నా ఆలోచన: వాచారంభణమ్ వికారొ నామధేయం, మృత్తికేత్యేవ సత్యం|

Monday, June 23rd, 2014 @ 8:26PM

“వాచారంభణమ్ వికారొ నామధేయం, మృత్తికేత్యేవ సత్యం|” – చాందోగ్యోపనిషత్తు 6.1.4

ఆలోచన:- కుండ అని మనం అంటాము కానీ అది నిజానికి కుండా? మట్టి మాత్రమే… మరి దానిని చూడగానే ’కుండ’ అని మనకు ఎలా తెలుస్తోంది?! ఎందుకంటే కన్ను రెండు కిరణాలను ప్రసరింపజేస్తోంది. ఒకటి బయటి వైపు రెండోది మనసులోనికి… బయట కనబడిన ఆకారాన్ని తాకిన చైతన్య కిరణం ’మట్టి’ అని సమాచారాన్ని వెనక్కు తీసుకువస్తోంది… కానీ అదే క్షణంలో మనసులోపలి పొరలను తాకిన ఒక కిరణం ’కుండ’ అనే పదాన్ని బయటకు మోసుకువస్తోంది… ఈ రెండిటి సంయోగంలో మట్టి కుండగా మారింది… బయటి మట్టి ఎల్లప్పుడూ మట్టే కానీ మనసులోనే మాయంతా దాగి ఉంది.

ఒక వ్యక్తిని చూడగానే ’మానవుడు’ అని అతడిని తాకిన కిరణం ’సత్యంగా’ చెబుతోంటే, మనసులోని పొరలను తాకిన కిరణం అతడు ’రెడ్డి, కమ్మ, బ్రాహ్మణ, అతడు నలుపు, తెలుపు, అతడు క్రిష్టియన్, కాదు సద్బ్రాహ్మణుడు, కాదు కాదు ముస్లిం’ వంటి ఏదో వికారాలను కల్పించి వాక్కుకు వంకరటింకరతనాన్ని తెస్తోంది.

కాబట్టి నిజమైన సాధన ఏంటంటే ఏది కనబడుతోందో దాని సత్యాన్ని తత్వతః (ఉన్నదున్నట్లుగా) గ్రహించగలగడం. నిజానికి అక్కడ కుండలేదు అందులో ఏ మట్టిఅయితే ఉందో అదే మట్టి చూసే వ్యక్తిలోనూ ఉంది… కాదంటారా?! కొంతమట్టి కుండగా మారితే మరికొంతమట్టి మనిషిగా మారింది – అంతే తేడా!

ఉదాహరణకు చూద్దాము – ఒక వ్యక్తి వంకాయలు, ఉల్లిపాయలు శుభ్రంగా కూరచేసుకుని వరిఅన్నంలో నంజుకుని తిన్నాడు అనుకోండి. ఈ అధరువులన్నింటినీ అతడు ఎక్కడనుండి సేకరిస్తున్నాడు. వంకాయ మొక్క ’మట్టి’ లోనుండి మొలచినదేగదా? అలాగే ఉల్లిపాయగూడా ’మట్టి’ లోని గడ్డేగదా?! అలాగే వరిగింజల మొక్కలుగూడా ’మట్టే’ గదా?! మరి అదే మట్టిలోనుండి పుట్టిన మూడు మొక్కలు ఒకటి వంకాయగా, ఒకటి ఉల్లిపాయగా, ఒకటి వరి మొక్కగా రూపాంతరం చెందినట్లేగదా? ఇంకా చూస్తే – మరి వాటిని తిన్నమనిషి ఎవరు? వంకాయకూర తిన్నాననుకుని భ్రమపడుతున్నాడు కానీ తినేది మట్టే గదా! అందుకే గౌడపాదాచార్యులవారు ’దృశ్యద్వాద్ అసత్యం’ – చూస్తున్నావు కాబట్టే అసత్యం అని మాండూక్యకారికలో నిర్ణయంగా చెబుతారు.

ఈ ఉదాహరణనే ఇంకా కొంచెం వివరంగా చూద్దాము.. వంకాయ, ఉల్లిపాయ, వరి మూడూ మట్టినుండి వచ్చినవేగదా! అంటే రూపంతరం చెందింది సత్యంగా ’మట్టే’ గదా?! అటువంటి మట్టిని – భోజనం అనుకుని బ్రమలో ఆబగా – తిని తిరిగి పెరిగిన మానవుడు గూడా నిజానికి ’మట్టే’ గదా?! అంటే ఏ మట్టి తత్వం వంకాయలో ఉందో అదే మనిషి శరీరంలోకి ప్రవేశించినప్పుడు – అతడుగూడా మట్టే గదా! ఆలోచించండి….

సత్యం ఏంటంటే – మనంచూస్తున్న కుండమాత్రమేగాదు మనం గూడా మృత్తికామాత్రమేవచ – మట్టే!

