నేనెప్పుడూ ఆశావాదిని.  మనిషి అనేవాడు బండరాయి కాదనీ… జననంనుండి మరణందాకా —  ప్రతిక్షణం, ప్రతిగంట, ప్రతిరోజూ — అనుభవాల పరంపరలలో తన జీవితాన్ని పేర్చుకుంటుంటాడనీ భావిస్తాను. మనిషి ఎప్పుడూ తనని తాను బాగుచేసుకునే బాటలో ఉన్నాడని అనుకుంటాను.  అందుకే ఏ వ్యక్తయినా తాను అనుకున్నది అనుకున్నట్లు రాస్తే అతని రాతను నేను పరిశీలిస్తాను. ఎందుకంటే ఆ మనిషి తనేమిటో అనేది సమాజానికి నిర్భయంగా చెబుతున్నాడు. హత్యలు చేసేవాడు, వ్యక్తుల పేర్లు చెప్పి నిందించేవారు తప్పనించి తమ తమ అభిప్రాయాలను చెప్పే వ్యక్తివల్ల సమాజానికి భయంలేదు.  అతనంటే నచ్చనివారు అతన్ని దూరంగా పెట్టే అవకాశం ఉంది. తన మనసులో ఉన్నదాన్ని ‘పరమ ఛండాలపు మురికయినా సరే‘ నిర్భయంగా బైటికి చెప్పేవారిని మనం రాళ్లువేసి కొడితే శిక్షిస్తే – వాళ్లకు పడ్డ శిక్షని చూసి మిగిలినవారు అలాగే ఆలోచిస్తున్నా బైటికిమాత్రం చాలా నయవంచకుల్లా ప్రవర్తిస్తారు… కానీ వారు అగ్నిపర్వతంలాగా తమలో భయంకరమైన అగ్ని దాచుకుంటారు, ఎప్పుడో హటాత్తుగా సమాజంమీదకి కాలసర్పాల్లా విరుచుకు పడతారు, ఎవరో అమాయకపు నిర్భయను కబళిస్తారు.  మన కళ్లముందర ఆడుతున్న పసరికపామును గుర్తుపట్టి జాగ్రత్తపడగలముగానీ, మనం కొడతామని భయపడి ఎక్కడో దూరంగా అడవిలో దాక్కున్న పసరికను ఏం గుర్తుపట్టగలము?  ఎప్పుడో అది ఏ నిర్భయనో కాటేసేదాకా మనకు తెలియదు.. అందుకే  ‘తమలోపాలని తమలోని చీకటి కోణాలని బైటికి చెప్పని ఈ మిధ్యాచారులవల్లే సమాజానికి ఎక్కువ ప్రమాదం‘ అని నేను భావిస్తాను.  సన్నీ లియోన్ అనే అమ్మాయి ఈ దేశాలలో తన అంగాంగాలను ఎక్కడా దాచకుండా చూపిస్తే బొంబాయిలో భారతదేశంలో బ్రహ్మరధం పట్టారు. పూనాలోని గణేశోత్సవానికి విశిష్ట అతిధిగా ఆహ్వానించారు.  కానీ అదే బొంబాయిలో నాలుగు అన్నం మెతుకులు తింటానికి కడుపు ఆకలి తీర్చుకోవడానికి నలుగురు ఆడపిల్లలు కొంచెం బట్టలు వేసుకుని నాట్యం చేస్తుంటే వాళ్ల జీవనబృతిని తీసేసుకున్నారు… దీనివల్ల తేలేదేంటంటే డబ్బున్నవాడికి పలుకుబడి ఉన్నవాడికి భారతదేశంలో ఒక న్యాయం, డబ్బులేనివాడికి సామాన్యుడికి ఇంకొకన్యాయం దొరుకుతుందని…. భారతదేశం మిధ్యాచారులని ఎక్కువ పోషిస్తుందని… అందుకే ‘దేవుడా దేశాన్ని మిధ్యాచారులనుండి రక్షించు‘ అని మాత్రం ప్రార్థన చేయగలను… -మాధవ తురుమెళ్ల