ఒకోసారి మేఘాలు కన్నీళ్లని వర్షిస్తాయి.
ఒకోసారి గుండెలు కాలువల్లో రక్తాన్ని నింపుతాయి.
నిరంతరం పొలాలలో ఆశలను జల్లే రైతులు –
ఒకోసారి తమ కాలేయాలను జల్లుతారు;
ఒకోసారి రాత్రికి పగలు తెలియదు
నిర్వేదంకప్పిన భూమిచాలులో ఒక
దిక్కులేని సీత దాక్కుని ఉందన్న జాడ తెలియదు;

ఒకోసారి మృగానికి తాను మనిషినని తెలియదు
పెట్టిన అన్నం తిన్న కుక్క ప్రకృతివశాత్తూ విశ్వాసం చూపిస్తుంది;
రైతు పెట్టిన అన్నంతిని బతుకుతున్నకుక్కగూడా
ఒకోసారి మనిషిగా మారతాడు, విశ్వాసాన్ని మర్చిపోతాడు.
రైతు మంటల్లోదూకుతుంటే
కాలేయాలను అమ్ముకుంటుంటే
ఉరితాటికి విశ్వాసాన్ని వేలాడేసి ఊగుతుంటే
విషంతాగుతుంటే
ఒకోసారి మనిషి తనకేం పట్టనట్లుగా నడిచిపోతాడు…
జీవితాన్ని అబద్ధంగా మార్చి జీవిస్తూ పోతాడు.

ఒకోసారి ఈ మానవులకు
భూమిని దేవుడెందుకిచ్చాడా అని సందేహం వస్తుంది.

-మాధవ తురుమెళ్ల