ఫేస్‍బుక్ స్నేహాలపట్ల మన పూర్వీకుల సలహా: -)

వసుధైవ కుటుంబకం అనేది మొట్టమొదటగా అధర్వణవేదాంతర్గతమైన మహోపనిషత్తు లో కనబడుతుంది. కానీ ఈ ఉపనిషత్తుని ముఖ్యమైన 108 ఉపనిషత్తులలో ఒకటిగా పరిగణించరు. దీన్నే మహానారాయణోపనిషత్తు గా గూడ పిలుస్తారని విన్నాను. ఆ శ్లోకం కింద ఇస్తున్నాను.

ఉదారః పేశలాచారః సర్వాచారానువృత్తిమాన

అన్తఃసఙ్గ-పరిత్యాగీ బహిః సంభారవానివ

అన్తర్వైరాగ్యమాదాయ బహిరాశోన్ముఖేహితః

***అయం బన్ధురయం నేతి గణనా లఘుచేతసాం

ఉదారచరితానాం తు వసుధైవ కుటుంబకం***

భావాభావ వినిర్ముక్తం జరామరణవర్జితం

ప్రశాన్త కలనారభ్యం నీరాగం పదమాశ్రయ

ఏషా బ్రామ్హీ స్థితిః స్వచ్ఛా నిష్కామా విగతామయా

ఆదాయ విహరన్నేవం సంకటేషు న ముహ్యతి

(మహోపనిషత్తు 6.70-73)

అయితే దీనినే ’హితోపదేశం’, ’విక్రమచరితం’ (3.1), ’పంచతంత్రం’, ’చాణక్యనీతి’ అనే ప్రముఖగ్రంధాలలో మరల ఉటంకించబడింది.

హితోపదేశంలోని కధ చాలా బావుంటుంది. దాంట్లోని నీతి ఈ ఫేస్‍బుక్ స్నేహంరోజుల్లో చాలా అవసరం. అందుకని ఆ కధ ఈ కింద ఇస్తున్నాను. ఫేస్‍బుక్ స్నేహాలు చేసేవారందరూ ఈ కధను తెలుసుకుని మన పూర్వీకుల విజ్ఞానం నుండి ఏదైనా హితవు తెలుసుకోగలరని నా ఆకాంక్ష.

[ఈ కింది కధలను నేను ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నాను. సంస్కృతశ్లోకాలు నాకు గుర్తున్నాయి. తెలుగులో కొంచెం అటుఇటుగా రాసాను. తెలుగులో తప్పులు ఉంటే మన్నించగలరు -మాధవ తురుమెళ్ల ]

హితోపదేశం కధ

==========

కధలో కధల పిట్టకధలు గలిగిన హితోపదేశంలో (పంచతంత్రంలో) మనకు వసుధైవ కుటుంబకం అనేది కనబడుతుంది.

చిత్రాంగుడనే లేడి, సుబుద్ధి అనే కాకి స్నేహంగా ఉండేవి. క్షుద్రబుద్ధి అనే నక్క ఆ చిత్రాంగుడనే లేడిని వంచించి అది చనిపోతే తిందామని దానితో స్నేహం చేయాలని చూస్తుంది. చిత్రాంగుడు అమాయకుడైన లేడి అతడు అందరూ మంచివాళ్లే అనుకుంటాడు. అందువల్ల క్షుద్రబుద్ధి మాటలను నమ్మి అతనితో స్నేహానికి ఒప్పుకుంటాడు. అలా ఆ కొత్తగా స్నేహితులైన లేడి నక్క కలిసి నడుచుకుంటూ వెళుతున్నప్పుడు సుబుద్ధి చెట్టుకొమ్మమీదనుండి వాళ్లని చూస్తుంది. ’ఓ చిత్రాంగా! ఈ నీ కొత్తస్నేహితుడెవరు?’ అని అడుగుతుంది. దానికి చిత్రాంగుడు ’ఇతడిపేరు క్షుద్రబుద్ధి ఇతడికి పాపం స్నేహితులు ఎవరూ లేరట! అందుకే నాతో స్నేహంకావాలి అని అడిగితే ఒప్పుకున్నాను’ అంటాడు. దానికి సుబుద్ది ’నీకు ఇతనిగురించి పూర్తిగా తెలుసా? ఈ నక్క క్షుద్రబుద్ధి ఎక్కడినుండి వచ్చిందో? ఏ కారణంగా వచ్చిందో? అసలు ఎందుకు వచ్చిందో? నీతో స్నేహాన్ని ఎందుకు ఆశిస్తోందో నీకు ఏమైనా తెలుస్తోందా? ఎవరితోపడితే వారితో స్నేహం చెయ్యగూడదు ముఖ్యంగా నీవు శాఖాహారివి నీవు చనిపోతే తినాలని నీ వినాశనాన్ని మనసులో కోరుకుంటూ తిరిగే మాంసాహారి, పైగా జిత్తులమారితనానికి పేరున్న జాతికి చెందినది. జాతి నీతులు తెలియకుండా నైజం తెలియకుండా ఎవరి స్నేహాన్ని పడితే వారి స్నేహాన్ని ఒప్పుకుంటే అది ఎప్పుడో నీకు ముప్పు తెప్పిస్తుంది. ” అంటుంది.

