సనాతన హిందూ ధర్మము – బహుభార్యత్వము – పునర్వివాహము – ఒక ఆలోచన

రచన: మాధవ తురుమెళ్ల, వ్యవస్థాపకులు, రాజబోధ హిందూ మేధోమధన శిక్షణా సంస్థ

శ్రీరాముని తండ్రి దశరధమహరాజు గారికి ముగ్గురు భార్యలు. శ్రీరాముడు ఏకపత్నీవ్రతుడైనా ఆయన తర్వాతి అవతారంగా వచ్చిన శ్రీకృష్ణులవారికి ఎనిమిదిమంది పట్టమహిషులు. శ్రీమహావిష్ణువుకు శ్రీదేవి భూదేవి ఇద్దరు భార్యలు. శివునికి మొదటి భార్య సతి ఆవిడ తర్వాత పార్వతిని ఆయన పునర్వివాహమాడారు. మరి హిందూదేవుళ్లకే పునర్వివాహమా అని అంటే ఋషులు మహర్షులు గూడా బహుభార్యత్వం అవలంబించారు. శుక్లయజుర్వేద ద్రష్ట మరియు బృహదారణ్యక ఉపనిషత్తు ద్వారా సనాతన ధర్మంలో నిబిడీకృతమైన అజరామరత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన యాజ్ఞవల్క్య మహర్షివారికి మైత్రేయి కాత్యాయని అన్ ఇద్దరు భార్యలు. ఇలా చూస్తూపోతే ఈ బహుభార్యత్వాన్ని హిందువులు దాదాపు స్వతంత్య్రం వచ్చే ముందరవరకు పాటించినట్లు కనిపిస్తోంది. దాదాపు 1940 వరకు బహుభార్యత్వం అమలులో ఉన్నది. మరి హిందువులను అనుకోకుండా ఏకపత్నీవ్రతులుగా ’చట్టబద్ధం’గా మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అని ఒక ప్రశ్న వేసుకోక తప్పదు. ఇది నిస్సందేహంగా కామపూరితమైన కోరికను స్త్రీపురుషుల శృంగారపరమైన కలయికను ’మొట్టమొదటి పాపం’ Original Sin గా పరిగణించే మతస్థులవారు బలవంతంగా హిందువుల నెత్తిన రుద్దిన రాజశాసనంగా అనిపిస్తుంది. ఈ ఆలోచన పునర్వివాహం తప్పా ఒప్పా అని గాదు. హిందువులనెత్తిన Legistlative గా రాజశాసనంగా దీనిని ఎందుకు తెచ్చినట్లు అని ప్రశ్న.

****

ఋగ్వేదంలో ’భార్య’ అని ఏకవచనం చాలా తక్కువ ’భార్యలు’ అనేది ఎక్కువగా కనబడుతుంది. బహుభార్యత్వం అనేది ఒకప్పుడు చాలా సాధారణంగా ఉండేది. పైగా ఆ భార్యలమధ్య అసూయగూడా ఉండేది. సపత్నీబధ్నం అని ఋగ్వేదంలో ఒక సూక్తం ఉన్నది [ఋగ్వేదం 10-145] అందులో తన సవతి దగ్గరకి తన భర్త వెళ్లకుండా తన దగ్గరే ఎక్కువ ఉండేటట్లుగా విశ్వేదేవతల ప్రార్థన ఉన్నది. తన భర్త ఇంట్లో ఉండకుండా వేరే ఆడవారి వెంట పడుతుంటే ఈ సూక్తంతో హవనం చేసి భర్తని భార్య కట్టడి (వశీకరణం) చేసే పద్ధతి నేను ఎరుగుదును…

ఇకపోతే హైందవ వివాహంలో ఈ క్రింది మంత్రం చాలా ముఖ్యం:
“అఘోరచక్షురపతిఘ్న్యోధి శివా పశుభ్యః సుమనాః సువర్చాః| వీరసూర్దేవకామా స్యోనా శం నో భవ ద్విపదే శం చతుష్పదే |” ఋగ్వేదము 10-85-44

ఈ పై మంత్రాన్ని ఇప్పటికీ పెళ్లి సమయంలో తెరసెల్లా తీసేటప్పుడు చదువుతారు.