ఇంకొంచెం లోతుగా పరిశీలన చేద్దాము… ఒక తల్లి, ఒక తండ్రి ఈ వంకాయకూర వరి అన్నం తింటూ జీవిస్తున్నారు. వారి కలయికలో వారికి ఒక బిడ్డపుట్టాడు. ఆ తల్లి ఒక విధంగా ప్రవర్తిస్తుంది, ఆ తండ్రి వేరొకవిధంగా ప్రవర్తిస్తాడు, వారికి పుట్టిన ఆ బిడ్డ ఇంకోవిధంగా ప్రవర్తిస్తాడు. అందరూ తినేది మట్టినే! ఒకే మట్టి తిని తిరిగే వ్యక్తులు ఒక్కొక్కరూ ఒక్కోవిధంగా ఆలోచిస్తారు… అంటే కనబడే సమష్టిలోనేదిదేదో వ్యష్టిలో ప్రత్యేకంగా చేరింది…. దీన్నే సృష్టి అంటారు!

ఉన్నది ఒక్కటే రూపం – మట్టిరూపం – కానీ ఒక్కటే మృత్తిక ఒకటే మట్టి అనేక కుండలుగా మారి మనను భ్రమింపజేసినట్లుగానే ఒక్కటే మట్టి అనేక రూపాలుగా మారి మనలను భ్రమింపజేస్తోంది. ఇదే విష్ణుమాయ! సత్యాన్ని మరల తలచుకుందాము… “మనమందరమూ సత్యంగా మట్టిరూపములము”…. మనలో ఏ మట్టి ఉందో అదే మట్టి ప్రకృతిలోనూ మనకు కనబడుతోంది… చెట్లుగా, పుట్టలుగా, పశువులుగా, పక్షులుగా భిన్నభిన్నరూపాలుగా కనబడుతోంది! అందుకే చిన్నికృష్ణుడు మట్టితిని ’హా ఏదీ నోరుతెరు’ అని ప్రేమగా గద్దించి అదిలించిన తన తల్లి యశోదమ్మకు తన చిన్ని నోటిని తెరిచి పదునాల్గు భువనభాండాలను చూపించగలిగిన విష్ణుమాయ ను తెలుసుకోవడం మనందరికీ అత్యావశ్యకం. ఆలోచించండి…

సరే ఇక ఇప్పుడు ’మనకు కనబడేదంతా’ మట్టి మాత్రమే కానీ మనసులో ఉన్న భ్రమవల్ల ఒక్కోదాన్నీ ఒక్కోవిధంగా చూస్తున్నాము అని తెలుసుకున్న తర్వాత మన ఆలోచనలో ఇంకొక మెట్టు లోతుకు దిగి అసలు ఈ తెలుసుకునేది ఎవరు? అనే ప్రశ్న వేసుకోవాలి. దీన్నే రమణమహర్షివారు ’నేను ఎవరు’ అనే ప్రశ్న వేసుకొమ్మన్నారు. అంటే బయట ఉన్న కుండను చూడాలి అంటే ఆ కుండను చూసి గుర్తించగలిగిన సత్తా ఉన్న ’నేను’ అనెది ఒకటి ముందర ఉండాలి. నేను ఉన్నప్పుడే నేను చూసే సృష్టి ఉంటుంది.

బయట ఉన్న మట్టి తత్వం ఒక్కటే అయినప్పుడు లోపల ఉన్న ’నేను’ తత్వంగూడా ఒకటే అయి ఉండాలి. కానీ అది అలా ఉండదు. విచిత్రంగా నా ప్రక్కనే ఉన్న వ్యక్తిలో ఉన్న నేను నాలో ఉన్న నేనుకు భిన్నంగా ఉంటుంది… అంటే అతడు ఒక విధంగా నేను ఇంకొకవిధంగా ప్రవర్తిస్తాము. ఒకే రాజకుటుంబంలో పుట్టి ఒకటే భోజనశాలలో భోజనంచేస్తూ పెరిగిన కౌరవులు ఒకవిధంగా పాండవులు ఇంకోవిధంగా ఆలోచించారు.
అందుకే ఈ ’నేను’ అనేది ’సంస్కారస్తు ప్రవర్తతే ’ అన్నారు. అంటే సంస్కారాన్ని బట్టి ’నేను’ అనేది ప్రవర్తిస్తుంది. ఈ ’నేను’ కి ఒక పేరు ఉంటుంది. ఉదాహరణకు ఈ శరీరానికి ’మాధవ’ అనే ఒక పేరుంది. ఆ పేరు లేకుండా ’మాధవ’ గురించి ఆలోచించండి! ఆలోచించలేరు… ఎందుకంటే పేరు తొలగిననాడు ఈ శరీరం మిగిలిన శరీరాలలోనున్న మట్టి తత్వానికి భిన్నంగాదు.