తన ప్రాణ స్నేహితుడైన ఆ సుబుద్ధి చెప్పిన మాటలు విన్న చిత్రాంగుడు ’మిత్రమా సుబుద్ధీ! నీవు చెప్పిన మాటలు ఎవరితో స్నేహం చెయ్యాలో చెప్పిన మాటలు నాకు నచ్చాయి. కానీ ఈ క్షుద్రబుద్ధి గూడా మంచివాడే… నేను ఇతడిని నమ్ముతాను’

దానికి సుబుద్ధి తన స్నేహితుడి అతిమంచితనానికి చింతిస్తూ “మిత్రమా! అపరిచితులతో స్నేహాన్ని ఒప్పుకునేటప్పుడు వారిగురించి పూర్తిగా తెలుసుకోవడం వారికి కొంచెం పరీక్షపెట్టడం చాలా అవసరం. నీవు మాట్లాడిన మాటలకు వారు ఎలా స్పందిస్తారో గమనించు, వాళ్ల నైజంనీకు అర్ధమౌతుంది.” అంటుంది.

అదంతా అప్పటిదాకా మౌనంగా వింటున్న క్షుద్రబుద్ధి నక్క ఆ కాకితో అంటుంది ’మిత్రమా! నాది వేరొక నీతి జాతి అని తలచకు. మన పూర్వీకులు చెప్పలేదా ’వసుధైవకుటుంబకం’ అని మనమంతా వేరుగా కనబడ్డా మనదంతా ఒకే కుటుంబం’.

“హా హా ’వసుదైవ కుటుంబం’ అని నీవు అనగానే నీ మాటలని గుడ్డిగా నమ్మెయ్యడానికి నేనేమీ ఆ అమాయకుడైన జరద్గవుడిని కాను. నిన్ను గుడ్డిగా నమ్మి నా స్నేహితుని ప్రాణాలకు ముప్పు తెచ్చుకోనివ్వలేను” అంటుంది.

చిత్రాంగునికి కధలంటే చాలా ఇష్టం అందుకని “ఎవరా జరద్గవుడు ఏమాకధ?” అని కుతూహలంగా అడుగుతాడు.

జరద్గవుని ’గుడ్డిగా నమ్మేసిన’ కధ:

ఒకప్పుడు ఒక పర్వతశిఖరం మీద అనేకమైన గద్దలు నివసిస్తుండేవి. వాటిలో జరద్గవుడు అనే గద్ద చాలా ముసలివాడైపోయి గుడ్డితనం వచ్చేసి కళ్లుకనబడక రెక్కలు ఉడిగిపోయి ఎగరలేని స్థితిలో ఉన్నాడు. అతడి దీనస్థితిని చూసి జాలిపడిన మిగిలిన గద్దలు “నీవు మా పిల్లలను జాగ్రత్తగా చూసుకో మేము వేటకు వెళ్లి వచ్చి నీకుగూడా మా వేటలో భాగం ఇస్తాము” అని అతడితో చెప్పాయి. అప్పట్నించీ జరద్గవుడు మిగిలిన గద్దపిల్లలని జాగ్రత్తగా కాపాడుతూ వస్తున్నాడు.

అలా ఉండగా దీర్ఘకర్ణుడనే పిల్లి ఆ గద్దపిల్లలని తిందామని వస్తుంది. గూటికి కాపలాగా ఎవరూ లేరుగదా అని అనుకున్నపిల్లి అక్కడ కాపలాగా ఉన్న జరద్గవుడిని చూసి ఉలిక్కిపడుతుంది. పారిపోదామని ప్రయత్నించేలోపలే ’ఎవరక్కడ?’ అని జరద్గవుడు అరుస్తాడు. తను ఎదురుగాఉన్నాగూడా ’ఎవరక్కడ’ అంటాడేంటా అని చూసిన పిల్లికి అర్ధమౌతుంది ఈ ముసలిగద్ద జరద్గవుడికి కళ్లు కనబడవు అని!