నాకు బోధపడినంతవరకు ఈ మంత్రార్థం:- దుష్టతలేని కనులతో [నీ భర్తని చూస్తూ], భర్తని చంపనిదానివిగా ‘అపతిఘ్ని’ [మెలిగి] , మంచి మనస్సుతో మంచి వర్చస్సుతో [నీ మెట్టినింటికి] శుభాలను తీసుకురామ్మా| అలాగే [నీవు ఈ ఇంట్లో ఉన్నందువల్ల దొరికే] దేవతల ప్రేమను పొంది, హాయిగా ఉంటూ తల్లివిగామారి మహా వీరులకు జన్మనివ్వు, మా పశువులకు (నాలుగుకాళ్లమీద నడుచు చతుష్పదములు) అలాగే మా మనుష్యులకు [రెండుకాళ్లమీద నడిచే ద్విపదులు – బంధుమిత్రాదులు] శుభాన్ని తీసుకురా…

దశరధమహారాజుభార్య కైక ’పతిఘ్ని’ అని ఒక వ్యాఖ్యానంలో చదివాను. ’ఓ కైకా! రాముడు అడివికిపోతే నేను గుండెపగిలి చనిపోతాను’ అంటే ’నాకదంతా అనవసరం రాముడు అడవికి పోవాల్సిందే’ అన్నది. పాపం దశరధమహారాజు నిజంగానే రాముడు వెళ్లిన తర్వాత గుండెపగిలి చనిపోయారు.

అంటే దీనివల్ల మనకి తెలిసేదేంటంటే స్త్రీ తలచుకుంటే సంసారాన్ని నాశనం చేయగలదు తన భర్తని చంపగలదు, [ఆవిడకి ఆ అధికారం ఉన్నది] అలాగే శుభంగా నిలబెట్టనూగలదు. దేవతలు కులస్త్రీ పూజించబడే చోట మాత్రమే దేవతలు ఉంటారు. కాబట్టే ఇంటి ఇల్లాలి విషయంలో జాగ్రత్తగా ఉండమని అందరికీ పెద్దలు ఇచ్చే సలహా….

****

మన పురాణాల్లో అనేకమైన కధలు అలా భర్తను అర్థాంతరంగా వదిలి వెళ్లిన భార్యల కధలు.

శ్రీలక్ష్మి అమ్మవారు వైకుంఠం వదిలి వెళ్లిపోలేదా?! శ్రీమహావిష్ణువు పిచ్చివాడిలా మారలేదా?! మనం ప్రతిరోజు కొలుచుకునే మన ఆరాధ్యదైవం ఆ ఏడుకొండలవాని చరిత్రేగదా! అలాగే ’పిలవని పేరంటానికి వెళ్లద్దు సతీ! అని అనునయంగా చెబితే వినకుండా వెళ్లి…. పైగా ఇలా అర్ధాంతరంగా తనువు చాలిస్తే నన్ను ప్రేమించే భర్త ఏమైపోతాడో అనేదిగూడా ఆలోచించకుండా పుట్టింట్లో అవమానం అయిందని సతీదేవి తన శరీరాన్ని తగలబెట్టుకున్నది’ ఆవిడ పోయింతర్వాతా ఆయన బోలాశంకరుడు పిచ్చివాడైపోయాడు పిచ్చిపట్టి చనిపోయిన తన భార్య శరీరాన్ని తీసుకుని భుజంపైన వేసుకుని లోకాలన్నీ తిరిగాడు…

అలాగే ఋగ్వేదంలో ఊర్వశి నిర్దాక్షిణ్యంగా వదిలి వెళ్లిపోతే అతడు ఏడుస్తూ ’ఆడవారితో శాశ్వతస్నేహాన్ని ఆశించగూడదు [అంత తెలివితక్కువపని ఇంకొకటిలేదు] ఆడవారి గుండెలు [బొమికలనిగూడ మిగలకుండా బొందిని కొరికి తినగల] దుమ్ములగొండి గుండెలు’ అని చెప్పలేదా?! [ఋగ్వేదం 10-95-15]

