కం. అమ్మా, నీబిడ్డనునే
      నమ్మా! మాటల సొబగుల నిమ్మా! దయజూ
      డమ్మా! కాదన కమ్మా!
      సన్మా ర్గములో నడుపుమ! శారద! వాణీ!

కం. మెచ్చావట బుధ జనులను
      ఇచ్చావట సకల శుభము నిశ్చల మనమున్
      వచ్చావట వాగ్రూపిగ
      తెచ్చావట కీర్తిసుఖము తెలుగుల వాణీ!

కం. వలదని చెప్పిన వినదిక
     కలవరమున పలవరించు కలతల మనసున్
     నిలవదు నీధ్యానములో
     కొలవదు నిను నిరతరంబు కావుము వాణీ!

కం. చూడాలని నీరూపము,
      వేడాలని నిన్నునేను వెయ్యి విధములన్,
     పాడాలని నీ గుణములు,
     యాడాలని నీ ముంగిట! యాశలు తల్లీ!

కం. నాకూ యున్నది గోరిక
      నీకూనొకమారు పూజ నిజముగ జేయన్!
      రాకూడద మాయింటికి!
      చేకూడద మేలు నాకు జేజీ! వాణీ!

ఉ.  వాణివిగా పితామహుని రాణివిగా విభులేలు బాటలో
     వాణివిగాగ లోకముల పద్యములెన్నియొ వేలువేలు పా
     రాణిగ మారెనీకు! మృదుహాసిని చేకొనవమ్మ దాసుడీ
     ప్రాణములున్న మాధవుని ప్రార్థన వేల్పులవాణి భారతీ |

                                                                   – మాధవ తురుమెళ్ల 24th April 20112