దాంతో ’ఆహా ఏమి నా అదృష్టం. నేను ఈ ముసలిగుడ్డి గద్దని నమ్మించితే చాలు. ఈ గద్దపిల్లలనన్నింటినీ శుభ్రంగా తినెయ్యచ్చు’ అనుకుని.

’అయ్యా నమస్కారం! నా పేరు దీర్ఘకర్ణుడు. నేనొక శాఖాహారం మాత్రమే భుజించే పిల్లిని’

’పిల్లివా! వెళ్లు వెళ్లు ఇక్కడ నీకేం పని…. నాకు కళ్లు కనబడవనుకుంటున్నావేమోకానీ నా కాళ్లలో ఇంకా బలం ఉంది. నా కాళ్లతో నిన్ను పట్టి నా ముక్కుతో నిన్ను చీల్చి చెండాడగలను”

“అయ్యా! అంత కోపం వద్దు… నేను జాతికి పిల్లినే అయినా చాలా మారిపోయినవాడిని… పైగా మన పూర్వీకులు చెప్పలేదా ’వసుదైవ కుటుంబకం’ మనమంతా ఒకే కుటుంబం అని. నేను ఒక సాధువు చెప్పిన మంచిమాటలు విని ఎంతో మారిపోయాను. ’ఫలమూలాసినౌ దాంతౌ తాపసౌ బ్రహ్మచారిణౌ’ నా ఆరాధ్యదైవమైన శ్రీరామునివలె నేనూ ఫలమూలాలను అసినం (భోజనం) చేసే శుద్ధశాఖాహారిని నన్ను నమ్మండి.”

“సరే మా కులదేవత జటాయువుకు అతి ప్రాణస్నేహితుడైన శ్రీరామచంద్రుని భక్తుడిని అంటున్నావుగాబట్టి నిన్ను నమ్ముతున్నాను. కానీ నీకు ఇక్కడ ఏంపని ఎందుకు వచ్చావు?”

“అయ్యా! మీరు వృద్ధులు అని తెలుసుకుని మీరు చాలా మంచి మాటలు చెబుతారని మీవద్ద ఎంతో ఎక్కువజ్ఞానం ఉన్నదని విని మీ శిష్యునిగా మారి మీవద్ద జ్ఞానబోధపొందుదామని వచ్చాను”

ఆ మాటలకు తృప్తిచెంది, ’అతివినయం ధూర్తలక్షణం’ అని చెప్పిన పూర్వీకుల హితోపదేశం పెడచెవినపెట్టి తనని అతి వినయంగా పొగిడిన దీర్ఘకర్ణుడి మాటలను గుడ్డిగా నమ్మిన జరద్గవుడు తన గొంతు సవరించుకుని, గుడ్డివాడవడం వల్ల ఆ పిల్లి ఏంచేస్తోందో గమనించలేక, జ్ఞానోపదేశం మొదలుపెడతాడు… గుడ్డిగానమ్మి ఆ పిల్లి తనమాటలు వింటోంది అనుకున్నాడు…. కానీ ఆ పిల్లిమాత్రం శుభ్రంగా ఒకదానితర్వాత మరొకటిచొప్పున ఆ అసహాయులైన గద్దపిల్లలనన్నింటినీ పూర్తిగా చంపితినేసి మెల్లగా జారుకుంది. సాయంత్రం అయిన తర్వాత మిగిలిన గద్దలన్నీ తిరిగి వచ్చాయి. బొమికలు మాత్రమే నేలనపడి ఉన్న తమ పిల్లలన్నీ ఆ జరద్గవుడే తినేసాడనుకుని అతడు ’నేను ఏ పాపమూ ఎరుగను’ అని చెప్పినా నమ్మకుండా అతడిని పొడిచి చంపేసాయి.

“అందుకే మిత్రమా ఎవరు చెప్పినా గుడ్డిగా నమ్మి జరద్గవునిలా ప్రాణాలమీదకి తెచ్చుకోకు. జిత్తులమారితనానికి ప్రతీకలైన ఆ నక్కజాతితో నీవు స్నేహంచెయ్యకు నిదానించు… ” అని చెప్పింది సుబుద్ధి.

కానీ చిత్రాంగుడు తన స్నేహితుడు సుబుద్ది మాటలు పెడచెవినబెడతాడు. చివరకు క్శుద్రబుద్ధి పన్నిన వలలో పడి తన ప్రాణాలమీదకి తెచ్చుకుంటాడు. అప్పుడు సుబుద్ధి ఒక ఉపాయంతో చిత్రాంగుడిని విడిపిస్తాడు… అందుకే గుడ్డిగా స్నేహాన్ని చెయ్యగూడదు, ఎవరినీ ’గుడ్డిగా నమ్మగూడదు’ అని తెలుగులో హితవు చెబుతారు. స్వస్తి!….. 🙂