ఆడవారికి ఒకప్పుడు హైందవదేశంలో అంత స్వాతంత్య్రం ఉండేది.
*****

హైందవ ఆచారాలలో ముఖ్యంగా కర్మకాండలయందు ఆసక్తి ఉన్నవారు తెలుసుకోవాల్సిన విషయం. సప్తర్షులలో వివాహంలో భార్యకు అత్యున్నతమైన స్థానం ఉన్నది. ఆవిడ పక్కన లేకపోతే అతడు ‘విథురుడు‘గా మారతాడు. అందుకే ఎన్ని కష్టాలు సహించైనా సరే ఎంత గయ్యాళి భార్య అయినా సరే ఒకప్పుడు ఓర్పుతో భరించి ఉండేవారు. దక్షసావర్ణికమనువు కాలంలో సప్తర్షులలో ఒకడైన సవనుని భార్య కాళి ఆవిడ ఆయనను రాచిరంపాన పెట్టేది, కట్టెపుల్లలతో కొట్టేది అయినా ఆయన ఆవిడ పెట్టే కష్టాలు అన్నీ భరించేవాడు. అంత గయ్యాళి భార్యను ఎందుకుభరించుతావయ్యా అంటే ’భార్య మరణించినా లేదా భార్య విడాకులు ఇచ్చేసినా మరుక్షణం ఆ వ్యక్తి యజ్ఞయాగాదులను నిత్యార్చనలను నిర్వహించే అర్హత కోల్పోతాడు, కాబట్టి క్రతువులయందు నమ్మకం ఉన్న వారు తమ భార్యలను ఎట్టిపరిస్థితులలోనూ తృప్తిగా ఉంచాలనే చూడాలి’ అన్నాడు. ‘యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా‘ (ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడే దేవతలు ఉంటారు) అని మనువు చెప్పినదానికి ఇది ఒక అర్థం.

అంటే ఇంటి ఇల్లాలు సంతోషంగా లేనప్పుడు ఆ ఇంటి యజమాని దేవతార్చన అర్హతను కోల్పోతాడు. దేవతలు ఆ ఇంటి మొహంగూడా చూడరు. ఈ నియమం ఎవరికైనా సరే తప్పదు. అందుకే భార్య ప్రక్కన లేనందువల్ల శ్రీరామచంద్రుడు ‘స్వర్ణసీత‘ని పక్కన పెట్టుకుని యజ్ఞార్హతను పొందాడు. ఒకప్పుడు ‘విధురత్వం‘ (భార్య చనిపోవడం), ‘ఘటశ్రార్ధత్వం‘ (భార్య కోరినందునో లేక తన కోరికవల్లనో విడాకులివ్వడం) అనేవాటిని చాలా ఘోరమైన నరకబాధలుగా వర్ణించారు. వీటినుండి తప్పించుకోవడానికి తిరిగి వెంఠనే యజ్ఞార్హత, దేవతార్చన అర్హత సంపాదిందుకోవడానికి భార్య చనిపోయిన వెంఠనే రెండవపెళ్లికి పూనుకునేవారు. కాబట్టి కొంతమంది కర్మిష్ఠులు పునర్వివాహం చేసుకున్నారంటే వారి చేష్ఠవెనుక కామపూరితమైన వాసనకంటే దేవతార్చనార్హతపట్ల ఆసక్తే ఎక్కువ ఉండచ్చు… కన్యాశుల్కం నాటకంలో చాలా ముసలి వ్యక్తి మళ్లీ పెళ్లికి సిధ్ధపడతాడు అందరూ అతడిని ఈ వయసులో నీకు పెళ్లెందుకు అని తిడతారు కానీ నిజానికి అతడు ఆ పెళ్లి చేసుకోకుంటే యజ్ఞయాగాదులు చెసుకునే అర్హత కోల్పోతాడు అదే అతడి భయం అనుకోవచ్చు…
ఇకపోతే నేను పైదంతా రాసిన ఉద్దేశ్యం ’దేవతార్చన పేరుతో’ పది పెళ్లిల్లు చేసుకోమనిగాదు. మనకి నాలుగు ఆశ్రమాలు. గృహస్థాశ్రమధర్మంలోనే దేవతార్చన జపహోమాదులు అనుష్ఠానాదులు ఉన్నాయి. భార్య విడిచి వెళ్లిపోతే ఆ గృహస్థు పని గోవిందా…. కాబట్టి అతడి ఎదుట రెండే మార్గాలు (1) వేరే పెళ్లి చేసుకోవడం (2) సంసారంలోని అనిత్యతని గుర్తించి అగ్నిక్రియలను త్యజించి తన పిండాన్ని తాను పెట్టుకుని సన్యసించడం.