ఇలా దీర్ఘంగా ఆలోచిస్తూ ధ్యానమార్గంలో తదేకంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తే మనకు చివరకు శుద్ధ చైతన్యస్వరూప స్ఫురణ వస్తుంది. “ఉన్నది చైతన్యమే! నేను బ్రతికి ఉన్నానుగాబట్టే ’చైతన్యం’ తో ఉన్నానుగాబట్టే కుండను బట్టుకుని కుండ అంటున్నాను. ” అనే విజ్ఞానం వస్తుంది…

’అడవిలో చెట్టు విరిగిపడింది – అది శబ్దం చేసిందా చెయ్యలేదా?’ అన్న ప్రశ్న వేసుకున్నారనుకోండి మీరు అక్కడ లేరుగాబట్టి అది శబ్ధం చేసిందో లేదో మీకు తెలియదు. మీరు అక్కడ ఉంటే మీకు తెలుస్తుంది… అంటే ’మీరు’ మీ ’చైతన్యము’ ప్రసరించినప్పుడే విషయానికి వ్యావహారిక సత్తా వస్తోంది. ఈ చైతన్య ప్రసరణయొక్క సత్యాన్ని మన పూర్వీకులు ఏనాడో వేదాలలో చర్చించారు. దీన్నే విపులంగా మనముందర గౌడపాదాచార్యులవారు ప్రతిపాదించారు.

ఇంకా చెప్పాలంటే ఈ సత్యాన్నే సైన్సువారు క్వాంటమ్ ఫిజిక్స్ లో ’ష్రోడింగర్స్ కాట్ ఎక్పరిమెంటు’ అని ఒకటి చేసి నిర్ణయించారు. ఒక పెట్టెలో పిల్లిని పెట్టి మూతవేసారనుకోండి… ఆ పిల్లి ఆ పెట్టెలో ఉన్నట్లా లేనట్లా అని ప్రశ్నిస్తే – మీరు చూసినప్పుడు అది ఉంటుంది, మీరు చూడనప్పుడు అది లేదు. అంటే పెట్టెలో పెట్టిన పిల్లి ఉండీ లేని స్థితిలో ఉంటుంది… అన్నారు.

సైన్సువారు దేన్నైతే ’మాయపిల్లి’ అన్నారో అదే సత్యాన్ని మనఋషులు ఏనాడో మాయా ప్రతిపాదనగా చెబుతూ ’అఘటిత ఘటనా పటీయసీ’ ఏది లేదో అది ఉన్నట్లుగా భ్రమింపజేసేది మాయ అన్నారు. మనకు కనిపించేదంతా మాయ! ఈ జగత్తులో ఉన్నది ఒక్కటే ’శుద్ధ చైతన్యం’ సరిగా ఆలోచిస్తే మట్టిగూడాలేదు! మీకూ నాకూ వ్యత్యాసమే లేదు.. అంతా ఒక్కటే ’ఏకం సత్ విప్రాః బహుధా వదంతి’.

మరి మమత ఏమిటి? అదిగూడా హుళక్కే!

ఉదాహరణకు ఒక వ్యక్తిలో ప్రేమలో పడతాము… అనుకోకుండా ఆ వ్యక్తి చనిపోతాడు… కుండ బద్దలైపోతుంది… శరీరం అగ్నికి ఆహుతైపోతుంది… కానీ మనసులోపలి పొరల్లో ఎక్కడో దాక్కుని ఉన్న ఆ వ్యక్తియొక్క కిరణాలు అద్దంలాగా ప్రతిబింబించబడతాయి… ఒకప్పుడులేకుండా మధ్యలో పుట్టి తిరిగి లేకుండా పోయిన ఏదో ఒక కాంతికిరణం మనసులోపలిపొరల్లో మాయగా కప్పి ప్రేమగా మారి పిచ్చితనంగా ఏడిపిస్తుంది… అందుకే ’వాచారంభణం వికారో నామధేయాని మృత్తికెవ సత్యం’…

“జగమే మాయ బ్రతుకే మాయ వేదాలలో సారమింతేనయా
కలిమీలేములు కష్టసుఖాలు కావడిలో కుండలనీ భయమేలోయి
కావడి కొయ్యేనోయ్ కుండలు మన్నేనోయ్ కనుగొంటే సత్యమింతేనోయి ఈ వింతేనోయి”    అంటూ ఆ సినిమాపాటలో రాసింది నిజంగా నిజం..

ఘటకుడ్యాదికం సర్వం మృత్తికామాత్రమేవచ
అనేన వేద్యం సచ్చాస్త్రం ఇతివేదాంత డిండిమః ||

ఓం తత్ సత్! -మీ మాధవ తురుమెళ్ల

Posted by
Categories: Hinduism, వేదాంతము, సుభాషితం
Tags:

No comments yet. Be the first!
Leave a Reply