్వాను
ఆనందతాండవం ఆడేందుకు సిద్ధమైన శివునిలా
ఇప్పుడిలా నీ ముందు నిలుచున్నాను….
నీ ప్రేమలో నా జీవితానికి ఆనందగీతం
నిన్ను నాకిచ్చిన భగవంతునికై ధన్యవాదగీతం పాడుతున్నాను.
============= &&&&&&&& ============
No Comments