కవిత: నిజంగా నన్నింకా భ్రతకమంటావా?

Sunday, May 3rd, 2015 @ 7:46AM

kavita_aasa

 

నన్నింకా బ్రతకమంటావా
నిజంగా నన్నింకా భ్రతకమంటావా?

చిక్కని ఈ జనారణ్యంలో –
మమతల నాటకాన్ని అర్ధంచేసుకోలేక
మనుషుల కఠినత్వాన్ని, మూర్ఖత్వాన్ని జీర్ణించుకోలేక
అలాగని నా దారిన నేను పోలేక –
మతితప్పి మనసుపోగొట్టుకుని భ్రమిస్తున్నవాడిని…

ప్రభూ –
నాకు ఒక అస్తిత్వంలేదు….
అబద్ధపు చట్రంలో అస్తవ్యస్త వ్యవస్థలో
ఎందుకో బలవంతంగా
నన్ను నేను ఇరికించుకున్నవాడిని.

గాయపడిన గొంతుగలవాడిని, దీనుడిని
ఇంకా ఏ శృతిని ఆలపించమని
ఈ దీనుడిని ఆజ్ఞాపిస్తున్నావు ప్రభూ?

నా బాధను రాయాలన్నా –
కత్తులూ, నెత్తుర్లూ,
కాన్పులూ, భీభత్సాలు,
భయానకపు బాకుల
వంటి హాహాకార చిత్రాలతో –
అమాయకపు పసిపాపలవంటి
నా అక్షరాలను –
తుఛ్ఛపు ప్రపంచం ఇచ్చే
ప్రాముఖ్యతకోసంగూడా భయపెట్టలేని
సున్నిత మనస్కుడిని….
ఎవరికీ ఉపయోగపడలేని పిరికివాడిని…
నేను ఎందుకూ పనికిరాని మంచివాడిని…

ప్రభూ, అయినాసరే –
ఈ దారి చాలు…
నేను ఆలపించే ప్రార్ధనా గీతాన్ని విని
నీవు అందిస్తున్న సహాయం చాలు…
నీ నీడనుగూడా అందుకోలేని
అర్హతలేని ఈ దౌర్భాగ్యునికి
నిరంతరం నన్నలముకున్న
విషాదమేఘాలను చొచ్చుకుని
నీవున్నావని నిరూపిస్తూ
అప్పుడప్పుడూ నను ఆహ్లాదపరిచే
ఆ ప్రేమ కిరణాలు ప్రసరించే క్షణికాలు చాలు.

శిధిలమైన జీవన చరమాంకంలో
నా కనురెప్పల తెరలు –
శాశ్వతంగా దించివేయబడే క్షణంలోనైనా సరే!
నీ దర్శనభాగ్యాన్ని ప్రసాదిస్తావని,
దీనుడిని నా ఈ మొరను ఆలకిస్తావని..
ఆశపడమంటావా ప్రభూ?!
నిజంగా నన్నింకా భ్రతకమంటావా?

-మాధవ తురుమెళ్ళ

 

Posted by
Categories: కవితలు

No comments yet. Be the first!
Leave a Reply