నేనో….
నేనొక చిన్న విత్తనాన్ని…
నా హృదయం నిండా నిగూఢమైవున్న పచ్చటి ప్రేమ…

ఎవరికీ తెలియనిదాన్ని, నా అస్తిత్వంగురించి నాకే అర్ధమవనిదాన్ని…
దారిపక్కనే పడివున్నదాన్ని, పిచ్చిదాన్ని…

నీవో….
నీవొక బాటసారివి…
కావడి కుండలను మోసేవాడివి, బ్రతుకు భారంతో వంగినవాడివి…
అయినా నా వరకు నీవు గొప్పవాడివి
నాపై దయార్ద్ర వర్షాన్ని చిలకరించి, చిగురింపజేసే శక్తి గలవాడివి
నీవే నాకు భగవంతుడితో సమానుడివి…

ప్రతిదినం నాకొక నిరీక్షణ
నీ అడుగుల సవ్వడి కోసం
నీవుమోసే కావడికోసం ఆ కావడినుండి చిందే రెండు నీటి బిందువులకోసం..
నాలో ఒక నిరీక్షణ..

*****

అప్పుడెపుడో
ఒకరోజు నీ ఊపిరిసోకి నీ పాదాలుతాకి
నే పచ్చగా చిగురించాను
ప్రేమగా పుష్పించాను….. నన్ను చూడమని నా దగ్గరకు రమ్మని తలవూపుతూ నిన్ను ప్రేమగా ఆహ్వానించాను.

నాపై ఎంత దయదలిచావు ప్రభూ
నీవు నన్ను మొదటిసారిగా గమనించినవేళ
నీ నిరంతర జీవన గమనంలో ఒక్కక్షణం నాకై ఆగి నను చూసి ప్రేమగా పలకరించినవేళ
నా అస్తిత్వాన్ని నే తెలుసుకున్నాను…

నాకీ భాగ్యం చాలు ప్రభూ
నీవు ప్రపంచానికి సామాన్యునివేమో గానీ నాకు మాత్రం నా భగవంతునివి…
నా జీవితంపై ఎంతటి ఆహ్లాదాన్ని చిలకరించావు…
అది చాలు నాకు … నీ ప్రేమ చాలు నా ఈ జీవనానికి…

ప్రభూ,
నే చిగురించని వేళ నా ప్రేమపుష్పాన్ని నీ కందించని వేళ
నిను చూసిన ఆహ్లాదాన్ని నే వ్యక్తీకరించని వేళ
నా గురించి ఆందోళనతో బాధతో కృంగిపోయే నీవు
అతీతమైన ప్రకృతిని అంతం చెయ్యకంటూ నీ భగవంతుని ఆర్తితో ప్రార్ధిస్తావు నీవు,

నీలో అంతర్లీనమైన నా పట్ల ప్రేమను చూసి
నీ జీవితంలో నా జీవితం కలిసిపోయిందని తెలిసి
నీ ప్రేమకు ఆహ్లాదంగా తలవూపుతూ… తృప్తిగా..
నా జీవనం నీవుండడం వల్ల ధన్యమైందని బావిస్తూ..
నీ అస్తిత్వంలో నా అస్తిత్వాన్ని వెదుక్కొనే నేను

ప్రభూ,
మనది ఒక అందమైన ఆహ్లాదభరితమైన ప్రేమ….
అదృష్ట దురదృష్టాల మేలు కలయిక ఈ జీవనంలో
నీవూ నేనూ పరస్పరం ఆశ్రితులం…

— మాధవ్ (1990)
———- ఽఽఽఽఽఽఽ ———-