కానీ అతనికి వెళ్లిపోయిన భార్యవల్ల పిల్లలుండేటట్లయితే అతను సన్యాసానికి అర్హుడుకాదు. అందువల్ల అతని మార్గం గృహస్థమార్గమే!

****

నాకు తెలిసినంతవరకు భార్యాభర్తలు విడిపోయిన దృష్టాంతాలు చాలా ఉన్నాయి. విడాకులు అనేది లేకపోతే ఆ పదమే వచ్చి ఉండేది కాదు. హైందవధర్మంలో నచ్చని పరిస్థితుల్లో భార్య భర్తను వదిలి వెళ్లవచ్చు. కానీ భర్తకు మాత్రం భార్యను వదిలివెళ్లే అవకాశం ఇవ్వలేదు. కానీ అతనికి బహుభార్యత్వం అనేకమంది భార్యలు కలిగిఉండే అవకాశం ఇచ్చారు. అందువల్ల నచ్చకపోతే భర్త ఆ భార్యను దూరంగా ఉంచుతాడు కానీ పోషిస్తాడు ఇంకొక పెళ్లి చేసుకుంటాడు. కానీ ఆ భర్త నచ్చకపోతే అతన్ని వదిలి వేరేపెళ్లి చేసుకునే అవకాశం ఆవిడకు ఎప్పుడూ ఉంది.

స్త్రీకి హైందవమతంలో సంపూర్ణస్వాతంత్య్రం ఉంది. సీతమ్మవారే రాముడిని దండవేసి పెళ్లిచేసుకుంది, ఆవిడే ఆయనని వదిలి వెళ్లిపోయింది. కానీ రామచందృడు తన తండ్రి దశరధమహరాజులాగా ముగ్గురుభార్యలు కలిగినవాడుగాదు. ఏకపత్నీవ్రతుడు అందువల్ల ఆయన స్వర్ణసీతను పక్కనపెట్టుకోవాల్సిన అవసరం వచ్చింది. అందుకే పెళ్లి సమయంలో రాయి తొక్కించి మరీ ’పర్వతాఇవ విచాచలీ’ భూమిమీద పర్వతంలాగా నా జీవితంలో ఉండు అని ప్రార్థిస్తాడు. ఆవిడ అశ్మం తొక్కి అలాగే అని ప్రతిజ్ఞ చేస్తుంది. అంటే ఆవిడ ’ఉండకపోవచ్చు’ అనే అర్థం ఉన్నదిగదా?! అలాగే పెళ్లి సమయంలో కన్యాదానం సమయంలో తెర అడ్డం పెడతారు తెర తొలగించిన వెంఠనే ’అఘోరచక్షు’ అనే మంత్రం చదువుతారు. అంటే ’భర్తను చంపనిదిగా’ ఉండే కోరిక కోరడం జరిగింది. అంటే ఆవిడ చంపేచూపుచూసే అవకాశం ఉన్నదనే గదా అర్ధం?! హైందవ ధర్మంలో భార్యభర్త అనేవారు సయోధ్యగా ఉన్నంతవరకే అది వివాహం. వారు విడిపోవడంగూడా అంతే సహజం.

****
కొందరు మొగవారు ఒక్క స్త్రీతోటే జీవితాంతం ప్రేమగా నిలవగలుగుతాడు. అదేవిధంగా స్త్రీగూడా ఒక్క మొగవానికే ప్రేమగాలొంగి జీవితాంతం ఉండగలుగుతుంది. కానీ ఈశ్వర సృష్టి అంతా ఇలా ఉండదు…. అనేకమంది ఆడవారితో ప్రేమలో పడిన మగవారిని నేను ఎరుగుదును, అలాగే అనేకమంది మగవారితో ప్రేమలో పడిన ఆడవారినిగూడా ఎరుగుదును. కాబట్టి బహుభార్యత్వాన్ని బహు భర్తృత్వాన్ని సనాతన హిందూ ధర్మం గర్హించదు అని నా నమ్మకం… అది పాపంగూడా గాదు… కానీ రాజశాసనాన్ని చేసి లెజిస్లేటివ్ మార్గంలో హిందువుల స్వేచ్చాజీవనానికి అడ్డుతగిలినట్లు అనిపిస్తోంది.

స్వస్తి….

ప్రేమతో కాంతితో మీ మాధవ తురుమెళ్ల